టీడీపీని వద్దనుకుంటున్నారు: బాల్క సుమన్
హైదరాబాద్ : కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిపై పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. ప్రలోభాలు పెట్టే చరిత్ర రేవంత్రెడ్డిది అని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేలను కొనుగోలుకు యత్నించి జైలు పాలైన ఘనత రేవంతరెడ్డిది అని సుమన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్కే పరిమితం కావాల్సిందే అని ఎద్దేవా చేశారు. రేవంత్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని బాల్క సుమన్ విమర్శించారు. ఈ రాష్ట్రంలో ప్రలోభాలు చరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసునన్నారు.
పక్క రాష్ట్రంలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఎస్పీవై రెడ్డికి పచ్చకండువా కప్పారని, ఆయనకు మరి టీడీపీ పార్టీ ఏం ప్రలోభపెట్టిందని బాల్క సుమన్ సూటిగా ప్రశ్నించారు. టీడీపీ పక్క రాష్ట్రంలో ఏం చేస్తుందో గుర్తు తెచ్చుకుని మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణలో టీడీపీని బతికించుకుందామనే ప్రయత్నం సాధ్యం కాదంటూ రేవంత్కు సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ కేవలం ఏపీకి మాత్రమే పరిమితం కావాల్సిందేనని బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ ప్రజలు టీడీపీని వద్దనుకుంటున్నారని, రేవంత్ ఎంత మొరిగినా టీడీపీ ఉండదని ఆయన వ్యాఖ్యలు చేశారు.