
డాక్టర్ మస్తాన్ బాషాను సన్మానిస్తున్న రోగి బంధువులు, వైద్యులు
నెల్లూరు(బారకాసు): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కార్పొరేట్ హాస్పిటళ్లకు దీటుగా రోగులకు మెరుగైన వైద్యసేవలను ఉచితంగా అందిస్తున్నారు. 90 ఏళ్ల వృద్ధుడు ప్రమాదవశాత్తూ పడిపోయి కాళు, చేయి విరిగితే అతనికి 45 రోజుల పాటు జీజీహెచ్ వైద్యులు, వైద్య సిబ్బంది శ్రమించి మెరుగైన వైద్యసేవలందించి ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దారు. ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు మస్తాన్‌బాషాను మంగళవారం జీజీహెచ్‌లో రోగి కుటుంబసభ్యులు, వైద్యాధికారులు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలిచ్చి ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ చాట్ల నరసింహరావు మాట్లాడారు. బాలాజీనగర్‌కు చెందిన 90 ఏళ్ల వృద్ధుడు శేషయ్య ప్రమాదవశాత్తూ పడిపోయి కాళు, చేయి విరిగిపోయి చికిత్స నిమిత్తం జీజీహెచ్‌లో చేరారన్నారు.
ఆర్థోపెడిక్ వైద్యుడు మస్తాన్‌బాషా పరీక్షించి రక్తహీనతతో పాటు ఇతర వ్యాధులు ఉన్నాయని గుర్తించారని, విరిగిన కాలు, చేయికి అవసరమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి నయం చేశారని తెలిపారు. ఏసీఎస్సార్ ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధాకృష్ణరాజు, అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ కళారాణి, ఆర్థో విభాగ హెడ్ డాక్టర్ హరిబాబు, అనస్థీషియా హెడ్ డాక్టర్ నిర్మలాదేవి, కమిటీ సభ్యురాలు లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.