అంబాజీపేట (తూర్పుగోదావరి) : అన్నా, చెల్లెలు, మరో వ్యక్తి.. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల రూపాయలు వసూలు చేసి, మోసగించినట్టు తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట పోలీస్‌స్టేషన్లో కేసు నమోదైంది. శుక్రవారం ఏఎస్సై ఐ. మురళీకృష్ణ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. అంబాజీపేట మండలం కె.పెదపూడికి చెందిన గుమ్మడి మురళి, అతని సోదరి వీర నాగమల్లేశ్వరి, బెంగళూరుకు చెందిన షాన్ భగవాన్ నాయుడు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి సొమ్ములు వసూలు చేశారు. కోనసీమలోని 27 మంది నుంచి రూ.54 లక్షలు వసూలు చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
విశాఖలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగం వేయిస్తానని పి. గన్నవరం మండలం గుత్తులవారిపాలెంకు చెందిన కుడుపూడి శ్రీనివాసరావు నుంచి మూడు నెలల క్రితం రూ.4 లక్షలు వసూలు చేశారు. ఇప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో శ్రీనివాసరావు అన్నాచెల్లెళ్లను ప్రశ్నించాడు. వారినుంచి సరైన సమాధానం రాకపోవడంతో అంబాజీపేట పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు ఎస్‌హెచ్‌ఓ పి. జయంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుత్ను అన్నాచెల్లెళ్లు, షాన్ భగవాన్ నాయుడులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కాగా నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన సొమ్మును ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ ద్వారా షాన్ భగవాన్ నాయుడుకు పంపించినట్లు వీర నాగమల్లేశ్వరి పోలీసులకు చెబుతోంది.
ఉద్యోగాలపేరుతో రూ. 54 లక్షలు స్వాహా
Published Fri, Aug 21 2015 5:59 PM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM
Advertisement