emergency department
-
వైద్యంలో రాష్ట్రాన్ని నంబర్‌వన్ చేయాలి
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత పర్యటన కోసం అమెరికా వెళ్లిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అక్కడి నుంచి కూడా విధులు నిర్వహిస్తుండటం విశేషం. గురువారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బోధనాస్పత్రులపై సమీక్ష నిర్వహించారు. 65 మందికి ప్రొఫెసర్లు, 210 మందికి అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు ఇచ్చామని మంత్రి తెలిపారు. అలాగే 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేసినట్లు వివరించారు. వీరికి నియామక ఉత్తర్వులను ఈనెల 22న శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో అందజేస్తామన్నారు. వీరందరి సేవలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకొని ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందని, రాష్ట్రాన్ని ఈ రంగంలో మొదటి స్థానానికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని అధికారులను కోరారు. మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ విద్యార్థులకు టీచింగ్ ఫ్యాకల్టీ ఆదర్శంగా ఉండాలని ఆయన సూచించారు. ర్యాగింగ్ లాంటివి లేకుండా చూడాలన్నారు. కాగా, విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న 900 మంది తెలంగాణ విద్యార్థులకు ఒక ఏడాది ఇంటర్న్ షిప్ కోసం రాష్ట్రవ్యాప్తంగా కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా పోస్టింగులు ఇచ్చామని ఆయన తెలిపారు. డ్యూటీ డాక్టర్లు కచ్చితంగా ఉండాలి.. 24 గంటలూ.. మరీ ముఖ్యంగా రాత్రి వేళల్లో డ్యూటీ డాక్టర్లు ఉండాలని హరీశ్‌రావు సూచించారు. ఎమర్జెన్సీ విభాగంలో డ్యూటీ డాక్టర్లు కచ్చితంగా ఉండాలని కోరారు. ముహూర్తాలు చూసి ప్రసవాలు చేయకూడదని, గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని బట్టి సాధారణ లేదా సీ సెక్షన్ డెలివరీ చేయాలని స్పష్టం చేశారు. ఐదు లక్షల రూపాయలకు పైబడి విలువ చేసే వైద్య పరికరాల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. అలాగే అన్ని వైద్య పరికరాలు పని చేసేలా చూసుకోవాల్సిన బాధ్యత సూపరింటెండెంట్లదేనన్నారు. ఈ సమీక్షలో వైద్యాధికారులు రిజ్వీ, రమేశ్ రెడ్డి, శ్వేతా మహంతి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మ్యాన్‌పవర్ లేని ‘ఫైర్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అత్యవసర విభాగంలో ప్రధానమైన అగ్నిమాపక శాఖ.. అధికారులు, సిబ్బంది కొరతతో తంటాలు పడుతోంది. నియోజకవర్గానికి ఒక ఫైర్ స్టేషన్ ఉండేలా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఖాళీల భర్తీపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే.. కొన్నిచోట్ల తక్షణమే స్పందించడానికి అవసరమైన సిబ్బంది లేరనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర అగ్నిమాపక శాఖలో మొత్తం 2,256 మంజూరు పోస్టులుండగా, వీటిలో 1,414 మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. మిగతా 842 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అగ్నిమాపక శాఖ వెబ్సైట్ ఆధారంగా పరిశీలిస్తే.. అదనపు డైరెక్టర్ ఒక పోస్టు, రీజనల్ ఫైర్ అఫీసర్ ఒకటి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు మూడు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక పోస్టు, 49 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు, ఒక లీడింగ్ ఫైర్ మెన్ పోస్టు, 212 డ్రైవర్ ఆపరేటర్, 20 జూనియర్ అసిస్టెంట్లు, ఒక జూనియర్ స్టెనో, 3 టైపిస్ట్, 541 ఫైర్ మెన్ పోస్టులు, రెండు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, 6 స్వీపర్ పోస్టులు, ఒక వాచ్మెన్ పోస్టు ఖాళీగా ఉన్నాయి. మంజూరు పోస్టుల్లో ఇలా దాదాపుగా 45 శాతం పోస్టులు ఖాళీగా ఉండిపోవడం ఉన్నతాధికారులును ఒత్తిడికి గురిచేస్తోంది. స్టేషన్లు పెరిగిపోవడంతో క్షేత్రస్థాయిలో సిబ్బందితో పాటు పర్యవేక్షణ అధికారుల కొరత కూడా ఉండటం అత్యవసర విభాగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. శిక్షణ కేంద్రంలో 34 ఖాళీలు రాష్ట్ర విభజన నేపథ్యంలో అగ్నిమాపక శాఖకు చెందిన సివిల్ డిఫెన్స్ శిక్షణ కేంద్రంలో పోస్టుల పంచాయితీ ఇంకా ఓ కొలిక్కి రాలేదని తెలిసింది. ఏడేళ్లు గడిచిపోయినా ఇంకా పంపకాలు పూర్తి కాకపోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. విభజన పూర్తి కాకపోవడంతో శిక్షణ కేంద్రంలో ఖాళీల భర్తీ చేపట్టలేకపోతున్నారు. మొత్తం 50 మంజూరు పోస్టులున్న కేంద్రంలో ప్రస్తుతం 16 పోస్టుల్లో ఉద్యోగులు పనిచేస్తుండగా మిగిలిన 34 ఖాళీగా ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ (1), లైబ్రేరియన్ (1), లీడింగ్ ఫైర్‌మెన్ (3) డ్రైవర్ ఆపరేటర్ (5), జూనియర్ అసిస్టెంట్ (3), జూనియర్ స్టెనో (1), టైపిస్ట్ (1), ఫైర్‌మెన్ (4).. ఇలా మొత్తంగా 34 పోస్టులు ఖాళీలున్నాయని తెలిసింది. -
ఇదిగో..నరకం..
కర్నూలు ప్రభుత్వాస్పత్రి అత్యవసర విభాగంలో దుస్థితి కర్నూలు (హాస్పిటల్): ‘అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా ఉంది కర్నూలులోని సర్వజన ప్రభుత్వాసుపత్రి తీరు. ఇక్కడ రోగులకు అవసరమయ్యే అన్ని రకాల పరికరాలు ఉన్నాయి. అయితే వాటిని సక్రమంగా ఉపయోగించుకోలేని దుస్థితిలో యంత్రాంగం ఉంది. ఆస్పత్రిలోని క్యాజువాలిటీ(అత్యవసర విభాగం)లో స్ట్రెచర్లు, వీల్చైర్లు ఉన్నాయి. కానీ అవి రోగులకు ఏమాత్రం ఉపయోగపడడంలేదు. వాటిని ఓ గదిలో పెట్టి భద్రంగా తాళాలు వేశారు. దీంతో స్ట్రెచర్లు, వీల్చైర్లు లేక రోగులు, రోగుల సహాయకులు, ప్రమాద బాధితులు ఇబ్బందిపడుతున్నారు. సంబంధిత అధికారులు ప్రతి రోజూ క్యాజువాలిటీ మీదుగా రాకపోకలు సాగిస్తున్నా.. వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. క్యాజువాలిటీకి నిత్యం రోడ్డు ప్రమాద బాధితులు కర్నూలుతో పాటు ఇతర జిల్లాల నుంచి వస్తుంటారు. అప్పటికే కాళ్లు, చేతులు విరిగి తలకు గాయాలై నరకయాతన అనుభవిస్తు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే బాధితులకు కనీస సదుపాయాలు అందడంలేదు. ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్దకు వచ్చిన రోగులు, ప్రమాద బాధితులు అక్కడి నుండి క్యాజువాలిటీకి వెళ్లాలంటే 20 నుంచి 30 అడుగుల దూరం ఉంటుంది. నడవలేని స్థితిలో వచ్చిన బాధితులకు, ఇక్కడ నుండే నరకం ప్రారంభం అవుతుంది. క్యాజువాలిటీకి తరలించాలంటే స్ట్రెచర్లు, వీల్చైర్లు తప్పనిసరి. అయితే అవి అందుబాటులో ఉండడంలేదు. దాతలు ఉచితంగా ఇచ్చిన స్ట్రెచర్లు(కొత్తవి) వీల్చైర్లు క్యాజువాలిటీ విభాగం ఎదురుగా ఉన్న ఓ గదిలో మూలన పడేశారు. ఉన్న ఒకటి, రెండు స్ట్రెచర్లు కనబడితే ఉన్నట్లు.. లేకుంటే లేనట్లే. వీటిని తరలించే వార్డు బాయ్‌లు రమ్మన్నా రారు. బాధితుని బంధువులు ఓ స్థాయిలో ఉంటే స్ట్రెచర్ బయటికి వస్తుంది. లేకుంటే ప్రాధేయపడినా రాదు. అడిగేవారు లేరు. వార్డు బాయ్‌లకు నిక్కచ్చిగా చెప్పేవారు లేరు. దీంతో నిత్యం ప్రమాద బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల సీఎస్ఆర్ఎంఓ ప్రత్యేకంగా దృష్టి సారించి స్ట్రెచర్లు, వీల్చైర్లు ప్రధాన ద్వారం వద్ద పెట్టాలని ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు ఆ అధికారి ఉన్నంత సేపు స్ట్రెచర్ కనబడుతుంది. ఆ తర్వాత మళ్లీ యథాతథం. ఇక ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌గా ఉండే రోగి వివిధ రకాల పరీక్షల నిమిత్తం మరో చోటుకి తరలించాలంటే స్ట్రెచర్లు అవసరం. అలాగే రోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగిన వ్యక్తులకు ప్రాథమిక చిక్తిత్స అనంతరం ఆర్థోపెడిక్ వార్డుకు తరలించాలి. స్ట్రెచరు లేనిదే బాధితున్ని తరలించడం ఎంతో ఇబ్బంది. అయినా ఇబ్బందులు తప్పడం లేదు. రోగుల సహాయకులే భుజాన వేసుకుని తరలిస్తున్న సంఘటనలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సర్వసాధారణం. ప్రజారోగ్యానికి రూ.కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ప్రమాద బాధితులకు, రోగులకు కనీస అవసరాలైన స్ట్రెచర్లు, వీల్చైర్లను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆసుపత్రి అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించాలి. ఇప్పటికైనా అధికారులు ఆసుపత్రిలో ఎన్ని స్ట్రెచర్లు ఉన్నాయి? ఎన్ని వీల్చైర్లు ఉన్నాయి? రిపేరీలో ఉన్నవి ఎన్ని? అన్న వాటిపై ఆరా తీయాల్సిన అవసరం ఉంది. క్యాజువాలిటీ ఎదురుగా ఉన్న గదిలో కొత్త వీల్చైర్లు, స్ట్రెచర్లను ఎందుకు మూలన పడేశారో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.