
రేవంత్... సభ్యులను తక్కువ చేసి మాట్లాడాడు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ్యులను తక్కువ చేసి టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడాడని సీఎం కేసీఆర్ ఆరోపించారు. శాసనసభ్యుల పట్ల తప్పుగా మాట్లాడిన రేవంత్రెడ్డి వాటిని సరి చేసుకుంటే బాగుండేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. గురువారం తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ... సభలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని సూచించారు. అలాగే సభలో ఒకరినొకరు గౌరవించుకోవాలని సూచించారు. సభలో చర్చలు జరిగే సమయంలో మాటలు దొర్లడం సహజమేనని కేసీఆర్ అన్నారు.
గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సభలో చర్చలు జరిగిన సమయంలో తప్పులు దొర్లితే వెంటనే క్షమాపణలు చెప్పేవారని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. బుధవారం మధ్యాహ్నం విరామం అనంతరం తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కాగానే రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని అధికార పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. ఆ సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ జోక్యం చేసుకునిపై విధంగా స్పందించారు.