పెట్టుబడి లేని పంట! | crop without investment | Sakshi
Sakshi News home page

పెట్టుబడి లేని పంట!

Published Mon, Sep 22 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM

పెట్టుబడి లేని పంట!

పెట్టుబడి లేని పంట!

సాగు నీటి తడులు అక్కర్లేదు. అంతా వర్షాధారమే.  చీడపీడల బెడద బొత్తిగా లేదు. పంటను గొడ్లు తింటాయన్న భయం లేదు. దీని కొమ్మలకే ముళ్లుంటాయి కాబట్టి వేరే కంచె వేసే ఖర్చూ లేదు. మొక్కలు నాటిన మూడో ఏడాది నుంచి కాయలు కోసి అమ్ముకోవడమే! కోత కూలి తప్ప మరే ఖర్చూ లేదు. అలా సుదీర్థకాలం ఎంచక్కా పంట తీసుకుంటూనే ఉండొచ్చు. భలే బాగుంది కదండీ.. ఖర్చులేని తోట సాగు కథ! ఇంతకీ ఈ పంట పేరు క్యాండేట్ చెర్రీ. అదేనండీ.. వాక్కాయ! కడివేటి విశ్వనాథ రెడ్డి, జగన్నాథ రెడ్డి ప్రకాశం జిల్లాలో  ఈ పంట సాగుకు శ్రీకారం చుట్టారు.  ఇతర రైతులకు మార్గదర్శకులుగా నిలిచారు.
 
అందరూ సాగు చేసే పంటలను ఆరుగాలం కాయకష్టం చేసి, అయినకాడికి అప్పులు చేసి పంటలు పండించినా.. దిగుబడి లేకనో, మార్కెట్‌లో ధర దక్కకనో రైతులు ఆర్థికంగా నష్టాల పాలవుతున్న రోజులివి. అయితే, కొండంత ధైర్యంతో కొత్త పంటలపై దృష్టి సారిస్తూ.. చక్కటి ఆదాయం పొందే  రైతులు కొందరే! వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న అటువంటి ధీశాలురు కడివేటి విశ్వనాథ రెడ్డి, జగన్నాథ రెడ్డి రైతు సోదరులు. తమ ప్రాంతానికి కొండ రేగు, సుబాబుల్ సాగును పరిచయం చేసిన ఈ రైతు సోదరులు.. ఇప్పుడు మరో చక్కని ఆహార పంటను సాగు చేస్తూ కొత్తదారి చూపుతున్నారు. అడవి జాతికి చెందిన ఈ పంట పేరు క్యాండేట్ చెర్రీ లేదా వాక్కాయ. వాక్కాయలు తెలిసినవే అయినా దీర్ఘకాలిక పంటగా దీన్ని సాగు చేయడం కొత్త విషయం.
 
ఎకరానికి 200 మొక్కలు
విశ్వనాథరెడ్డి చెప్పిఇలా వాక్కాయ సాగు విశేషాలు ఇవీ.. ఒంగోలులో 1984లో మధుసూదన్‌రెడ్డి అని ఉద్యాన శాఖ అధికారి ఉండేవారు. ఆయన సలహాతో కొండరేగు పంటను జిల్లాలో తొలిసారిగా సాగు చేశాం. ఆ తర్వాత మూడేళ్లకు వారణాసి నుంచి క్యాండేట్ చెర్రీ మొక్క తెచ్చి నాటాం. దిగుబడి బాగుండటంతో నారు పెంచి ఇతర రైతులకు కూడా విక్రయిస్తున్నాం. చెర్రీ సాగుకు నల్లరేగడి నేలలు అనువుగా ఉంటాయి. మొదట సాళ్ల మధ్య 9 అడుగులు, మొక్కల మధ్య 12 అడుగులు ఖాళీ ఉంచి నాటాం. రెండేళ్లకే దట్టంగా పెరిగి మధ్యలో నుంచి మనిషి వెళ్లే సందు కూడా లేకపోవడంతో.. మధ్య సాళ్లలో చెట్లను తొలగించాం. ఎకరాకు 200 మొక్కలు మిగిలాయి.
 
కలుపు బెడద వల్ల అంతర పంటల సాగు ప్రయత్నం మానుకున్నాం. చెరీర మొక్క ఖరీదు రూ.15- రూ. 20 వరకు ఉంది. మొక్కలు నాటేందుకు మరీ లోతు గుంటలు తీయాల్సిన అవసరం లేదు. కేవలం జానెడు గుంటలోనే నాటేయొచ్చు. మూడో ఏట నుంచి పంట చేతికొస్తుంది. మొక్కలు నాటేటప్పుడే ఎకరానికి 4 ట్రాక్టర్ల చివికిన పశువుల ఎరువు తోలాం. ఇది ఎడారి మొక్క కాబట్టి నీరు లేకపోయినా బతుకుతుంది. ఎక్కువ నీరు పెడితే దిగుబడి తగ్గుతుంది! ఫిబ్రవరి- ఏప్రిల్ మధ్యలో చెట్లు పూతకు వస్తాయి. జూలై, ఆగస్టు నెలల్లో వర్షం పడిన వెంటనే పూత కాస్తా పిందెలవుతాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు పంట కోతకొస్తుంది. ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కిలో ధర రూ.30 పలుకుతుంది. ఏడాదికి ఎకరాకు రూ.90 వేల ఆదాయం వస్తుంది. ఎరువులు, కోత కూలీ ఖర్చు రూ.15 నుంచి 20 వేలకు మించదు. చెర్రీ చెట్ల ఆకుల నుంచి పాలు వస్తుంటాయి. అందువల్ల గొర్రెలు, గేదెలు వీటి జోలికి రావు.
 
ఈ పంటకు పెట్టుబడి తక్కువ. ఆదాయం ఎక్కువ. మార్కెటింగ్ మొదట్లో ఇబ్బందిగా ఉండేది. ఇటీవల విజయవాడలో చెర్రీ ఫ్యాక్టరీ ఒకటి ఏర్పాటు కావడంతో ఇప్పుడు ఇబ్బంది లేదు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు రైతులు మా వద్ద నుంచి చెర్రీ మొక్కలను తీసుకెళ్తున్నారు. ప్రకాశం జిల్లాలో 30 నుంచి 40 ఎకరాల్లో మాత్రమే చెర్రీ సాగవుతోంది. ప్రస్తుతం ఏడెకరాల్లో చెర్రీ సాగు చేస్తున్నాం. మరో మూడు ఎకరాల్లో పంట వేయబోతున్నాం. చెర్రీ ఫ్యాక్టరీల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తే బాగుంటుంది. ఈ పంట వేసిన పొలంలో ఏడాదికి రెండు నెలల్లో మాత్రమే పని ఉంటుంది. మిగతా సమయంలో ఇతర పనులు చూసుకునేందుకు రైతుకు వెసులుబాటు ఉంటుంది.  
 
చెర్రీ అనగానే అందరికీ ఎరుపు రంగులో నోరూరించే తియ్యని పండు గుర్తుకు వస్తుంది. అయితే  క్యాండేట్ చెర్రీ(వాక్కాయ) కన్నా నాణ్యమైన చెర్రీ హిమాలయ ప్రాంతాల్లో మాత్రమే లభ్యమవుతుంది. ఈ పండు కోతకు రాగానే వాటిలోని విత్తనాలను తొలగించి ఉడికిస్తారు. తీపి కోసం పంచదార పాకంలో వేస్తారు. చెర్రీలను కిళ్లీలు, కొన్ని రకాల కేకుల తయారీలోనూ వినియోగిస్తున్నారు. చెర్రీ.. చెట్టు నుంచి కోసేటప్పుడు ఎర్రగానే ఉంటుంది. కానీ రుచి పుల్లగా ఉంటుంది. దీంతో పప్పు, పులిహోర తయారీలో చింత పండుకు బదులుగా  చెర్రీ కాయలను వాడుతున్నారు. హోటళ్లలో వాక్కాయ పప్పు స్పెషల్ అంటూ ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తుండడం విశేషం. కొద్ది పెట్టుబడితో నిశ్చింతగా నికరాదా యాన్నిచ్చే వాక్కాయ సాగు మెట్ట రైతులకు ఎంతో అనువైనది.
- పర్చూరి శ్రీనివాసులు, ఒంగోలు
 
నష్టం వచ్చే ప్రశ్నే లేదు..!
ఆరు ఎకరాలు చెర్రీ పంట వేశాం. ముందుగా వేసిన రెండెకరాలు కాపు కొచ్చింది. మంచి పంట, నష్టం ప్రశ్నేలేదు. మా పంట మొత్తాన్నీ చెన్నై వ్యాపారికి అమ్ముతున్నాం. కిలోకు రూ.35 గిట్టుబాటవుతోంది. వినాయక చవితి పండుగ రోజుల్లో మాత్రం ఈ కాయలకు చెన్నైలో మంచి డిమాండ్ ఉంటుంది. వినాయక చవితి పూజకు వాడే పత్రిలో బృహతి కూడా ఒకటి. వినాయక చవితికి నెల రోజుల ముందు నుంచి వాక్కాయల దిగుబడి వస్తుంది. వినాయక చవితి అయి పోయిన నెలరోజుల్లో కాపు పూర్త వుతుంది. వీటిని తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్ ట్రబుల్ వచ్చే ప్రశ్నే లేదు. చింతపండుకు బదులుగా దీన్ని వాడుతున్నారు. పిల్లలు ఈ కాయలను ఉప్పు, కారం అద్దుకుని ఇష్టంగా తింటుంటారు. ప్రభుత్వం ఈ పంటపై దృష్టిపెట్టాలి.

 - మంగలపూడి కోటిరెడ్డి (98663 59683), రైతు, కోరిశపాడు, ప్రకాశం జిల్లా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement