
డోన్ పట్టణంలో వాహనదారుల నుంచి డబ్బు తీసుకుంటున్న హోంగార్డులు
కర్నూలు, డోన్: పట్టణానికి చెందిన ఇద్దరు హోంగార్డులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వీడియోలు వాట్సప్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో హల్‌చల్ చేస్తున్నాయి. నిబంధనలు పాటించని ఆటో డ్రైవర్లు, లారీ, వ్యాన్ డ్రైవర్లను బెదిరించి వారి వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం పట్టణంలో పరిపాటిగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిత్యం ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న కొందరు సరుకుల అన్‌లోడ్ చేస్తున్న వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లు చేయడం రివాజుగా మారిందంటున్నారు.
వీరి చేష్టల వల్ల పెద్ద వాహనాలు రోడ్లకు అడ్డంగా నిలిపి సిమెంట్, నిత్యావసర వస్తువులు, ఐరన్‌లను అన్‌లోడ్ చేస్తూ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని డ్రైవర్లపై ఆరోపణలున్నాయి. అయితే ఈ వీడియోల హల్‌చల్‌ను పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. సంతృప్తికరమైన రీతిలో ప్రభుత్వం వేతనాలు పెంచినా ఇలా లంచాలకు పాల్పడుతూ పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు తెస్తున్నారని పోలీస్ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment