
అనంతపురం సెంట్రల్: తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రసవించిన ఘటనను మరువకముందే అలాంటిదే మరొకటి వెలుగు చూసింది. తాడిపత్రి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక శుక్రవారం రాత్రి అనంతపురంలోని శ్రీకంఠం సర్కిల్ సమీపాన గల ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. శనివారం ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పసికందును ఆస్పత్రి ఆవరణలోనే వదిలిపెట్టి బాలికను తల్లిదండ్రులు తీసుకుని వెళ్లిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెంటనే స్పందించి మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ చిన్మయాదేవికి సమాచారం అందించారు. పీడీ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ అధికారులు సదరు పసికందును స్వాధీనం చేసుకున్నారు. పాప ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడంతో సర్వజనాస్పత్రికి తరలించారు. ఐసీయూ విభాగంలో పాపకు చికిత్స అందిస్తున్నారు. బాలికకు వివాహమైందా.. అత్యాచారానికి గురై పసికందును ప్రసవించి వదిలేసి వెళ్లారా అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment