ఎన్ 95 మాస్క్‌లు లేక సాధారణ మాస్క్‌లతో చిన్నపిల్లల వార్డులో సేవలందిస్తున్న సర్వజనాస్పత్రి సిబ్బంది
పేరుకు జిల్లాకే పెద్దఆస్పత్రి.. సేవల్లో మాత్రం చిన్నాస్పత్రి.. జిల్లాలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తున్నా కనీసం మాస్క్‌లు.. మందులు కూడా లేని ధర్మాస్పత్రి. అందుకే వైద్యులు కూడా కేసులన్నీ రెఫర్ చేస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. వైద్యఆరోగ్య శాఖ చోద్యం చూస్తుండగా.. కలెక్టర్ సారూ ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. నిరుపేదలు ప్రాణాలు నిలుపుకునేందుకు దొరికిన చోట్ల అప్పులు చేస్తూ ఇతర జిల్లాలకు
పరుగు తీస్తున్నారు.
అనంతపురం న్యూసిటీ: జిల్లాలో స్వైన్‌ఫ్లూ పంజా విసురుతోంది. గడిచిన రెండు నెలల్లో 13 కేసులు నమోదయ్యాయి. ప్రజలు స్వైన్‌ఫ్లూ భయంతో వణికిపోతున్నారు. బాధితుల్లో చిన్నారులే అధికంగా ఉండటం అందరినీ కలవరపెడుతోంది. మరోవైపు స్వైన్‌ఫ్లూ బాధితుల ప్రాణాలతో వైద్యఆరోగ్యశాఖ, సర్వజనాస్పత్రి యాజమాన్యం ఆటలాడుతోంది. మందులు.. కనీసం మాస్క్‌లు కూడా అందుబాటులో ఉంచకుండా చోద్యం చూస్తోంది. ఇదే సాకుగా వైద్యులు కేసులన్నీ కర్నూలుకు రెఫర్ చేస్తున్నారు. దీంతో నిరుపేదలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కేసులన్నీ కర్నూలుకే..
సర్వజనాస్పత్రి వైద్యులు మౌలిక సదుపాయాల లేమిని సాకుగా చూపి ఇప్పటి వరకు 9 కేసులను కర్నూలుకు రెఫర్ చేశారు. దీంతోనిరుపేదలంతా ఆర్థికంగా చితికిపోతున్నారు. వాస్తవంగా స్వైన్‌ఫ్లూ రోగులను ఐదు రోజుల పాటు ఐసొలేషన్ వార్డులో ఉంచి, మందులు అందించాలి. అవసరాల మేరకు ఫ్లూవాక్ వ్యాక్సిన్, వెంటిలేటర్, వైరల్‌కిట్, ఎన్95 మాస్క్‌లు అందుబాటులో ఉంచాలి. ప్రస్తుతం వ్యాక్సిన్, ఎన్95 మాస్క్‌లు పూర్తిస్థాయిలో లేవు. స్వైన్‌ప్లూ వార్డులో పీడియాట్రిక్ వెంటిలేటర్ సదుపాయం లేదు. ఇవి ఏర్పాటు చేస్తే రోగులకు ఇక్కడే మెరుగైన వైద్యం అందించే వెసులుబాటుంది. ఏఎంసీ, క్యాజువాలిటీ తదితర విభాగాల వైద్యులు, స్టాఫ్‌నర్సులు, సిబ్బందికి ఫ్లూవాక్ వ్యాక్సిన్ వేయలేదు. ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటే రోగులకు మరింత సేవలందించే అవకాశం ఉంటుంది.
వైద్యుల మధ్య కోల్డ్‌వార్
సర్వజనాస్పత్రిలో వైద్యుల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. స్వైన్‌ఫ్లూ కేసులను చెస్ట్‌వార్డ్‌లో ఉంచుతారు. రోగులకు వైద్యం అందించే బాధ్యత సంబంధిత పల్మనాలజీ విభాగం వైద్యులదే. కానీ పల్మనాలజీ విభాగం వైద్యులు మాత్రం ఏ వార్డు నుంచి కేసు వస్తే వారే రెఫర్ చేయాలని చెబుతున్నారు. దీన్ని మిగితా విభాగాల వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో ఎక్కడి నుంచైనా స్వైన్‌ఫ్లూ కేసు వస్తే సర్వజనాస్పత్రిలోనే అడ్మిట్ చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో వైద్యులు ఇలా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 24న ఓ స్వైన్‌ఫ్లూ బాధితునికి వైద్యం అందిచే బాధ్యత మీదంటే.. మీదంటూ ఆర్‌ఎంఓ సమక్షంలోనే పల్మనాలజీ, పీడియాట్రిక్, మెడిసిన్, మైక్రోబయాలజీ, అనస్తీషియా, ఈఎన్‌టీ విభాగం వైద్యులు ఘర్షణ పడ్డారు.
ఆస్పత్రి వైపు కన్నెత్తి చూడని కలెక్టర్
జిల్లాలో స్వైన్‌ఫ్లూ బాధితుల సంఖ్య పెరిగి సర్వజనాస్పత్రిలో కనీస సౌకర్యాలు లేక జనం అల్లాడిపోతున్నా జిల్లా కలెక్టర్ ఆస్పత్రి వైపు కన్నెత్తి చూడడం లేదు. కనీసం స్వైన్‌ఫ్లూ కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న దానిపై అధికారులతో సమీక్ష కూడా చేయలేదు. ఇప్పటికైనా కలెక్టర్ వీరపాండియన్ స్పందించకపోతే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని వైద్యులే చెబుతున్నారు.
జిల్లాలో ప్రభావిత ప్రాంతాలు
జిల్లాలోని నార్పల, ఓడీసీ, శింగనమల, గుంతకల్లు, అనంతపురం రూరల్, అర్బన్, గార్లదిన్నె, కంబదూరు మండలాల్లోని గ్రామాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో ఆరోగ్యశాఖాధికారులు, ముందస్తు చర్యలు తీసుకోలేదు. తూతూమంత్రంగా కరపత్రాలు పంచి పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. మరోవైపు వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుద్ధ్య లోపం కూడా ఓ కారణంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment