
అనంతపురం న్యూసిటీ: జిల్లా కేంద్రం అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో మౌలిక సదుపాయా లు కొరవడ్డాయి. రోజూ మూడు వేలమంది దాకా రోగులు వైద్యం కోసం వస్తున్నారు. సౌకర్యాలు కల్పించడంలో ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం రోగులకు శాపంగా మారుతోంది. ఆస్పత్రిలో ఏ స్థాయిలో నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయని, రోగులకు ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయో పరిశీలించేందుకు ఈ నెల 31న నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ (ఎన్‌ఏబీహెచ్) బృందం వస్తోంది. వైద్య సేవల తీరును పరిశీలించి ర్యాంకు ఇస్తారు. దీని ద్వారా ఆస్పత్రి స్థాయి ఏపీ చిత్రపటంలో ఓ మార్క్ వేసుకోనుంది.
♦ జీఓ 124 ప్రకారం సర్వజనాస్పత్రిలో 649 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. రోగులను తీసుకెళ్లే ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలు లేకపోవడంతో శానిటేషన్ సిబ్బంది, రోగి బంధువులే ఆ పని చేయాల్సి వస్తోంది.
♦ ఆస్పత్రిలో కొందరు సిబ్బంది నాణ్యతా ప్రమాణాలకు మంగళం పాడుతున్నారు. పనిభారం కారణంగా ముందస్తుగానే సిరంజిలు లోడ్ చేసి ఉంచడంతో పాటు వాడిన బ్లడ్ బ్యాగులు, సిరంజిలను ఎక్కడపడితే అక్కడ వదిలేస్తున్నారు.
♦ ఆస్పత్రిలో పారిశుద్ధ్యం కూడా అధ్వానంగా ఉంది. లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నా పారిశుద్ధ్యం మెరుగుపడలేదు.
♦ ఇక్కడ రోగిని ఎంఎం వార్డుకి తీసుకెళ్తున్నది ఓ పారిశుద్ధ్య కార్మికురాలు. వాస్తవంగా రోగులను తీసుకెళ్లేందుకు ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలు ఉండాలి. అయితే 30 ఏళ్లుగా ఇక్కడ ఈ పోస్టులు భర్తీ చేయలేదు. చివరకు పారిశుద్ధ్య కార్మికులే దిక్కవుతున్నారు.
సర్వజనాస్పత్రిలోని ఓ వార్డులో సిరంజిల్లో ముందస్తుగా మందులోడ్ చేసి ఉంచారు. ఇలా చేయడం ద్వారా రోగులకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం లేకపోలేదు. రోగికి వాడిన సిరంజిలనూ పక్కనే ఉంచారు. ప్రాణాంతక జబ్బులతో బాధపడే వారి ఇన్ఫెక్షన్స్ సోకితే అంతే సంగతులు. గతేడాది ఎన్‌ఏబీహెచ్ బృందం ఈ అంశాన్ని ప్రధానంగా రిమార్క్స్‌లో పొందుపర్చింది. 1947 కాలం పద్ధతులు అనుసరిస్తున్నారని ఓ స్టాఫ్‌నర్సుకు చివాట్లు పెట్టింది. అయినా పరిస్థితిలో మార్పు కనిపించలేదు.
♦ రోగులను రెండు, మూడో అంతస్తులోని వార్డులకు తీసుకెళ్లేందుకు ఆస్పత్రి యాజమాన్యం ఈ ఏడాది రూ. 6 లక్షలు వెచ్చించి లిఫ్ట్ ఏర్పాటు చేసింది. కానీ తరచూ లిఫ్ట్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment