ttdp mla
-
'రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఐరన్‌లెగ్'
హైదరాబాద్ : టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ఐరన్‌లెగ్ అని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి టీడీపీలో చేరిన నాటి నుంచి అన్ని అపజయాలే అని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో మిగిలిన ఒకరిద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు త్వరలో టీఆర్ఎస్లో చేరతారని జీవన్‌రెడ్డి జోస్యం చెప్పారు. -
టీడీపీని వద్దనుకుంటున్నారు: బాల్క సుమన్
హైదరాబాద్ : కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. ప్రలోభాలు పెట్టే చరిత్ర రేవంత్‌రెడ్డిది అని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేలను కొనుగోలుకు యత్నించి జైలు పాలైన ఘనత రేవంతరెడ్డిది అని సుమన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కావాల్సిందే అని ఎద్దేవా చేశారు. రేవంత్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని బాల్క సుమన్ విమర్శించారు. ఈ రాష్ట్రంలో ప్రలోభాలు చరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసునన్నారు. పక్క రాష్ట్రంలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఎస్పీవై రెడ్డికి పచ్చకండువా కప్పారని, ఆయనకు మరి టీడీపీ పార్టీ ఏం ప్రలోభపెట్టిందని బాల్క సుమన్ సూటిగా ప్రశ్నించారు. టీడీపీ పక్క రాష్ట్రంలో ఏం చేస్తుందో గుర్తు తెచ్చుకుని మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణలో టీడీపీని బతికించుకుందామనే ప్రయత్నం సాధ్యం కాదంటూ రేవంత్‌కు సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ కేవలం ఏపీకి మాత్రమే పరిమితం కావాల్సిందేనని బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ ప్రజలు టీడీపీని వద్దనుకుంటున్నారని, రేవంత్ ఎంత మొరిగినా టీడీపీ ఉండదని ఆయన వ్యాఖ్యలు చేశారు. -
కేసీఆర్ బృందం పాస్ పోర్ట్‌లు బయటపెట్టాలి
హైదరాబాద్ : ఇటీవల చైనా పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం తమ పాస్ పోర్ట్‌లను బయటపెట్టాలని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. చైనాలోని మకావులో సీఎం కేసీఆర్ బృందం జల్సా చేసిందని ఆరోపించారు. మంగళవారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన 'రైతు కోసం దీక్ష' కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఓ వైపు రాష్ట్రంలో రైతులు చనిపోతుంటే... మరో వైపు సచివాలయంలో ప్రభుత్వం బర్త్‌డే పార్టీలు జరుపుకుంటుందని విమర్శించారు. రైతులు చనిపోతుంటే ఒక్క మంత్రి కూడా వారి కుటుంబాలను పరామర్శించడం లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. శాసనసభలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్ ప్రభుత్వం చూస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. -
ఎమ్మెల్యే సండ్రకు బెయిల్ మంజూరు
హైదరాబాద్ : 'ఓటుకు కోట్లు' కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టు మంగళవారం కూడిన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరుకు రూ. 2 లక్షల పూచీకత్తు చెల్లించాలని పేర్కొంది. అలాగే నియోజకవర్గం దాటి వెళ్లకూడదని ఏసీబీ కోర్టు పేర్కొంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సండ్ర ఏసీబీ కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో సండ్రకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
'ఏడాదైనా పాలన గాడిలో పడలేదు'
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, ఎమ్మెల్యే వివేక్ బుధవారమిక్కడ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినా పాలన గాడిలో పడలేదని వారు ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు దృష్టి పెట్టకపోవడంతోనే సమ్మెలు, ఉద్యమాలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. ఉపాధి హామీ, మున్సిపల్, రెవిన్యూతోపాటు అన్ని శాఖ ఉద్యోగులు రోడ్డున పడ్డారన్నారు. ఉద్యమ న్యాయకుడిగా అధికారులు, పాలకుల ఇళ్ల ముందు చెత్తవేయాలని గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. కేసీఆర్ చెప్పిన ఈ మాటలను ప్రస్తుతం మున్సిపల్ ఉద్యోగులు మళ్లీ ఆయనకే అప్పచెబుతున్నారన్నారు. వెంటనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి ప్రజల సమస్యలు తీర్చాలని ఎల్.రమణ, వివేక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సోమేష్ కుమార్ అదికార పార్టీ తొత్తులా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఎల్ రమణ, వివేక్ ఆరోపించారు. -
రేవంత్‌రెడ్డి సున్నిత మనస్కుడు: గీత
హైదరాబాద్: టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి ప్రజా సమస్యలపై దూకుడు తగ్గించరని ఆయన భార్య గీత స్పష్టం చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్ట్ అయిన రేవంత్‌రెడ్డికి మంగళవారం హైకోర్టు బెయిల్ మంజురు చేయడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో గీత విలేకర్లతో మాట్లాడారు. తన భర్త రేవంత్‌కు రాజకీయంగా ఇబ్బందులు వస్తాయనుకున్నామని కానీ వ్యక్తిగత సమస్యలు ఎదురవుతాయని మాత్రం ఊహించలేదన్నారు. రేవంత్ దూకుడుగా కనిపించిన.. చాలా సున్నితమైన మనిషి అని చెప్పారు. కష్టకాలంలో పార్టీ అధినేతతో సహా కార్యకర్తలు తమ వెంటే ఉన్నారని ఆమె గుర్తు చేసుకున్నారు. క్లిష్ట సమయంలో తమ కుటుంబాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి గీత ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తమ వివాహం అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇంతకాలం తమ కుటుంబానికి దూరంగా లేరని గీత గుర్తు చేసుకున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్‌రెడ్డి గత నెలలో తెలంగాణ ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తనకు బెయిల్ ముంజూరు చేయాలని రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రేవంత్‌కు హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. -
'పాలన చేతకాకపోతే దిగిపోవాలి'
-
'పాలన చేతకాకపోతే దిగిపోవాలి'
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌పై టీటీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు బుధవారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. పాలన చేతకాకపోతే పదవి నుంచి దిగిపోవాలని గవర్నర్ నరసింహన్‌కు ఎర్రబెల్లి సూచించారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే తమ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడానికి ఏసీబీ వస్తోందని ఆరోపించారు. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ అరెస్ట్ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇరు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు వేర్వేరుగా గవర్నర్ నరసింహన్‌ను కలిసి వివరించారు. టీటీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలకు ఏసీబీ మంగళవారం రాత్రి నోటీసులు జారీ చేసింది. దీంతో నరేందర్ రెడ్డి బుధవారం ఉదయం ఏసీబీ ఎదుట హాజరయ్యారు. ఇంత జరుగుతున్నా గవర్నర్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని టీటీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. -
రేవంత్‌కు టీ టీడీపీ బాధ్యతలు ?
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కలకలం రేపిన పోస్టర్లు హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు కొడంగల్ ఎమ్మెల్యే ఎ. రేవంత్‌రెడ్డికి అప్పగించాలంటూ తెలుగుయువత పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో సోమవారం వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. టీడీపీ కార్యాలయానికి సోమవారం ఉదయాన్నే వచ్చిన కొందరు వ్యక్తులు నోటీస్‌బోర్డులో చంద్రబాబు పోస్టర్ల పక్కన 4 ప్రింటెడ్ కాగితాలను అంటించారు. దీన్ని గమనించిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి నిధులు ఈ పోస్టర్లను చూపిస్తూ తెలంగాణ టీడీపీలో నెలకొన్న లుకలుకలపై వార్తా కథనాన్ని ప్రసారం చేయడంతో పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. టీడీపీ మేలో నిర్వహించే మహానాడు కార్యక్రమంలో టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎ. రేవంత్‌రెడ్డిని నియమిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పోస్టర్లు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ‘సాక్షి’ తో మాట్లాడుతూ ఎవరో ఆకతాయిలు చేసిన పనిగా కొట్టిపారేశారు. -
'దమ్ముంటే రాజీనామా చేసినట్లు ప్రకటించాలి'
హైదరాబాద్: తెలంగాణలో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి చేపట్టిన తలసాని శ్రీనివాస యాదవ్‌కి టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బహిరంగ సవాల్ విసిరారు. శుక్రవారం హైదరాబాద్ సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ... దమ్ముంటే రాజీనామా చేసినట్లు సభలో ప్రకటించాలని ఆయన తలసానికి సవాల్ విసిరారు. ఎన్నికలకు తలసాని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే రాజీనామాను ఆమోదింప చేసుకోవట్లేదని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టేందుకే తలసాని రాజీనామా డ్రామా ఆడుతున్నారని సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి తలసాని టీడీపీ టిక్కెట్‌పై గెలుపొందారు. అనంతరం టీడీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన ఇప్పటి వరకు తన రాజీనామాను ఆమోదించుకోలేకపోయారు. దీంతో తలసాని వైఖరిపై పలు రాజకీయ పార్టీల వారు ఆరోపణలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. -
'ఇది బీసీల వ్యతిరేక బడ్జెట్'
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీసీల వ్యతిరేక బడ్జెట్ అని టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. బడ్జెట్లో చేతి వృత్తులకు ఆశించిన కేటాయింపులు లేవన్నారు. కేసీఆర్ సర్కార్ బీసీ వ్యతిరేక వైఖరిని ప్రజలలో ఎండగడతామన్నారు. జనాభా దామాషా పద్దతిన బీసీ సంక్షేమానికి రూ. 10 వేల కోట్లు కేటాయించాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమానికి నిధులు కేటాయించకపోతే వారు పన్నులు కట్టరని చెప్పారు. పార్టీలకు అతీతంగా బీసీలను ఏకం చేసి కేసీఆర్ ప్రభుత్వంపై ఉద్యమిస్తామని ఈ సందర్బంగా ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. -
'రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు'
-
'రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మొదటి బడ్జెట్ ఫ్యామిలి బడ్జెట్ అయితే... రాబోయేది దొరల బడ్జెట్ అని టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్‌తో రేవంత్‌రెడ్డి సాక్షి మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... గవర్నర్ ప్రసంగంతోనే ప్రభుత్వంపై నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. బడ్జెట్ కంటే ముందు సమస్యలపై ప్రభుత్వ విధానాన్ని పరిశీలించాలన్నారు. ఆదాయం, ఆలోచన లేకుండానే రూ. లక్ష కోట్ల బడ్జెట్ అంటున్నారని విమర్శించారు. పార్టీ మారినవారిపై అనర్హత వేటు వేయకుండా రాజకీయ వ్యభిచారం చేస్తున్నారంటూ కేసీర్ ప్రభుత్వంలోని పెద్దలపై రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. -
కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే ఆత్మహత్యలు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు జరిగాయని టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్ కేంద్రానికి తప్పుడు నివేదిక ఇచ్చారని విమర్శించారు. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వికలాంగులు, వితంతువులను కేసీఆర్ అవమాన పరుస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. -
ఎయిర్‌పోర్ట్‌కు రాజీవ్ పేరే ఉంటుంది ... కానీ
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు రాజీవ్‌గాంధీ పేరే కొనసాగుతుందని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య స్పష్టం చేశారు. కాని డొమెస్టిక్ టెర్మినల్‌కు మాత్రం మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సండ్ర వెంకట వీరయ్య మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో నూతనంగా మరో విమానాశ్రయం నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది... ఈ నేపథ్యంలో ఆ విమానాశ్రయానికి ఏ పేరు పెట్టినా తమకు అభ్యంతరం లేదని సండ్ర వెంకట వీరయ్య వ్యాఖ్యానించారు. విమానాశ్రయ పేరు మార్పును రాద్ధాంతం చేయడం సరికాదని ఆయన అధికార, కాంగ్రెస్ పార్టీలకు హితవు పలికారు. -
వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వండి: సండ్ర
హైదరాబాద్: ప్రభుత్వ సర్వీసులో ఉండి అనార్యోగంతో విధులు నుంచి తప్పుకున్న వారి కుటుంబ సభ్యులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమం సమయంలో సకల జనుల సమ్మె కాలాన్ని మిగిలిన ఉద్యోగుల వలే సింగరేణి ఉద్యోగులను కూడా వేతనంతో కూడిన సెలవు దినాలుగా పరిగణించాలని ప్రభుత్వానికి సూచించారు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 9 నియోజకవర్గాలకు రెండో పంటకు నీరు అందించేలా చర్యలు చేపట్టాలని... అలాగే నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా పంటలకు నీరు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సండ్ర వెంకట వీరయ్య సూచించారు. -
కేసీఆర్ కూతురంటే నిజాం కూతురా ?
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ హిట్లర్ కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారని టీటీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని ఆయన అన్నారు. గురువారం తెలంగాణ అసెంబ్లీలో టీటీడీపీ ఎమ్మెల్యేలను వారం పాటు సస్పెండ్ చేశారు. దాంతో ఎర్రబెల్లితోపాటు మిగతా టీటీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సమగ్ర సర్వేలో సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత రెండు చోట్ల తన వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేసుకున్నారని... దీనిపై సమాధానం ఇవ్వాలని తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రశ్నించారని గుర్తు చేశారు. ఈ విషయం వాస్తవమా కాదా అన్న విషయం సభలో వెల్లడించాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉందని ఎర్రబెల్లి అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా రెండురోజులగా అసెంబ్లీ సమావేశాలు జరగకుండా గందరగోళం సృష్టిస్తుందని విమర్శించారు. ప్రజల సమస్యలను నిలదీస్తామనే ఉద్దేశ్యంతోనే తమను సభ నుంచి వారం రోజుల పాటు సస్పెండ్ చేసేశారని ఆరోపించారు. ప్రభుత్వమే కాదు స్పీకర్ కూడా ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం, స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టెందుకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కవిత విషయంపై సభలో ప్రశ్నిస్తే.... నా కూతురు గురించి మాట్లాడుతారా అంటూ కేసీఆర్, తమ సీఎం కూతురు గురించి మాట్లాడుతారా అంటూ టీఆర్ఎస్ సభ్యులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కూతురంటే నిజాం కూతురా? ఆమె గురించి ప్రశ్నించడం తప్పా అని విలేకర్ల ఎదుట ఎర్రబెల్లి ప్రశ్నించారు. -
రేవంత్... సభ్యులను తక్కువ చేసి మాట్లాడాడు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ్యులను తక్కువ చేసి టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడాడని సీఎం కేసీఆర్ ఆరోపించారు. శాసనసభ్యుల పట్ల తప్పుగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి వాటిని సరి చేసుకుంటే బాగుండేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. గురువారం తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ... సభలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని సూచించారు. అలాగే సభలో ఒకరినొకరు గౌరవించుకోవాలని సూచించారు. సభలో చర్చలు జరిగే సమయంలో మాటలు దొర్లడం సహజమేనని కేసీఆర్ అన్నారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సభలో చర్చలు జరిగిన సమయంలో తప్పులు దొర్లితే వెంటనే క్షమాపణలు చెప్పేవారని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. బుధవారం మధ్యాహ్నం విరామం అనంతరం తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కాగానే రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని అధికార పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. ఆ సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ జోక్యం చేసుకునిపై విధంగా స్పందించారు. -
నీతులు చెబుతున్న హరీష్‌రావు: సండ్ర
హైదరాబాద్: గతంలో అసెంబ్లీలో వ్యవహరించిన తీరును మరిచిపోయి భారీ నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు ప్రస్తుతం నీతులు చెబుతున్నారని టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎద్దేవా చేశారు. టీటీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడిన తర్వాత అసెంబ్లీ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో టీడీపీ లేకుండా చేయాలని అధికార టీఆర్ఎస్ నేతలు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. అందులోభాగంగానే టీడీపీపై దౌర్జన్యం చేస్తున్నారని విమర్శించారు. అమరవీరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో వారి సంఖ్యను తగ్గించారని ఆయన గుర్తు చేశారు. ఈ విధంగా అమరవీరుల త్యాగాలను అవమానిస్తున్నారని సండ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పట్ల అవమానకరంగా మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారంతో క్షమాపలు చెప్పించాలని అధికార పార్టీకి సూచించారు. ఆ తర్వాతే ఎలాంటి చర్చకైనా సిద్ధమని సండ్ర స్పష్టం చేశారు. ప్రతిపక్షంగా ఉండాల్సిన ఎంఐఎం అధికార పార్టీకి తొత్తుగా మారి భజన చేస్తుందని విమర్శించారు. తమపై విధించిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని అధికార పార్టీ టీఆర్ఎస్ను డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై సభలో చర్చించాలని డిమాండ్ చేస్తూ టీటీడీపీ శుక్రవారం సభ కార్యక్రమాలకు అడ్డుతగిలింది. ఆ క్రమంలో టీటీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయాలని సభలో హరీష్ రావు తీర్మానం ప్రవేశ పెట్టారు. దాంతో స్పీకర్ టీటీడీపీ ఎమ్మెల్యేలపై ఓ రోజు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నేపథ్యంలో హరీష్‌రావుపై సండ్ర వెంకట వీరయ్య పైవిధంగా స్పందించారు. -
'పోచారం.... సభకు క్షమాపణలు చెప్పాలి'
హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెంటనే సభకు క్షమాపణలు చెప్పాలని టీటీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఎర్రబెల్లి అసెంబ్లీ సభలో మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యలపై చర్చించాలా వద్దా అని అధికార పక్షమైన టీఆర్ఎస్ను ప్రశ్నించారు. సభలో వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు ఉత్తగా లేరని అధికార పార్టీకి వెల్లడించారు. రైతుల సమస్యలపై గళమెత్తిన తమపై ఎదురుదాడి చేస్తే చూస్తు ఊరుకోమని టీఆర్ఎస్కు హెచ్చరించారు. -
పోచారం... రైతుల పాలిట గ్రహచారం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయశాఖ మంత్రి కావడం రైతుల పాలిట గ్రహచారమని టీటీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రైతుల ఆత్మహత్యలపై అవహేళనగా మాట్లాడిన పోచారం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన నేపథ్యంలో మీడియా పాయింట్ వద్ద రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ... సభలో రైతుల ఆత్మహత్యలపై చర్చ జరిగేవరకు సభను అడ్డుకుంటామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజా సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, ఆత్మబలిదానాలపై టీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు అవమానకరంగా వ్యవహరిస్తున్నారని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. -
'కేసీఆర్ కుటుంబంపైనే 420 కేసు పెట్టాలి'
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌పై టీటీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయం మోసాలతోనే ప్రారంభమైందని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో దళితుడిని సీఎం చేస్తానని చెప్పి ... ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కేసీఆర్ ఆ విషయాన్ని పక్కన పెట్టారని గుర్తు చేశారు. కేంద్రమంత్రిగా ఉండి కూడా తెలంగాణను పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ పరువును కేసీఆర్ ఢిల్లీలో తాకట్టు పెట్టాడని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమం పేరుతో జేఏసీ, కోదండరామ్‌లను ఉపయోగించుకుని... ఆ తర్వాత వారిని వదిలేశారని అన్నారు. ప్రస్తుతం జేఏసీ, కోదండరామ్ ఇప్పుడు ఎక్కడున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఎర్రబెల్లి ప్రశ్నించారు. -
జగదీశ్ని బర్తరఫ్ చేయాలి... జూపల్లిని అరెస్ట్ చేయాలి
హైదరాబాద్: నల్గొండలో జిల్లా టీడీపీ కార్యాలయంపై దాడికి ముగ్గురు టీఆర్ఎస్ నేతలు బాధ్యులని టీటీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్‌తో టీటీడీపీ ఎమ్మెల్యే భేటీ అయ్యారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు, కరెంట్ కోతలు, టీడీపీ కార్యాలయాలపై దాడులను ఈ సందర్భంగా టీటీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌కు వివరించారు. అనంతరం ఎర్రబెల్లి దయాకరరావు విలేకర్లతో మాట్లాడుతూ... మంత్రి జగదీశ్‌రెడ్డి రెచ్చగొట్టడం వల్లే ఈ దాడులు జరిగాయని తెలిపారు. రైతు సమస్యలపై దృష్టి మరల్చేందుకే ఈ దాడులు అని ఆయన విమర్శించారు. జూపల్లి కృష్ణారావు ఎస్ఎంఎస్లు ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. జగదీశ్‌రెడ్డిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని... అలాగే జూపల్లిని అరెస్ట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ దగ్గరుండి మరీ మాపై దాడి చేయించారన్నారు. ఈ దాడిలో తమ కార్ల అద్దాలను పగలగొట్టించారన్నారు. చంద్రబాబు, టీడీపీపై కేసీఆర్ తెలంగాణ ప్రజలకు తప్పుడు సంకేతాలను ఇస్తున్నారని అన్నారు. కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ. 30 వేలు చొప్పున పరిహారం చెల్లించాలని... అలాగే ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి రూ. 10 లక్షలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కేసీఆర్ సక్సెస్ అంతా ఎమ్మెల్యేలను లాక్కోవడంలోనే
హైదరాబాద్ : కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని టీటీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్, సర్టిఫికేట్లు, ఇంజనీరింగ్ కౌన్సెలింగ్, విద్యుత్ కోతలు.. అన్ని ప్రభుత్వ ఆసమర్థత వల్లే రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఎర్రబెల్లి విలేకర్ల సమావేశంలో కేసీఆర్ ప్రభుత్వం ఐదునెలల పాలనపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఏడు సార్లు మొట్టికాయలు వేసిందని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. సీఎంగా కేసీఆర్ అసమర్థత కారణంగానే 240 మంది మృతి చెందారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏ విషయంలోనైనా సక్సెస్ అయింది అంటే టీడీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కోవడంలోనే అని ఎద్దేవా చేశారు. అఖిలపక్షంలో ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా నిలదీస్తామని చెప్పారు. పంట పండించిన రైతులకు గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదని ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు.