బాలింతను అడిగి వైద్యసేవల గురించి తెలుసుకుంటున్న నన్నపనేని రాజకుమారి
అనంతపురం న్యూసిటీ: ‘సర్వజనాస్పత్రిలో సిబ్బంది కొరత ఉంటే..మీ మంత్రులు, చీఫ్ విప్‌లనే అడగండి. మీ జిల్లాకు పదవులు ఎక్కువగా వచ్చాయ్. వారినడిగితే బాగుంటుంది’ అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. గురువారం సర్వజనాస్పత్రిలోని రోగులకందుతున్న సేవలపై విలేకరులడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా స్పందించారు. సర్వజనాస్పత్రిలోని సమస్యలను తనవంతుగా సీఎం చంద్రబాబు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కరువు జిల్లా ‘అనంత’లో మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో భ్రూణహత్యలు తగ్గుముఖం పట్టాయని, అందుకు సర్వజనాస్పత్రిలో జరిగే ప్రసవాలే ఉదాహరణ అన్నారు.
బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రజల్లో చైతన్యం కల్గించేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. తల్లీబిడ్డకు మెరుగైన వైద్యం అందించేందుకు పీజీ చేసిన గైనిక్, చిన్నపిల్లల, మెడిసిన్ వైద్యులు రెండేళ్ల పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రస్తుతం కేటాయించిన పడకలు చాలడం లేదని, నూతన భవనాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అంతకుముందు ఆమె ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని గైనిక్, ఎస్‌ఎన్‌సీయూలను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. గైనిక్ వార్డులో ఓ మహిళ అప్పుడే పుట్టిన పాపను తీసుకురాగా... ఆ పాపను చేతుల్లోకి తీసుకున్న నన్నపనేని ‘అమరావతి’ అని నామకరణం చేశారు. చైర్‌పర్సన్ వెంట మహిళా కమిషన్ సభ్యురాలు పర్వీన్‌భాను, సర్వజనాస్పత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర రావు, ఆర్‌ఎంఓ డాక్టర్ లలిత, ఐసీడీఎస్ పీడీ వెంకటేశం, తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment