ఎమర్జెన్సీ వార్డులో ఓ వ్యక్తికి కుట్లు వేస్తున్న ఎంఎన్‌ఓ
అనంతపురం న్యూసిటీ : అనంతపురం సర్వజనాస్పత్రిలో రోగులకు అందించే వైద్యసేవల్లో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఒకరి విధులు మరొకరు నిర్వర్తిస్తున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నా వైద్యాధికారులు పట్టించుకోవడం లేదు. సెక్యూరిటీ సిబ్బంది కూడా రోగుల సహాయకులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. హీనంగా మాట్లాడుతూ గొడవలకు దిగుతున్నారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పోకముందే అధికారులు మేల్కోవాలి. పాలనను గాడిలో పెట్టి.. వైద్యసేవలు మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆరోగ్యం ప్రశ్నార్థకం
♦ రెండ్రోజుల క్రితం ప్రమాదంలో గాయపడి ఎమర్జెన్సీ వార్డుకొచ్చిన రోగికి ఎంఎన్‌ఓ (మేల్ నర్సింగ్ ఆర్డర్లీ) కుట్లు వేస్తున్నాడు. సాధారణంగా కుట్లు మెడికల్ ఆఫీసర్/హౌస్‌సర్జన్ వేయాలి. కానీ ఎంఎన్‌ఓ కుట్లు వేసే సమయంలో ఎటువంటి సూది వాడుతున్నారో తెలియని పరిస్థితి. ఒకరికి వాడిన సూది మరొకరికి వాడితే ఆ రోగి ఆరోగ్యం ప్రశ్నార్థకమే.
ఎంతసేపు వేచి ఉండాలో..
♦ ఇక్కడ కనిపిస్తున్నది సర్వజనాస్పత్రిలోని జనన, మరణ రిజిస్ట్రేషన్ గది. బుధవారం ఉదయం 12 గంటలకే రిజిస్ట్రేషన్ గదితోపాటు రికార్డు రూంకు తాళాలు వేశారు. దీంతో ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.
ఎవరిది వారే తెచ్చుకోవాలి
♦ ఆస్పత్రిలో అడ్మిషన్‌లో ఉన్న మహిళలే మంచాలపై వేసుకోవడానికి బెడ్‌షీట్లు తెచ్చుకోవాలి. వాస్తవంగా ఆస్పత్రి సిబ్బందే పాత బెడ్‌సీట్లను తీసి కొత్త వాటిని రోజూ మార్చాలి. కానీ అటువంటి పరిస్థితి లేదు.
రిపోర్టు కచ్చితమేనా..?
♦ రోగికి ఈసీజీ తీస్తున్న వ్యక్తి పేరు సుధాకర్. ఈయన ఎల క్ట్రీషియన్. రెండు నెలలుగా ఆస్పత్రి యాజమాన్యం ఈసీజీ టెక్నీషియన్ బాధ్యతలను ఈయనకు అప్పగించింది. గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించి కచ్చితమైన రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. అర్హతలేని వ్యక్తులకు ఇటువంటి బాధ్యత అప్పగించడం పలు విమర్శలకు దారి తీస్తోంది.
మందులు తారుమారైతే..
♦ ఆస్పత్రిలో మందులిస్తున్న వ్యక్తి ఫార్మసిస్టు అనుకుంటే పొరపాటే. ఇతను గతంలో అడ్మిషన్ కౌంటర్‌లో విధులు నిర్వర్తించే వారు. ఇటువంటి వ్యక్తిని తీసుకువచ్చి కీలకమైన మందులిచ్చే ప్రాంతంలో పని చేయిస్తున్నారు. రోగులకు ఒక మందుపోయి మరొకటి ఇస్తే ఏంటి సంగతని ఆస్పత్రి సిబ్బందే చర్చించుకుంటున్నారు.
నోటి దురుసు
♦ సెక్యూరిటీ సిబ్బందిని నిలదీస్తున్న వ్యక్తి నార్పలకు చెందిన నారాయణ, వారి బంధువులు. బుధవారం లేబర్‌వార్డులో తమ బంధువులను చూసేందుకు వెళ్లగా, సెక్యూరిటీ అడ్డుకున్నారు. ‘గొర్రెల మంద’లా వెళ్తారనడంతో నారాయణ కుటుంబీకులు సెక్యూరిటీపై తిరగబడ్డారు. సెక్యూరిటీల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment