Photo: Flatwater Free Press
ఒమాహా నగరఒమాహా.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన నెబ్రాస్కాలోని ముఖ్య నగరం. ఇక్కడ సేంద్రియ ఇంటి పంటల ఉద్యమం తామర తంపరగా విస్తరించింది. నగరంలో ఎటు చూసినా చిన్న చిన్న కమ్యూనిటీ కిచెన్ గార్డెన్స్ ఉంటాయి. అక్కడక్కడా విస్తారమైన అర్బన్ గార్డెన్లు కనిపిస్తాయి. సుమారు 5 లక్షల జనాభా గల ఒమాహాలో ఆఫ్రికన్ అమెరికన్లు(12%), ఆసియన్లు(5%) సహా వివిధ జాతులవారుంటారు. వారంతా తమవైన సంప్రదాయ సేంద్రియ ఇంటిపంటల సాగు ద్వారా కమ్యూనిటీలను పోషించుకునే పనిలో వున్నారు అంటే అతిశయోక్తి లేదు. నగరంలోని ఖాళీ స్థలాల్లో పంటలు పండించేందుకు 2014లో ఒమాహా ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ అనుమతించిన తర్వాత కమ్యూనిటీ గార్డెన్ల సంఖ్య 58కి పెరిగింది.
ఖాళీ స్థలాలను ఆకర్షణీయమైన హరిత ప్రదేశాలుగా మార్చారు. ఆహార లభ్యత సమస్యలతో బాధపడుతున్న వారి కోసం కూరగాయలు, ఆకుకూరలను పెంచుతున్నారు. కమ్యూనిటీ గార్డెన్‌లు కిరాణా దుకాణాలకు ఎప్పుడూ చూసి ఎరుగని దేశీయ ఆహారోత్పత్తులను అందిస్తూండటం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
అలనాటి విక్టరీ గార్డెన్స్ మాదిరిగా..
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఒమాహాలో ‘విక్టరీ గార్డెన్స్’ ఉండేవని మేరీ కార్పెంటర్ తన బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ‘కూరగాయలు, పండ్లు పెంచుకునే పెరటి తోట ప్రతి ఒక్కరికీ ఉండేది. ఆస్పరాగస్, బంగాళదుంపలు, టొమాటోలు, బ్లాక్ రాస్ బేర్రీస్, ద్రాక్ష వంటివన్నీ యుద్ధ కాలంలో పండించుకొని తినే వాళ్ళం. తరువాతి కాలంలో కిరాణా దుకాణాల్లో సంవత్సరం పొడవునా అన్నీ అమ్మటంతో ఆ తోటలు చాలా వరకు అదృశ్యమయ్యాయి. 80 ఏళ్ల తర్వాత మళ్లీ పెరటి తోటలు కొత్తగా వెలుస్తున్నాయి.. మంచిదే’ అన్నారు మేరీ హ్యాపీగా.
తమదైన తాజా ఆహారంపై ఆసక్తి
ఒమాహా ‘ఆధునిక అర్బన్ అగ్రికల్చర్ గురు’గా చెప్పదగిన వ్యక్తి జాన్ పోర్టర్. నెబ్రాస్కా ఎక్స్‌టెన్షన్ ఆఫీస్‌లో విద్యాధికారి. ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని స్థానికంగా పెంచుకోవాల్సిన ఆవశ్యకత గురించి, ఆ ఉద్యమం వెనుక ఉన్న కథపై ఆసక్తిని కల్పించినందున నగరంలో తోటలు విస్తరిస్తున్నాయన్నారు. కోవిడ్ మహమ్మారి దాన్ని మరింత పెంచింది. అన్నింటికంటే, తమదైన తాజా ఆహారం తినాలన్న ఆకాంక్ష ఇందుకు మూలం అన్నారు జాన్.
సిటీ స్ప్రౌట్స్‌లో తొలి అడుగులు..
సిటీ స్ప్రౌట్స్ ఒమాహాలో సేంద్రియ ఇంటి పంటల సాగును అలవాటు చేసిన స్వచ్ఛంద సంస్థల్లో ముఖ్యమైనది. ఇప్పుడు ఈ సంస్థ 45 చిన్నపాటి గార్డెన్ ప్లాట్‌లను నిర్వహిస్తోంది. ఉత్తర ఒమాహాలోని డెకాటూర్ అర్బన్ ఫార్మ్‌లో పండ్ల చెట్లు, బెర్రీ పొదలను భారీ సంఖ్యలో పెంచుతోంది. కమ్యూనిటీ గార్డెన్స్, అర్బన్ ఫామ్‌ల మధ్య వ్యత్యాసం గురించి చెబుతూ సిటీ స్ప్రౌట్స్ మేనేజర్ షానన్ కైలర్ .. ‘నిర్దిష్ట కమ్యూనిటీ కోసం తరచుగా ఎత్తైన మడుల్లో కూరగాయలను పండించేది కమ్యూనిటీ గార్డెన్. అర్బన్ వ్యవస్థ క్షేత్రం కూరగాయలు, పండ్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తుంది. సిటీ స్ప్రౌట్స్ ప్రతిరోజూ వందలాది స్థానిక కుటుంబాలకు తాజా ఆహారాన్ని ఉచితంగా అందిస్తుంది. తాజా ఆహారాన్ని అందించటానికి అర్బన్ ఫారమ్స్ నిజంగా చక్కని మార్గం’ అంటారు.
నాన్సీ విలియమ్స్ ‘నో మోర్ ఎంప్టీ పాట్స్’ను ద్వారా ఆహార స్వయం సమృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ‘పాప్–అప్ ఒయాసిస్’ గార్డెన్.. దేశీయ వంగడాలు సాగయ్యే కమ్యూనిటీ గార్డెన్. గత దశాబ్దంలో ఒమాహాలో ఉద్భవించిన డజన్ల కొద్దీ కొత్త కమ్యూనిటీ గార్డెన్లలో ఇదొకటి. హార్టికల్చరిస్ట్ నాన్సీ స్కాట్ తదితరులు అందులో పంటలు పండిస్తున్నారు. గస్ వాన్ రోన్న్ ‘ఒమాహా పెర్మాకల్చర్’ను స్థాపించి ఒమాహాలోని ఆడమ్స్ పార్క్ పరిసరాల్లోని ఖాళీ స్థలాలను ఆర్గానిక్ గార్డెన్స్‌గా మార్చారు. (క్లిక్ చేయండి: నెలకు లక్ష జీతం.. సాఫ్ట్‌వేర్ వదిలి ‘సాగు’లోకి..)
– పంతంగి రాంబాబు
prambabu.35@gmail.com
Comments
Please login to add a commentAdd a comment