కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తున్న వరాలు అమలుకు నోచుకోవడం లేదు. నిధులు మంజూరు చేస్తున్నట్లు కాగితాలపై ప్రకటిస్తున్నారే గానీ పనులు మాత్రం మొదలుకావడం లేదు. ఇందుకు పలు రకాల కొర్రీలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. నిధుల కొరత కారణంగానే రాష్ట్ర ఉన్నతాధికారులు పనులను వాయిదా వేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆసుపత్రికి కర్నూలుతో పాటు ప్రకాశం, అనంతపురం, వైఎస్సార్, మహబూబ్‌నగర్, రాయచూరు, బళ్లారి జిల్లాల నుంచి వందలాది మంది రోగులు వస్తున్నారు. ప్రతిరోజూ ఓపీ 3 వేలు, ఐపీ 1300 నుంచి 1500 దాకా ఉంటోంది. 20 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇది రెట్టింపు. కానీ అభివృద్ధి పనులు మాత్రం 30 ఏళ్ల క్రితం నాటివి ఉన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం కర్నూలు జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ప్రగల్భాలు పలికే పాలకులు పనులను వాస్తవ రూపంలోకి తీసుకురావడం లేదు. అందరూ ఆశపడేటట్లు పనులు ప్రకటించడం, ఆ తర్వాత వాటిని అటకెక్కించడం షరా మామూలుగానే అయ్యింది. ఇప్పటికే కోట్లాది రూపాయల పనులు మొదలుకాకుండా ఆగిపోతున్నాయి.
2015లో మంజూరైనా ఇప్పటికీ ప్రారంభం కాలేదు
ఆసుపత్రిలో రూ.15కోట్లతో రేడియోడయాగ్నోస్టిక్ బ్లాక్ నిర్మించనున్నట్లు 2015లో ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి రెండేళ్ల పాటు దాని ఊసు ఎత్తలేదు. ఏడాది క్రితం టెండర్లు పిలుస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటిదాకా పిలువ లేదు. అలాగే రూ.1.35కోట్లతో గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగానికి ఐసీయూ బ్లాక్ నిర్మాణానికి 2016లో ప్రకటించి ఇప్పటి వరకు ఒక్క ఇటుక ముక్క కూడా పేర్చలేదు. ఇందుకు సంబంధించి టెండర్‌ను ప్రతిసారీ వాయిదా వేస్తూ వెళ్తున్నారు. 2016లోనే రూ.2కోట్లతో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణానికి టెండర్ పిలుస్తున్నట్లు ప్రకటించినా ఇప్పటి వరకు పిలవలేదు. మూడేళ్ల క్రితం నిర్మించతలపెట్టిన డిస్ట్రిక్ట్ ఇంటర్వెన్షన్ చైల్డ్ సెంటర్ నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి ఇప్పటి వరకు పనులు మొదలుపెట్టలేదు.
ప్రజలను మభ్యపెట్టేందుకే..
జిల్లా ప్రజలకు ఏదో చేస్తోందని భ్రమింపజేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి పనులు ప్రకటిస్తోంది. ఆ తర్వాత నిధుల కొరత పేరు చెప్పి టెండర్ వేయకుండా అడ్డుపడుతోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కోట్ల రూపాయలతో చేపట్టే పనులను రాష్ట్ర స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, ఆర్‌అండ్‌బి, ఏపీఎంఎస్‌ఐడిసి సీఈలతో కూడిన టెండర్ కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ కమిటీ సభ్యులు సమయాభావం పేరు చెప్పి పనుల ఆమోదానికి సమావేశం ఏర్పాటు చేయడం లేదు. ఇటీవల వారం రోజుల క్రితం ఈ కమిటీ కూర్చున్నా పనుల అంచనా విలువ వ్యాట్‌తో వేశారని, దానిని మార్చి జీఎస్‌టితో వేసుకురావాలని కింది స్థాయి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇలా ప్రతిసారీ ఏదో ఒక వంక పెట్టి పనులను ప్రారంభించకుండా వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఖాతాలో రూ.10కోట్ల దాకా ఎన్‌టీఆర్ వైద్యసేవ నిధులు ఉన్నా వాటిని ఉపయోగించలేని పరిస్థితి. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం రివాల్వింగ్ ఫండ్ కింద మినహాయించుకుని విడుదల చేస్తుంది. కనీసం ఆ నిధులతోనైనా ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని వైద్యులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment