ఇన్సులిన్ మొక్క
ఇంట్లోనే స్వయంగా పెంచుకుంటున్న నగరవాసి
డయాబెటిస్, బీపీ తదితర దీర్ఘకాలిక వ్యాధులు నగరవాసులకు వీడని నీడలుగా మారుతున్నాయి. వైద్యసాయం తీసుకుంటున్నా, మందులు వాడుతున్నా.. తగ్గేదెలే.. అన్నట్టుగా వదలకుండా వెంటాడుతున్న వ్యాధుల విషయంలో కొందరు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా ఇంట్లోనే మెడిసినల్ ప్లాంట్స్‌ను సైతం పెంచుకుంటున్నారు. – సాక్షి, సిటీబ్యూరో
రక్తంలో చక్కెర స్థాయిలు, మధుమేహాన్ని నియంత్రించడానికి, ఇన్సులిన్ సహా అనేక రకాల మందులు చికిత్సలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే కారణాలేవైనా.. కొందరు ప్రత్యామ్నాయ విధానాలను ప్రయత్నిస్తున్నారు. మధుమేహంతో పోరాడేందుకు ఔషధ మొక్కలను పెంచుతున్నారు మాజీ సాఫ్ట్‌వేర్ నిపుణుడు మొట్టమర్రి సందీప్.
టెర్రస్‌లో.. ట్రీట్‌మెంట్..
ఇన్సులిన్ మొక్క ఆకులు మధుమేహం నిర్వహణలో ఉపయోగపడతాయని, ఇన్సులిన్ మొక్కల ప్రయోజనాలను గుర్తించి, వాటిని మొహిదీపట్నంలోని తన ఇంటి టెర్రస్‌పై సేంద్రీయంగా పెంచడం ప్రారంభించారు సందీప్. తన మధుమేహం చికిత్స కోసం ఈ సహజమైన విధానాన్ని ఆయన అనుసరించాడు. తన టెర్రస్‌ను ఆరోగ్యానికి తోటగా మార్చాడు. మందులు, ఇంజెక్షన్లకు బదులు ఇన్సులిన్ ఆకులను తీసుకోవడం ద్వారా, ఏడు సంవత్సరాలుగా తన మధుమేహాన్ని అదుపులో ఉంచుకోగలిగానని ఆయన అంటున్నారు. ‘నేను మందులు మానేసి ఏడేళ్లుగా ఇన్సులిన్ మొక్క ఆకులను తీసుకుంటున్నాను. దాంతో ఈ ఏడేళ్లలో డాక్టర్‌ను కలవాల్సిన అవసరం రాలేదు’ అని ఆయన చెప్పారు. ఆయన చెబుతున్న ప్రకారం.. ఇన్సులిన్ ప్లాంట్ తగిన స్థాయిలో పరిపక్వానికి చేరేందుకు దాదాపు నాలుగు నెలల సమయం పడుతుంది.
పెంపకం.. పంపకం..
ఇన్సులిన్ మొక్కలతో పాటు అతను కొన్ని కూరగాయలతో పాటు రణపాల వివిధ రకాల తులసి వంటి ఇతర ఔషధ మొక్కలను కూడా ఆయన పెంచుతున్నారు. ఆయన దగ్గర ఉన్న మెడిసినల్ ఇన్సులిన్ ప్లాంట్ల గురించి ఆ నోటా.. ఈ నోటా విని సుదూర ప్రాంతాల నుంచీ కాల్స్ వస్తుంటాయన్నారాయన. ఓపికగా మొక్క ప్రయోజనాలను వివరిస్తానని, మొక్కలను తీసుకెళ్లడానికి వచ్చే వ్యక్తులకు నామమాత్రపు ధరకు వాటిని అందిస్తూనే, మొక్కలను పెంచే చిట్కాలను చెప్తానన్నారు. ‘ఆకులను క్రమం తప్పకుండా తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు క్షీణించడాన్ని గమనించినట్లు చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు’ అని ఆయన చెప్పారు. అయితే ఒక రోజులో 2 కంటే ఎక్కువ ఆకులను వాడొద్దని ఆయన సలహా ఇస్తారు. అధిక మోతాదు కారణంగా సంభవించే ప్రమాదాలను నివారించడానికి ఉదయం ఒక ఆకు సాయంత్రం మరో ఆకును తీసుకోవాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment