
మహబూబ్‌నగర్ క్రైం: దేవరకద్ర నుంచి మహబూబ్‌నగర్ వైపు వస్తున్న ఇసుక టిప్పర్లను సీఐ స్థాయి పోలీసు అధికారి చెప్పాడని రోడ్డుపై నిలుపుతున్నాడు ఓ ప్రైవేటు వ్యక్తి. అనంతరం టిప్పర్ నంబర్, యజమాని సెల్‌ఫోన్ నంబర్ తీసుకోవటం మరుసటి రోజు నుంచి ఫోన్లు చేస్తూ.. ‘డబ్బులు అందలేదు.. సార్‌కు చెప్పాలా? రేపటి నుంచి ఈ రూట్‌లో టిప్పర్ కనిపించదు’ అంటూ వార్నింగ్ ఇవ్వటం, డబ్బులు వసూలు చేసే వరకు ఫోన్లు చేస్తూనే వేదిస్తున్నాడని టిప్పర్ యజమానులు వాపోతున్నారు.
ఒక్కో టిప్పర్ నుంచి రూ.6 వేలు..
మక్తల్ సమీపంలోని ఓ వాగు నుంచి మహబూబ్‌నగర్‌కు టిప్పర్లలో ఇసుక తరలిస్తున్నారు. 100 నుంచి 130 టిప్పర్ల ఇసుక జిల్లాకేంద్రానికి వచ్చింది. ఈ క్రమంలో దేవరకద్ర – మహబూబ్‌నగర్ రహదారిలో ఓ పోలీసు అధికారి మనిషిని అంటూ ఓ వ్యక్తి దర్జాగా వాహనంపై పోలీస్ అని రాసుకొని టిప్పర్లు నిలుపుతున్నాడు. డ్రైవర్లు గట్టిగా ప్రశ్నిస్తే నేను ఫలనా సార్ మనిషిని, ఆయన పంపించాడు. అందుకే వచ్చానని సమాధానం ఇస్తున్నాడు. యాజమాని ఫోన్‌నంబర్, టిప్పర్ నంబర్ రాసుకొని మరసటి రోజు ఫోన్ చేసి రూ.6 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. మరికొందరు అధికారులు యాజమానులతో నేరుగా రూ.10 వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసి జరుగుతుందా లేదా అనేది ప్రశ్నార్థకం.
విచారణ జరిపిస్తాం..
ప్రైవేట్ వ్యక్తులు పోలీసుశాఖ పేరుచెప్పి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇసుక టిప్పర్లు నిలిపి డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయంపై విచారణ జరిపిస్తాం. పోలీసుశాఖలో ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడరు.–శ్రీధర్, డీఎస్పీ, మహబూబ్‌నగర్