తల్లితో ఎన్‌ఆర్‌సీలో ఉన్న గఫూర్
అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలోని కొందరు వైద్యులు కమిషన్ కోసం కక్కుర్తి పడుతున్నారు. రోగిని ఒక చోట అడ్మిషన్ చేసి మరో వార్డులో సేవలందిస్తున్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద వేలాది రూపాయలు డ్రా చేసేందుకు సిద్ధమవుతున్నారు. వివరాల్లోకి వెళితే..నగరంలోని అరవిందనగర్‌కు చెందిన ఆలంవలి, షరీఫ దంపతులు తమ కుమారుడు గఫూర్‌కు (16 నెలలు) తీవ్ర జ్వరం, దగ్గు రావడంతో జూన్ 26న ఆస్పత్రిలో చేర్చారు.
పరీక్షించిన వైద్యులు చిన్నారి బరువు తక్కువగా ఉండడంతో ఆస్పత్రిలోని న్యూట్రిషియన్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో అడ్మిట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షలు చేయగా... సివియర్ బ్రాంక్‌డ్ నిమోనియాగా తేలింది. అయితే ఓ అసోసియేట్ ప్రొఫెసర్ కమిషన్ కోసం కేసును ఎన్టీఆర్ వైద్య సేవ కింద నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఈ నెల 4న ఎన్‌ఆర్‌సీ యూనిట్ సిబ్బంది గఫూర్ కేసు వివరాలను ఎన్టీఆర్ వైద్య సేవ డాటా ఎంట్రీ ఆపరేటర్‌కు అందజేశారు. సర్జరీ మెడికల్ మేనేజ్‌మెంట్ ఆఫ్ సివియర్ బ్రాంక్‌డ్ నిమోనియాగా ప్రీఆథరైజేషన్ కోసం పంపారు.
అవాక్కైన కుటుంబీకులు
అయితే ఎన్టీఆర్ వైద్యసేవ నుంచి ఈ నెల 7న గఫూర్ తల్లిదండ్రులకు ఓ మెసేజ్ వచ్చింది. గఫూర్‌కు మూడ్రోజుల పాటు చేసిన ట్రీట్‌మెంట్‌కు రూ 15,000 మంజూరు చేసినట్లు మెసేజ్ ఉంది.
హెచ్‌ఓడీ నిలదీత
ఈ విషయంపై గఫూర్ తల్లిదండ్రులు హెచ్‌ఓడీ డాక్టర్ మల్లీశ్వరితో పాటు ఎన్‌ఆర్‌సీ సిబ్బందిని నిలదీశారు. వైద్యం చేయకుండానే డబ్బు ఎలా డ్రా చేశారని ప్రశ్నించారు. అయితే ఈ విషయం తనకు తెలియదని హెచ్‌ఓడీ జారుకున్నారు.
ఇదీ అసలు కథ
వాస్తవంగా ఎన్‌ఆర్‌సీలో అడ్మిట్ అయిన వారు ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలోకి రారు. అయితే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ట్రీట్‌మెంట్ ఇచ్చినట్లు నమోదు చేస్తే.. సంబంధిత వైద్యురాలికి కమిషన్ వస్తుంది. అందుకే ఈ బాగోతానికి తెరలేపినట్లు తెలుస్తోంది.
ఆదేశాలు రాలేదు
ఎన్‌ఆర్‌సీ రోగులు ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలోకి రారు. నిమోనియా ఎన్టీఆర్ వైద్య సేవ కింద వస్తుంది. కేసు వివరాలు అప్‌లోడ్ చేశాం. ఇంకా కన్‌ఫాం కాలేదు. ఇదే విషయమై సంబంధిత అసోసియేట్ ప్రొఫెసర్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు నాకు తెలియదు.– డాక్టర్ మల్లీశ్వరి, హెచ్‌ఓడీ, చిన్నపిల్లల విభాగం
Comments
Please login to add a commentAdd a comment