దాదాపు సగం జనాభాలో మధుమేహం కనిపిస్తే తెలిసొచ్చింది .. నేల నెరిగి సాగు చేయాలని! భూమాతను గౌరవిస్తే ఆరోగ్య సిరిని ఒంటికందిస్తుందని! కనుమరుగవుతున్న దేశవాళీ ధాన్యానికి మళ్లీ నారుపోయాలని! అందుకే ఇప్పుడు కర్షకలోకమంతా సేంద్రియ సాగు వైపు మళ్లింది! ఆ బాటలోనే.. ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం వాసి పొట్టిపోతుల పోతురాజు కూడా నడుస్తూ తోటి రైతులకు స్ఫూర్తి పంచుతున్నారు.
పుడమితల్లి బాగుంటే ఆ తల్లిని నమ్ముకున్న జనం కూడా బాగుంటారు. భావితరాల ఆరోగ్యానికీ భరోసా ఉంటుంది. అదే లక్ష్యంతో ప్రకృతి వ్యవసాయానికి నాగలి పట్టింది ‘ఆర్గానిక్ ప్లానెట్’. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ మూవ్ టు నేచర్, నేచర్ ఫ్రెండ్లీ నినాదాలతో వేదభారత్ నేచురల్ ఫుడ్ ప్రోడక్ట్స్ పేరిట దేశవాళీ బియ్యాన్ని అందిస్తోంది. ‘భూమి మీది.. విత్తనం, మార్గదర్శనం మావి! పండించిన పంటకు మార్కెటింగ్ సహకారం కూడా మాదే’ అంటూ తెలుగు రాష్ట్రాల రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గేలా చేస్తోంది. అలా పోతురాజు కూడా సేంద్రియ సాగుకు ఆకర్షితుడయ్యారు. తొలుత ఎకరం విస్తీర్ణంలో నారు పోశారు. కలుపు తీయలేదు. ఎరువు వేయలేదు. నెల దాటినా పైరు పెద్దగా ఎదగలేదు. పది బస్తాల దిగుబడే వచ్చింది. ఇరుగు పొరుగు రైతులు నిరుత్సాహపరచారు. అయినా పోతురాజు దైర్యం వీడలేదు.
రెండో ఏడాది విస్తీర్ణం పెంచారు. పట్టువదలకుండా ఆరేళ్లుగా ప్రకృతి వ్యవసాయం బాటలోనే సాగుతున్నారు. ఇప్పుడది పది ఎకరాలకు విస్తరించింది. ఆరోగ్యంతో పాటు, మధుమేహాన్ని క్రమంగా తగ్గించే గుణం కలిగిన నవారా, కాలాభట్టి, బహురూపి, మైసూరు మల్లిగ లాంటి దేశవాళీ రకాల వరిని మాత్రమే పండిస్తూ.. ఎకరాకు 25 బస్తాల దిగుబడి సాధిస్తున్నారు. ఎకరాకు 80 వేల రూపాయల ఆదాయాన్ని అందుకుంటున్నారు. 210 రోజుల్లో పంటకు వచ్చే మాపిలై సాంబ రకాన్ని, కూరగాయలు, పండ్లు, ఆయిల్ పామ్‌ను పండించే ఆలోచనలో ఉన్నారు. సతీమణి నాగమణి సహకారంతో దేశవాళీ సేంద్రియ ధాన్యం సాగులో పోతురాజు చేస్తున్న కృషికి ప్రధాని కార్యాలయం నుంచీ ప్రశంసలు అందాయి. మొన్నటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశమూ అతనికి వచ్చింది.
∙వై.మురళీకృష్ణ, రిపోర్టర్ , తాడేపల్లిగూడెం
27 రకాలు
ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించేందుకు 27 రకాల విత్తనాలను వేదభారత్ సరఫరా చేస్తోంది. వాటిల్లో బహురూపి, చింతలూరి సన్నాలు, మైసూర్ మల్లిగ, నారాయణ కామిని, నవారా, బర్మాబ్లాక్, రక్తశాలి (ఎర్రబియ్యం), సిద్ధ సన్నాలు, రాజోలు సన్నాలు, కేతిరి మహరాజ్ , కుజు పటాలియా, దూదేశ్వర్ మొదలైన రకాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment