ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్న మృతురాలి కుటుంబసభ్యులు
నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్న ఎంసీహెచ్ బ్లాక్‌లో మంగళవారం బాలింత మృతిచెందింది. మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తుండగా, వైద్యులు హై బీపీ కారణంగానే బాలింత చనిపోయిందని చెబుతున్నారు. కాగా మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని వివరాల మేరకు.. కోవూరు మండలంలోని వేగూరు పంచాయితీలో ఉన్న సీతారామపురం గ్రామానికి చెందిన గుంటి రాజమ్మ (19)కు నెల్లూరుకు చెందిన బాలరాజుతో వివాహమైంది. అతను కొయ్య పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రాజమ్మ గర్భం దాల్చడంతో రెండునెలలపాటు ప్రైవేట్ హాస్పిటల్‌లో చూపించారు. తర్వాత నుంచి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ఎంసీహెచ్‌లో చూపిస్తున్నారు. ఆమెకు ఏడో నెల వచ్చే సరికి బీపీ అధికంగా ఉందని ఆస్పత్రిలో చేర్చాలని వైద్యులు సూచించారు. దీంతో 9 రోజుల క్రితం రాజమ్మను ఆస్పత్రిలో చేర్పించారు.
కాన్పు చేయగా..
బీపీ నియంత్రణలో లేకపోవడంతో వెంటనే ఆపరేషన్ చేసి కాన్పు చేయకపోతే తల్లీబిడ్డకు ప్రమాదమని, మెరుగైన వైద్యం కోసం తిరుపతిలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికైనా తీసుకెళ్లాలని వైద్యులు ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారు తాము తిరుపతికి వెళ్లలేమని ఇక్కడే వైద్యం చేయండని చెప్పడంతో డాక్టర్లు రాజమ్మకు సోమవారం ఆపరేషన్ చేసి కాన్పు చేశారు. పుట్టిన ఆడశిశువు నెలలు, బరువు తక్కువ కారణంగా ప్రత్యేక వార్డులోని బాక్సులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. అయితే మంగళవారం రాజమ్మకు బీపీ మరింత అధికమై మృతిచెందినట్లు వైద్యులు చెబుతున్నారు. మృతురాలి కుటుంబసభ్యులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రాజమ్మ చనిపోయిందని ఆరోపిస్తున్నారు. దర్గామిట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు.
కారణం చెప్పాలంటూ..
రాజమ్మ మృతికి కారణాలు చెప్పాలంటూ మృతురాలి కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని దీనిపై దర్యాప్తు చేస్తామని వారికి చెప్పారు. మృతికి గల కారణం చెబితేనే ఇక్కడి నుంచి వెళతామని రాజమ్మ కుటుంబసభ్యులు భీష్మించుకున్నారు. ఈ క్రమంలో కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావును వివరణ కోరగా రాజమ్మకు హై బీపీ ఉందన్నారు. అందుకు అవసరమైన వైద్యం అందించినట్లు చెప్పారు. అయినా బీపీ కంట్రోల్ కాకపోవడంతో ఆమె మృతిచెందినట్లు తెలియజేశారు. పూర్తిస్థాయిలో నివేదికను తయారుచేసి సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment