సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత పర్యటన కోసం అమెరికా వెళ్లిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అక్కడి నుంచి కూడా విధులు నిర్వహిస్తుండటం విశేషం. గురువారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బోధనాస్పత్రులపై సమీక్ష నిర్వహించారు. 65 మందికి ప్రొఫెసర్లు, 210 మందికి అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు ఇచ్చామని మంత్రి తెలిపారు. అలాగే 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేసినట్లు వివరించారు.
వీరికి నియామక ఉత్తర్వులను ఈనెల 22న శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో అందజేస్తామన్నారు. వీరందరి సేవలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకొని ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందని, రాష్ట్రాన్ని ఈ రంగంలో మొదటి స్థానానికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని అధికారులను కోరారు.
మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ విద్యార్థులకు టీచింగ్ ఫ్యాకల్టీ ఆదర్శంగా ఉండాలని ఆయన సూచించారు. ర్యాగింగ్ లాంటివి లేకుండా చూడాలన్నారు. కాగా, విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న 900 మంది తెలంగాణ విద్యార్థులకు ఒక ఏడాది ఇంటర్న్ షిప్ కోసం రాష్ట్రవ్యాప్తంగా కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా పోస్టింగులు ఇచ్చామని ఆయన తెలిపారు.
డ్యూటీ డాక్టర్లు కచ్చితంగా ఉండాలి..
24 గంటలూ.. మరీ ముఖ్యంగా రాత్రి వేళల్లో డ్యూటీ డాక్టర్లు ఉండాలని హరీశ్‌రావు సూచించారు. ఎమర్జెన్సీ విభాగంలో డ్యూటీ డాక్టర్లు కచ్చితంగా ఉండాలని కోరారు. ముహూర్తాలు చూసి ప్రసవాలు చేయకూడదని, గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని బట్టి సాధారణ లేదా సీ సెక్షన్ డెలివరీ చేయాలని స్పష్టం చేశారు.
ఐదు లక్షల రూపాయలకు పైబడి విలువ చేసే వైద్య పరికరాల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. అలాగే అన్ని వైద్య పరికరాలు పని చేసేలా చూసుకోవాల్సిన బాధ్యత సూపరింటెండెంట్లదేనన్నారు. ఈ సమీక్షలో వైద్యాధికారులు రిజ్వీ, రమేశ్ రెడ్డి, శ్వేతా మహంతి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment