ఇసుక మాఫియా దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక మాఫియా విజృంభిస్తోంది. అక్రమ రవాణాను అడ్డుకున్న వారు ఎవరైనా సరే.. అడ్డుతొలగించుకోవడమే లక్ష్యంగా రోజురోజుకూ రెచ్చిపోతోంది. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని మిడ్జిల్ మండలం వాడ్యాల్ శివారులో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ వ్యక్తిపై ఇసుకాసురులు కత్తితో దాడి చేయడం ఇందుకు మరో నిదర్శనం. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వాడ్యాల్‌కు చెందిన ట్రాక్టర్ల యాజమానులు రాత్రివేళ అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. గురువారం రాత్రి కూడా రెండు ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చేస్తుండగా.. అనేగళ్ల జంగయ్య, భాస్కర్‌తో పాటు కొందరు రైతులు అడ్డుకున్నారు.
వారితో ట్రాక్టర్ యాజమానులు బీర్ల రమేష్, బీర్ల రామకృష్ణ, బెల్లె భీరయ్య, సిద్దపురం శ్రీశైలం, శ్రీను ఘర్షణకు దిగారు. దీనిపై జంగయ్య, భాస్కర్ అదేరోజు రాత్రి మిడ్జిల్ పోలీస్‌స్టేషన్‌లో ట్రాక్టర్ యజమానులు ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. అనంతరం జడ్చర్ల పట్టణంలో ఉన్న వాడ్యాల్‌కు చెందిన మధు అనే యువకుడికి ట్రాక్టర్ యాజమాని భీరయ్య ఫోన్ చేశాడు. మధు, తదితరులు ఇసుక రవాణాను అడ్డుకుంటున్నారనే కోపంతో.. ‘ఇసుక ఆపేందుకు వస్తే మంచిగా ఉండదు.. మీ వాళ్లు అడ్డం వస్తే బెదిరించాం.. నీవు వస్తే నీ అంతుచూస్తాం..’అని హెచ్చరించారు. ఈ క్రమంలోనే మధు శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో రైతులతో కలిసి దుందుభీ వాగువైపు వెళ్తుండగా.. అప్పటికే కాపు కాసిన ట్రాక్టర్ యాజమానులు కత్తితో దాడికి దిగారు.
చేతులు వెనక్కి విరిచి...
ధును ట్రాక్టర్ యజమాని భీరయ్య రెండు చేతులు వెనక్కి విరిచి పట్టుకోగా.. మరో ట్రాక్టర్ యజమాని రమేష్ కత్తితో చేతి భుజంపైన, కడుపులో పొడిచి పారిపోయారు. గాయపడిన మధును అతడితో వచ్చిన వారు 108లో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని కాలి తొడ భాగంలో ఆరు, చేతికి పది, కడుపులో నాలుగు కుట్లు పడ్డాయి. మధు సోదరుడు రాజేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఎస్పీ వెంకటేశ్వర్లు మిడ్జిల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఘటనపై విచారించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి వాడ్యాల్‌కు చెందిన బీర్ల రామకృష్ణ, బీర్ల రమేష్, బెల్లె భీరయ్య, సిద్దపురం శ్రీశైలంను పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. వీరిని కల్వకుర్తి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ జయప్రసాద్ తెలిపారు.
గతంలోనూ దురాగతాలు
గతంలో అల్లీపూర్ వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా.. ఆత్మకూరు మండలం పిన్నంచెర్లకు చెందిన ఓ రైతు అడ్డుకున్నాడు. అతడిని ఇసుకాసురులు ట్రాక్టర్ టైర్లతో తొక్కించి చంపి వేశారు. మక్తల్ మండలంలోని వాగుల నుంచి ఇసుకను తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నందుకు షాద్‌నగర్‌కు చెందిన ఓ ఇసుక వ్యాపారి ఏకంగా ఎమ్మెల్యేనే బెదిరించాడు. కోయిల్‌కొండ మండలంలోని అంకిళ్లవాగు నుంచి టిప్పర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అడ్డుకున్నాడు. దీంతో ఇసుకాసురులు రెచ్చిపోయి అతడిపై దాడి చేశారు. అదేవిధంగా సూరారంంలో ఇసుక రవాణాకు అడ్డుపడుతున్నారనే కారణంతో బైక్‌పై వెళ్తున్న వీఆర్‌ఏ, వీఆర్‌ఓలను టిప్పర్లతో తొక్కించేందుకు యత్నించగా.. వారు ఎలాగో తప్పించుకుని బయటపడ్డారు. ఇలాంటివి మరెన్నో ఘటనలు ఈ ప్రాంతంలో జరిగాయి.
రాజకీయ నేతల అనుచరులే..!
జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోవడానికి రాజకీయ నేతల అండదండలే ప్రధాన కారణమనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. రాజకీయ నేతల ఒత్తిళ్లు, నెలవారీగా మామూళ్లు అందుతుండడంతో అధికార యంత్రాంగం కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది. మిడ్జిల్ మండలంలో రెచ్చిపోయిన ఇసుకాసురులు అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన అనుచరులేననే ఆరోపణలు విన్పిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment