staff Shortage
-
మ్యాన్‌పవర్ లేని ‘ఫైర్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అత్యవసర విభాగంలో ప్రధానమైన అగ్నిమాపక శాఖ.. అధికారులు, సిబ్బంది కొరతతో తంటాలు పడుతోంది. నియోజకవర్గానికి ఒక ఫైర్ స్టేషన్ ఉండేలా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఖాళీల భర్తీపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే.. కొన్నిచోట్ల తక్షణమే స్పందించడానికి అవసరమైన సిబ్బంది లేరనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర అగ్నిమాపక శాఖలో మొత్తం 2,256 మంజూరు పోస్టులుండగా, వీటిలో 1,414 మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. మిగతా 842 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అగ్నిమాపక శాఖ వెబ్సైట్ ఆధారంగా పరిశీలిస్తే.. అదనపు డైరెక్టర్ ఒక పోస్టు, రీజనల్ ఫైర్ అఫీసర్ ఒకటి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు మూడు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక పోస్టు, 49 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు, ఒక లీడింగ్ ఫైర్ మెన్ పోస్టు, 212 డ్రైవర్ ఆపరేటర్, 20 జూనియర్ అసిస్టెంట్లు, ఒక జూనియర్ స్టెనో, 3 టైపిస్ట్, 541 ఫైర్ మెన్ పోస్టులు, రెండు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, 6 స్వీపర్ పోస్టులు, ఒక వాచ్మెన్ పోస్టు ఖాళీగా ఉన్నాయి. మంజూరు పోస్టుల్లో ఇలా దాదాపుగా 45 శాతం పోస్టులు ఖాళీగా ఉండిపోవడం ఉన్నతాధికారులును ఒత్తిడికి గురిచేస్తోంది. స్టేషన్లు పెరిగిపోవడంతో క్షేత్రస్థాయిలో సిబ్బందితో పాటు పర్యవేక్షణ అధికారుల కొరత కూడా ఉండటం అత్యవసర విభాగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. శిక్షణ కేంద్రంలో 34 ఖాళీలు రాష్ట్ర విభజన నేపథ్యంలో అగ్నిమాపక శాఖకు చెందిన సివిల్ డిఫెన్స్ శిక్షణ కేంద్రంలో పోస్టుల పంచాయితీ ఇంకా ఓ కొలిక్కి రాలేదని తెలిసింది. ఏడేళ్లు గడిచిపోయినా ఇంకా పంపకాలు పూర్తి కాకపోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. విభజన పూర్తి కాకపోవడంతో శిక్షణ కేంద్రంలో ఖాళీల భర్తీ చేపట్టలేకపోతున్నారు. మొత్తం 50 మంజూరు పోస్టులున్న కేంద్రంలో ప్రస్తుతం 16 పోస్టుల్లో ఉద్యోగులు పనిచేస్తుండగా మిగిలిన 34 ఖాళీగా ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ (1), లైబ్రేరియన్ (1), లీడింగ్ ఫైర్‌మెన్ (3) డ్రైవర్ ఆపరేటర్ (5), జూనియర్ అసిస్టెంట్ (3), జూనియర్ స్టెనో (1), టైపిస్ట్ (1), ఫైర్‌మెన్ (4).. ఇలా మొత్తంగా 34 పోస్టులు ఖాళీలున్నాయని తెలిసింది. -
టీఎస్పీఎస్సీలోనే ఖాళీలు, ఇక నోటిఫికేషన్లు ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే కమిషన్ కార్యాలయంలో ఖాళీలు ఏర్పడ్డాయి. రెండు నెలలుగా అవి భర్తీకి నోచుకోవడంలేదు. దీంతో కార్యాలయంలో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇదీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కీలకపాత్ర పోషించే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరిస్థితి. గతేడాది డిసెంబర్లో కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణితోపాటు ఇద్దరు సభ్యులు సి.విఠల్, చంద్రావతి పదవీకాలం పూర్తయింది. దీంతో మిగిలిన ఇద్దరు సభ్యులు కృష్ణారెడ్డి, సాయిలు మాత్రమే కొనసాగుతున్నారు. వీరిలో ఇన్చార్జి చైర్మన్‌గా కృష్ణారెడ్డిని ప్రభుత్వం నియమించింది. తాజాగా కృష్ణారెడ్డి ఈ నెలలో పదవీ విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో టీఎస్పీఎస్సీలో కేవలం ఒక్కరు మాత్రమే మెంబర్‌గా కొనసాగనున్నారు. ఒక్క సభ్యుడితో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొనసాగింపు అనేది మున్ముందు అయోమయంగా మారనుంది. ప్రభుత్వం పెద్దసంఖ్యలో ఉద్యోగాలభర్తీకి సన్నద్ధమవుతున్న వేళ కమిషన్‌లో సభ్యులు లేకపోవడంతో నియామకాలపై సందిగ్ధత ఏర్పడే అవకాశముంది. కోరం ఉంటేనే నోటిఫికేషన్లు... తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ ప్రకటనలు వెలువడాలంటే చైర్మన్‌తోపాటు ముగ్గురు సభ్యులు తప్పకుండా ఉండాలి. వారి ఆమోదంతోనే నోటిఫికేషన్లు విడుదల చేసేలా నిబంధనలున్నాయి. కానీ, ప్రస్తుతం ఇద్దరుసభ్యులు మాత్రమే ఉన్నారు. ఇందులో ఒకరు ఇన్చార్జి చైర్మన్‌గా ఉండగా, మరొకరు మాత్రమే సభ్యుడిగా కొనసాగుతుండటంతో ఇప్పటికిప్పుడు టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేసే పరిస్థితి లేదని కమిషన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 50 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే శాఖలవారీగా ఉన్న ఖాళీలు, ప్రాధాన్యతల ప్రకారం భర్తీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. మంజూరైన ఉద్యోగాలు, ప్రస్తుతం పనిచేస్తున్న వారు, ఖాళీలను లెక్కిస్తూ శాఖలవారీగా అంచనాలపై ఆర్థికశాఖ స్పష్టమైన నివేదికను తయారు చేసి ఉంచింది. ఆర్థికశాఖ అనుమతి ఇస్తే ప్రభుత్వం ఉద్యోగఖాళీల భర్తీకి ఇండెంట్లు వెలువడతాయి. ఇండెంట్లు వచ్చిన వెంటనే నోటిఫికేషన్లను టీఎస్పీఎస్సీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, నోటిఫికేషన్ల విడుదల కోరం మాత్రం లేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 39,952 పోస్టుల భర్తీకి అనుమతులు రాగా... అందులో అన్ని వివరాలు అందిన 36,758 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేశారు. అన్నింటికీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించగా, 35,724 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే 31,062 మంది ఉద్యోగాలలో చేరిపోయారు. మిగతా ప్రక్రియ కొనసాగుతోంది. -
పీహెచ్సీలో సిబ్బంది కొరత
మొయినాబాద్(చేవెళ్ల) : ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. సరిపడా సిబ్బంది లేకపోగా ఉన్న సిబ్బంది సైతం సమయపాలన పాటించకపోవడంతో ఆస్పత్రికి వచ్చినవారు ఇబ్బందులు పడుతున్నారు. మొయినాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం ఉదయం 8 గంటలకు సుమారు 50 మందికి పైగా చంటిపిల్లల తల్లులు ఆస్పత్రికి వచ్చారు. అప్పటికే సిబ్బంది ఎవరూ లేకపోవడంతో అక్కడే కూర్చున్నారు. ఉదయం 8 గంటలకే ఆస్పత్రికి రావాల్సిన వైద్య సిబ్బంది తీరిగ్గా 12.30 గంటలకు వచ్చి అప్పడు టీకాలు వేయడం మొదలు పెట్టారు. అప్పటి వరకు చిన్న పిల్లలతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
యువర్ అటెన్షన్ ప్లీజ్..పట్టాలు తప్పిన వైద్యం
గుంతకల్లు: ఘనమైన చరిత్ర కలిగిన గుంతకల్లు రైల్వే ఆసుపత్రి క్రమంగా ప్రాభవం కోల్పోతోంది. ఉద్యోగుల పాలిట సంజీవనిగా పేరొందిన వైద్యాలయమే జబ్బు పడింది. చికిత్స నోచుకోక రోగులకు అరకొర వైద్య సేవలతో సరిపెట్టుకుంటోంది. ఆసుపత్రి పరిధిలో అనంతపురం, వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, మహబూబ్‌నగర్, రాయచూర్, గుల్బ ర్గా, బళ్లారి, వేలూరు జిల్లాలు ఉన్నాయి. 1960లో ఆరు పడకలతో ప్రారంభమైన ఆసుపత్రి ప్రస్తుతం 130 పడకల స్థాయికి చేరింది. 14వేల మంది కార్మికులతో పాటు 6వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఈ ఆసుపత్రి పెద్దదిక్కు. గుత్తి, ధర్మవరం, కడప, నందలూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, ద్రోణాచలం, రాయచూర్ కేంద్రాల్లో రైల్వే ఆరోగ్య ఉప కేంద్రాలను నిర్వహిస్తున్నారు. వీటి నుంచి ప్రతి నెలా దాదాపు 2వేల మంది రోగులను గుంతకల్లుకు రెఫర్ చేస్తున్నారు. రోజూ వెయ్యి మందికి పైగా రోగులకు చికిత్స చేస్తుండగా.. నెలలో 150 నుంచి 200 దాకా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రిలో చిన్నపిల్లలు, కళ్లు, గైనకాలజిస్టు, కార్డియాలజీ, డెర్మటాలజీ, పెథాలజీ తదితర కీలక విభాగాలకు సంబంధించిన వైద్య పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. వైద్యుల కొరత నేపథ్యంలో లక్షలాది రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకు మూతపడింది. ప్రస్తుతం రోగులకు రక్తం అత్యవసరమైతే అనంతపురం, కర్నూలు, బళ్లారి నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. విధిలేక ప్రయివేటుకు.. వేలాది మంది కార్మికులతో ముడిపడిన రైల్వే ఆసుపత్రి ఎవరికీ పట్టని పరిస్థితి. కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో కార్మికులు విధిలేక ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. భారీగా తగ్గిన రోగుల సంఖ్యను పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఆసుపత్రిలోని మంచాలపై పరుపులు పూర్తిగా దెబ్బతినడంతో రోగుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. మంచాలు కూడా పాడవడంతో స్టాండ్స్ కింద రాళ్లు పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వైద్యుల కొరత కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈ రైల్వే ఆసుపత్రిలో నెలల తరబడి వైద్యుల పోస్టులను భర్తీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. అన్ని విభాగాలకు సంబంధించి 19 మంది వైద్యులు సేవలు అందించాల్సి ఉండగా.. ప్రసుత్తం 10 మంది వైద్యులే దిక్కయ్యారు. ఈ కారణంగా ఒకప్పుడు వెయ్యి మందికి పైగా ఓపీ ఉండగా.. ఇప్పుడు వందలోపు మాత్రమే ఉండటం గమనార్హం. ఇన్‌పేషెంట్లు కూడా 50 నుంచి 60 మందిలోపే ఉంటున్నారు. అదేవిధంగా పెథాలజిస్టు లేని కారణంగా బ్లడ్ బ్యాంకును మూతేశారు. పెద్ద రోగమైతే రెఫరల్ ఆసుపత్రికే.. ఆసుపత్రిలో కీలకమైన వైద్యులు లేకపోవడంతో రోగులు వ్యయప్రయాసలకు లోనుకావాల్సి వస్తోంది. చిన్న వ్యాధులకు సైతం అనంతపురంలోని ప్రయివేట్ రెఫరల్ ఆసుపత్రిని ఆశ్రయించాల్సి వస్తోంది. ఇతర జిల్లాల నుంచి ఎంతో ఆశతో ఇక్కడికి వస్తే.. వైద్యులు లేరనే కారణంతో రెఫరల్ ఆసుపత్రికి తరలిస్తుండటం రోగులతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులను కలచివేస్తోంది. రెఫరల్ ఆసుపత్రిలో చేరిన 24 గంటల్లోపు సమాచారం అందిస్తేనే రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. అయితే అప్పటి వరకు డబ్బు ఎలా సర్దుబాటు చేయాలనే ప్రశ్న తలెత్తుతోంది. సీఎంఎస్ దృష్టికి తీసుకెళ్లాం రైల్వే ఆస్పత్రిలో స్పెషలిస్టు డాక్టర్లను నియమించాలి. ఒక సివిల్ సర్జన్ వైద్యుడు, బ్లడ్ బ్యాంకును పునరుద్ధరించాలి. పూర్తిగా పాడైన మంచాలు, బెడ్స్‌తో పాటు రోగులకు అందించే యూనిఫాం తదితర అంశాలను డీఆర్ఎం ద్వారా చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లాం. – కె.ప్రభాకర్, ఎంప్లాయీస్ సంఘ్గుంతకల్లు డివిజన్ అధ్యక్షుడు మంచానికి సపోర్ట్‌గా రాళ్లు ఏర్పాటు చేసుకున్నాం నా భర్త రామాంజినేయలు రైల్వేలో పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందారు. గుత్తిలో ఉంటున్నాం. కొన్ని నెలలుగా మా ఆయన ఆర్యోగ పరిస్థితి బాగా లేకపోవటంతో నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలో చేర్పించాం. మంచం సరిగా లేకపోవటంతో రాళ్లు పెట్టుకున్నాం. పరుపు కూడా పాడైపోయింది. – లక్ష్మీదేవి, రిటైర్డు రైల్వే ఉద్యోగి భార్య -
నేరము–శిక్ష ఏదీనిలవట్లే!
నగరంలో వివిధ నేరాలకు సంబంధించిన కేసులు కోర్టుల్లో నిలవట్లేదు. సరైన సాక్ష్యాధారాలు లేక అతి ముఖ్యమైన కేసులూ వీగిపోతున్నాయి. కేవలం 38.9 శాతం కేసుల్లోనే దోషులకు శిక్ష పడుతోందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) స్పష్టం చేయడం ఇందుకు నిదర్శనం. ఏదైనా ఓ నేరానికి సంబంధించి నిందితుల్ని పట్టుకోవడమే కాదు... వారిని న్యాయస్థానంలో దోషులుగా నిరూపిస్తేనే బాధితులకు పూర్తి న్యాయం జరిగినట్లు. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో ఈ కోణంలో పోలీసులు విఫలం అవుతున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు చక్కదిద్దే చర్యలు ప్రారంభించారు. సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో (ఉమ్మడి) నమోదైన తొలి మానవబాంబు కేసు.. దాడి జరిగింది సాక్షాత్తూ నగర కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై. ఈ ఘాతుకంలో పెనుముప్పు తప్పినప్పటికీ ఓ హోంగార్డు ప్రాణాలు కోల్పోయాడు. కేసు దర్యాప్తు, విచారణ దాదాపు పుష్కరకాలం సాగింది. చివరకు కొన్నాళ్ల క్రితం కేసు న్యాయస్థానంలో వీగిపోయింది. ఈ ఒక్క కేసే కాదు.. పోలీసులు అభియోగపత్రాలు దాఖలు చేస్తున్న వాటిలో కనీసం సగం కేసులు కూడా కోర్టులో నిలవట్లేదు. నగరంలో నమోదవుతున్న కేసుల్లో శిక్ష పడుతున్నది కేవలం 38.9 శాతం మాత్రమేనని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) స్పష్టం చేసింది. దేశంలోని ఇతర మెట్రోల కంటే ఈ విషయంలో సిటీ వెనుకబడి ఉందనడానికి ఈ గణాంకాలే ఓ ఉదాహరణ. ఏదైనా ఓ నేరంలో నిందితులను పట్టుకోవడమే కాదు.. వారిని న్యాయస్థానంలో దోషులుగా నిరూపిస్తేనే బాధితులకు పూర్తి న్యాయం జరిగినట్లు. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో ఈ కోణంలో పోలీసులు విఫలమవుతున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారులు చక్కదిద్దే చర్యలు ప్రారంభించారు. సిబ్బంది కొరతతోనూ ఇబ్బందే.. నేరం నిరూపణలో 2016 ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం జాతీయ స్థాయిలోనూ కన్వెక్షన్స్ 45.1 శాతంగా నమోదయ్యాయి. ఈ పరిస్థితులకు అనేక కారణాలు ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. పోలీసు విభాగంలో క్షేత్రస్థాయి అధికారులైన ఇన్స్పెక్టర్, ఎస్సైల కొరత తీవ్రంగా ఉంది. అత్యధిక కేసుల్లో దర్యాప్తు అధికారులుగా వీరే ఉంటారు. ప్రమాణాల ప్రకారం ఒక్కో దర్యాప్తు అధికారి ఏడాదికి గరిష్టంగా 60 నుంచి 80 కేసుల్ని మాత్రమే దర్యాప్తు చేయాలి. సిబ్బంది కొరత వల్ల ఒక్కొక్కరు 300 నుంచి 400 కేసులు దర్యాప్తు చేయాల్సి వస్తోంది. ఈ ప్రభావం కేసులపై పడి దర్యాప్తులో నాణ్యత దెబ్బతింటోంది. సాంకేతిక కారణాలు, సాక్షులతోనూ.. అనేక కారణాల నేపథ్యంలో కేసును కొలిక్కి తీసుకువకావడంపై ఉంటున్న శ్రద్ధ సాక్ష్యాధారాల సేకరణపై ఉండట్లేదు. రోటీన్లో భాగంగా సేకరిస్తున్న వాటి విషయంలోనూ సాంకేతిక, నిబంధనల్ని దర్యాప్తు అధికారులు పట్టించుకోకపోవడంతో ఆధారాలను న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకోవట్లేదు. వీటన్నింటికీ మించి బాధితులు, సాక్షులతోనూ అధికారులు ఇబ్బందులు వస్తున్నాయి. ఆవేశం నేపథ్యంలో ఫిర్యాదు సమయంలో చూపిన ఆసక్తి బాధితులు కేసు విచారణలో చూపించట్లేదు. వీలున్నంత వరకు రాజీ ధోరణి ప్రదర్శిస్తున్నారు. మరోపక్క ఆయా కేసుల్లో సాక్షులు కేసు విచారణ సమయంలో ఎదురు తిరగడం సైతం ఇబ్బందికరంగా మారుతోంది. ఇవన్నీ న్యాయస్థానాల్లో కేసులు వీగిపోవడానికి ప్రధాన కారణాలవుతున్నాయి. వీటితో పాటు పోలీసులకు ఎప్పటికప్పుడు పునశ్ఛరణ తరగతులు నిర్వహించకపోవడం సైతం దర్యాప్తు నాణ్యతపై ప్రభావం చూపుతోంది. దర్యాప్తు విధానాల్లోనూ లోపాలు పోలీసు దర్యాప్తు విధానాల్లో ఉన్న అనేక లోపాలు కేసుల విచారణపై ప్రభావం చూపుతోంది. పాశ్చాత్య దేశాలతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తదితర సంస్థలు చేసే ఇన్వెస్టిగేషన్స్ పక్కాగా ఉంటాయి. ఓ నేరం జరిగినప్పుడు ప్రాథమికంగా వీరు నిందితుల కంటే ఆధారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వీరి దర్యాప్తు విధానం ‘ఎవిడెన్స్ టు అక్యూజ్డ్’ పం«థాలో సాగుతుంది. సీజర్, పంచ్ విట్నెస్ తదితర అంశాల్లోనూ పక్కాగా మాన్యువల్‌ను అనుసరిస్తారు. అయితే స్థానిక పోలీసుల దర్యాప్తు విధానం ‘అక్యూజ్డ్ టు ఎవిడెన్స్’ పంథాలో సాగుతుంది. తొలుత నిందితుడిని పట్టుకున్న తర్వాత నేరానికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తుంటారు. దిద్దుబాటు చర్యలతో ఫలితాలు నగరంలో నేర నిరూపణకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారులు చక్కదిద్దే చర్యలు చేపట్టారు. దర్యాప్తు అధికారులపై కేసుల భారం తగ్గించేందుకు అండర్ ఇన్వెస్టిగేషన్ (యూఐ) కేసు మేళాలు నిర్వహిస్తున్నారు. నేరం జరిగినప్పుడు ఆధారాల సేకరణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. క్రైమ్ ప్రివెన్షన్, డిటెక్షన్‌తో పాటు కన్వెక్షన్లోనూ సీసీ కెమెరాల ఫీడ్‌ను ఆధారంగా వాడుకుంటున్నారు. కేసు నమోదు నుంచి దర్యాప్తు, విచారణ పూర్తయ్యే వరకు బాధితులు, సాక్షులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు కోర్టు వ్యవహారాల పర్యవేక్షణకు కోర్టు మానిటరింగ్ సెల్ (సీఎంఎస్) పేరుతో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. క్లూస్ టీమ్స్ సంఖ్య పెంచడం, నాణ్యమైన పరికరాలు అందిచడంతో పాటు సిబ్బందికి అనునిత్యం శిక్షణ ఇస్తున్నారు. ఈ చర్యలతో క్రమక్రమంగా శిక్షల శాతం పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. -
సిబ్బంది కొరతా..? మీ మంత్రులనడగండి
అనంతపురం న్యూసిటీ: ‘సర్వజనాస్పత్రిలో సిబ్బంది కొరత ఉంటే..మీ మంత్రులు, చీఫ్ విప్‌లనే అడగండి. మీ జిల్లాకు పదవులు ఎక్కువగా వచ్చాయ్. వారినడిగితే బాగుంటుంది’ అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. గురువారం సర్వజనాస్పత్రిలోని రోగులకందుతున్న సేవలపై విలేకరులడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా స్పందించారు. సర్వజనాస్పత్రిలోని సమస్యలను తనవంతుగా సీఎం చంద్రబాబు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కరువు జిల్లా ‘అనంత’లో మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో భ్రూణహత్యలు తగ్గుముఖం పట్టాయని, అందుకు సర్వజనాస్పత్రిలో జరిగే ప్రసవాలే ఉదాహరణ అన్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రజల్లో చైతన్యం కల్గించేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. తల్లీబిడ్డకు మెరుగైన వైద్యం అందించేందుకు పీజీ చేసిన గైనిక్, చిన్నపిల్లల, మెడిసిన్ వైద్యులు రెండేళ్ల పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రస్తుతం కేటాయించిన పడకలు చాలడం లేదని, నూతన భవనాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అంతకుముందు ఆమె ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని గైనిక్, ఎస్ఎన్సీయూలను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. గైనిక్ వార్డులో ఓ మహిళ అప్పుడే పుట్టిన పాపను తీసుకురాగా... ఆ పాపను చేతుల్లోకి తీసుకున్న నన్నపనేని ‘అమరావతి’ అని నామకరణం చేశారు. చైర్పర్సన్ వెంట మహిళా కమిషన్ సభ్యురాలు పర్వీన్‌భాను, సర్వజనాస్పత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర రావు, ఆర్ఎంఓ డాక్టర్ లలిత, ఐసీడీఎస్ పీడీ వెంకటేశం, తదితరులున్నారు. -
రవాణా శాఖకు సిబ్బంది కొరత
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్ : ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని తెచ్చే రవాణా శాఖలో సరిపడా సిబ్బంది లేరు. ప్రతి ఏటా జిల్లా నుంచి ప్రభుత్వానికి ఈ శాఖ ద్వారా సుమారు 40 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. అయినప్పటికీ ఖాళీల భర్తీలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏళ్ల తరబడి ఈ శాఖలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జిల్లాలో ఏడుగురు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతానికి ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరిని ఆర్టీసీకి డిప్యుటేషన్‌పై పంపించారు. వెహికల్ ఇన్స్పెక్టర్లు నలుగురున్నారు. ఎనిమిది మంది సీనియర్ అసిస్టెంట్లకు ఆరుగురున్నారు. రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టెనో పోస్టులు రెండింటికి రెండూ ఖాళీగా ఉన్నాయి. రెండు డ్రైవర్ పోస్టులకు ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది తక్కువుగా ఆండడంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. దీంతో విధులు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. రవాణశాఖాధికారులు ప్రతి రోజూ వాహన తనిఖీలు నిర్వహించడం, పన్నులు వసూలు చేయడం. ఎల్‌ఎల్‌ఆర్‌లు, డ్రెవింగ్ లెసెన్సులు, ఫిట్నెస్ సరిస్టికెట్లు మంజూరు చేయాల్సి ఉంటుం ది. అలాగే అతివేగంగా వెళ్లే వాహనాలను కూడా నియంత్రించాల్సిన బాధ్యత వీరిపై ఉంది. సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వం విధించే లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా ఆపసోపాలు పడుతున్నారు. గతేడాది రూ.42 కోట్లు లక్ష్యం కాగా కేవలం 39 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయగలిగారు. మరి ఈ ఏడాదైనా ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని చేరుకుంటారో, లేదో చూడాలి. ఈ విషయాన్ని ఆర్టీఓ అబ్థుల్వ్రూప్ వద్ద న్యూస్‌లైన్ ప్రస్తావించగా సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమేనన్నారు.