కేసీఆర్ సక్సెస్ అంతా ఎమ్మెల్యేలను లాక్కోవడంలోనే
హైదరాబాద్ : కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని టీటీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్, సర్టిఫికేట్లు, ఇంజనీరింగ్ కౌన్సెలింగ్, విద్యుత్ కోతలు.. అన్ని ప్రభుత్వ ఆసమర్థత వల్లే రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. బుధవారం హైదరాబాద్లో ఎర్రబెల్లి విలేకర్ల సమావేశంలో కేసీఆర్ ప్రభుత్వం ఐదునెలల పాలనపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఏడు సార్లు మొట్టికాయలు వేసిందని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. సీఎంగా కేసీఆర్ అసమర్థత కారణంగానే 240 మంది మృతి చెందారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏ విషయంలోనైనా సక్సెస్ అయింది అంటే టీడీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కోవడంలోనే అని ఎద్దేవా చేశారు. అఖిలపక్షంలో ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా నిలదీస్తామని చెప్పారు. పంట పండించిన రైతులకు గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదని ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు.