సర్వజనాస్పత్రి
అనంతపురం న్యూసిటీ:అనంత సర్వజనాస్పత్రిలో పాలన అస్తవ్యస్తంగా మారింది. బోధనాస్పత్రిలోని 17 మంది ప్రొఫెసర్లను పక్కనపెట్టి గతేడాది మే 2న సివిల్ సర్జన్ స్పెషలిస్టుగా ఉన్న డాక్టర్ జగన్నాథ్‌కు సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్(ఎఫ్‌ఏసీ)గా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. నిబంధనలకు విరుద్ధంగా సాగిన ఈ నియామకం ద్వారా ఆస్పత్రిలో పాలన వ్యవహారాలు గాడితప్పాయి. కలెక్టర్ అనుమతి లేకుండానే ఆస్పత్రిలోని పలు విభాగాల్లో నియామకాలను పూర్తి చేయడమే కాదు.. ఓపీ, ఐపీ బ్లాక్‌ను రిజిస్ట్రేషన్‌ను ప్రైవేట్‌కు అప్పజెప్పడం పలు విమర్శలకు దారితీస్తోంది. వైద్యుల పోస్టు భర్తీ చేసే ముందు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉన్నా.. తుంగలో తొక్కి తమకు అనుకూలంగా ఉన్నవారిని విధుల్లోకి తీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎమర్జెన్సీ(క్యాజువాలిటీ)లో నెల రోజులుగా మందులు లేవు. రోజూ 2వేల మంది ఔట్, 1,300 మంది ఇన్‌పేషెంట్లు ఉన్న సర్వజనాస్పత్రిలో రోగులకే కాదు నర్సింగ్ విద్యార్థుల మానప్రాణాలకు భద్రత లేకుండా పోతోంది.
చికిత్స కోసం వస్తేనరకయాతనే
ఆస్పత్రికి రోజూ ఐదు నుంచి పది పాయిజన్ కేసులు వస్తుంటాయి. ఈ కేసుల్లో రోగి ప్రాణాలు కాపాడేందుకు రైల్స్ ట్యూబ్ అవపసరం చాలా ఉంటుంది. రూ. 120 విలువ చేసే ఈ ట్యూబ్‌లను అందుబాటులో ఉంచడంలో యాజమాన్యం విఫలం చెందింది. పాయిజన్ కేసుల్లో రోగుల కుటుంబసభ్యుల చేతనే బయట నుంచే వాటిని కొనుగోలు చేయిస్తున్నారు. కేవలం రైల్స్ ట్యూబ్‌లే కాదు. లాసిక్స్, కుట్లు వేసే పరికరాలు, సర్జికల్ గ్లౌస్, అస్తాలిన్ ద్రావణం, కాటన్, తదితర పది రకాల వస్తువులను కూడా రోగులే తమ వెంట తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
శానిటేషన్‌కి దాసోహం
ఆస్పత్రిలో శానిటేషన్ నిర్వాహకులకు యాజమాన్యం దాసోహమంటోంది. ప్రతి నెలా శానిటేషన్‌కి రూ 20 లక్షలు చెల్లిస్తున్నారు. ఇందుకు గాను ఆస్పత్రిలో పారిశుద్ధ్యం నిర్వహణపై పర్సెంటేజీలో వేసి ఆ మేరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. దీనిపై అప్పటి కలెక్టర్ కోన శశిధర్ 90 శాతం కంటే ఎక్కువ పర్సెంటేజీ ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆస్పత్రి యాజమాన్యం 92 నుంచి 96, 97 శాతం పర్సెంటేజీ ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో వివిధ విభాగాల ప్రొఫెసర్లు, నర్సింగ్ స్టాఫ్ ఇచ్చే మార్కుల ఆధారంగా పర్సెంటేజీ వేసేవారు. ఇప్పుడు కేవలం సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓ, మేనేజర్ మాత్రమే పర్సేంటేజీ మార్కులు వేస్తున్నారు.
అమ్మాయిలే టార్గెట్
కొందరు సెక్యూరిటీగార్డులు, సిబ్బంది ఆస్పత్రికి వచ్చే నర్సింగ్ విద్యార్థినిలు, రోగులను టార్గెట్ చేస్తున్నారు. వారికి మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుంటున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైంది. సెక్యూరిటీ గార్డుల అసభ్య ప్రవర్తనతో పలువురు రోగులు, వైద్య సిబ్బంది విసుగెత్తి పోయారు.
లంచమిస్తే చికిత్స
సర్వజనాస్పత్రిలో వైద్య చికిత్సలన్నీ ఉచితమే. అయితే ఇక్కడ మాత్రం లంచం అందనిదే చికిత్సలు అందడం లేదు. గత నెల 28న గైనిక్ వార్డులో తన బిడ్డ వందన ప్రసవానికి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పద్మశ్రీ రూ.వెయ్యి తీసుకున్నారని నార్పలకు చెందిన రవికుమార్ ఏకంగా జిల్లా కలెక్టర్ వీరపాండియన్‌కు ఫిర్యాదు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మగబిడ్డ పుడితే రూ.వెయ్యి, ఆడ బిడ్డ పుడితే రూ.500 బలవంతంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఎమ్మెల్యే అనుమతితోనే..
చిన్న పిల్లల వార్డును మూడో అంతస్తులో ఏర్పాటు చేయడంతో 18 మంది పారిశుద్ధ్య కార్మికులు అవసరం ఏర్పడింది. వీరందరినీ స్థానిక ఎమ్మెల్యే అనుమతితోనే తీసుకున్నాం. ఇక నెఫ్రాలజిస్టులు దొరికేది చాలా కష్టం. ‘అనంత’లోనే ఓ వైద్యుడు అందుబాటులో ఉంటే ఆయన్ను డైరెక్ట్‌గా అపాయింట్ చేసుకున్నాం. ఆర్‌ఎంఓ వేరే జిల్లాకి వెళ్లాలని ట్రై చేస్తున్నారు. అందుకే సెలవులో వెళ్తున్నారు.
– డాక్టర్ జగన్నాథ్, సూపరింటెండెంట్,
Comments
Please login to add a commentAdd a comment