సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అత్యవసర విభాగంలో ప్రధానమైన అగ్నిమాపక శాఖ.. అధికారులు, సిబ్బంది కొరతతో తంటాలు పడుతోంది. నియోజకవర్గానికి ఒక ఫైర్ స్టేషన్ ఉండేలా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఖాళీల భర్తీపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే.. కొన్నిచోట్ల తక్షణమే స్పందించడానికి అవసరమైన సిబ్బంది లేరనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర అగ్నిమాపక శాఖలో మొత్తం 2,256 మంజూరు పోస్టులుండగా, వీటిలో 1,414 మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు.
మిగతా 842 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అగ్నిమాపక శాఖ వెబ్‌సైట్ ఆధారంగా పరిశీలిస్తే.. అదనపు డైరెక్టర్ ఒక పోస్టు, రీజనల్ ఫైర్ అఫీసర్ ఒకటి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు మూడు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక పోస్టు, 49 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు, ఒక లీడింగ్ ఫైర్ మెన్ పోస్టు, 212 డ్రైవర్ ఆపరేటర్, 20 జూనియర్ అసిస్టెంట్లు, ఒక జూనియర్ స్టెనో, 3 టైపిస్ట్, 541 ఫైర్ మెన్ పోస్టులు, రెండు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, 6 స్వీపర్ పోస్టులు, ఒక వాచ్‌మెన్ పోస్టు ఖాళీగా ఉన్నాయి. మంజూరు పోస్టుల్లో ఇలా దాదాపుగా 45 శాతం పోస్టులు ఖాళీగా ఉండిపోవడం ఉన్నతాధికారులును ఒత్తిడికి గురిచేస్తోంది. స్టేషన్లు పెరిగిపోవడంతో క్షేత్రస్థాయిలో సిబ్బందితో పాటు పర్యవేక్షణ అధికారుల కొరత కూడా ఉండటం అత్యవసర విభాగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
శిక్షణ కేంద్రంలో 34 ఖాళీలు
రాష్ట్ర విభజన నేపథ్యంలో అగ్నిమాపక శాఖకు చెందిన సివిల్ డిఫెన్స్ శిక్షణ కేంద్రంలో పోస్టుల పంచాయితీ ఇంకా ఓ కొలిక్కి రాలేదని తెలిసింది. ఏడేళ్లు గడిచిపోయినా ఇంకా పంపకాలు పూర్తి కాకపోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. విభజన పూర్తి కాకపోవడంతో శిక్షణ కేంద్రంలో ఖాళీల భర్తీ చేపట్టలేకపోతున్నారు.
మొత్తం 50 మంజూరు పోస్టులున్న కేంద్రంలో ప్రస్తుతం 16 పోస్టుల్లో ఉద్యోగులు పనిచేస్తుండగా మిగిలిన 34 ఖాళీగా ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ (1), లైబ్రేరియన్ (1), లీడింగ్ ఫైర్‌మెన్ (3) డ్రైవర్ ఆపరేటర్ (5), జూనియర్ అసిస్టెంట్ (3), జూనియర్ స్టెనో (1), టైపిస్ట్ (1), ఫైర్‌మెన్ (4).. ఇలా మొత్తంగా 34 పోస్టులు ఖాళీలున్నాయని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment