సర్వశిక్షాస్పత్రి | Pregnant Womens Suffering in Sarvajana Hospital | Sakshi
Sakshi News home page

సర్వశిక్షాస్పత్రి

Published Thu, Oct 4 2018 11:55 AM | Last Updated on Thu, Oct 4 2018 11:55 AM

Pregnant Womens Suffering in Sarvajana Hospital - Sakshi

సర్వజనాస్పత్రికి వెళ్లే వారంతా సర్వశిక్షలూ అనుభవించాల్సిందే. ఇక్కడి వైద్యులకు.. సిబ్బందికి జాలి, దయ, మానవత్వం ఏమీ ఉండవనే సంగతి మరోసారి రుజువైంది. కళ్లముందే బాలింతలు నరకం చూసున్నా.. ఓ ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఏ మాత్రం పట్టించుకోకుండా మరింత ఇబ్బంది పెట్టాడు. ఇక నొప్పితో విలవిల్లాడుతున్న మరో బాలింతకు స్టాఫ్‌నర్సు కనీసం సూది వేసేందుకు కూడా ముందుకు రాకపోగా ఇంజెక్షన్‌ వేయాలని సూచించిన వైద్యురాలితో తగదా పెట్టుకుంది.  ఏ ఆస్పత్రిలోనైనా ఒకే రోజు ఐదుగురు శిశువులు మృత్యువాత పడితే.. మరుసటి రోజు కలెక్టర్‌ స్థాయిలో తనిఖీలు.. వైద్యులపై చర్యలుంటాయి. కానీ ఇక్కడ కనీసం విచారణ కూడా లేదు. అందుకే వైద్యులు.. సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రినే నమ్ముకుని ఇక్కడికొచ్చే వారికి చావును ప్రసాదిస్తున్నారు.

ఆస్పత్రి సేవలకు నిదర్శన చిత్రమిది. తుగ్గలి మండలం దిగువచింతలకొండకు చెందిన బాలింత జ్యోతి హెచ్‌బీ పరీక్ష చేయించుకునేందుకు క్యూలో నిలబడలేక పడిపోయింది. తోటివారు సహకరించడంతో.. ఓ వైపు రక్తస్రావం అవుతున్నా క్యూలో నిల్చుంది. ఎక్కడైనా టెక్నీషియన్‌ ప్రతి మంచం వద్దకు వెళ్లి పరీక్ష చేస్తాడు. ఇక్కడేమో బాలింతలే ఆయన వద్దకు వెళ్లాలి. ఇది సర్వజనాస్పత్రి మరి.

అనంతపురం న్యూసిటీ:  సర్వజనాస్పత్రి వైద్యులు, సిబ్బంది తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఒకేరోజు ఐదుగురు శిశువులు మృత్యువాత పడినా...వారికి కనీసం చీమకుట్టినట్లు కూడా లేదు. ఎప్పటిలాగే బుధవారమూ నిర్లక్ష్య వైద్యమే చేశారు. మంగళవారం నాటి ఘటనపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించగా..సూపరింటెండెంట్‌ జగన్నాథ్‌ ముగ్గురు వైద్యులతో కమిటీ వేశారు. అనంతరం ఆయన కూడా పలువార్డులకువెళ్లి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆయన ఎక్కడకు వెళ్లినా సిబ్బంది సమస్యలే ఏకరువుపెట్టారు. 

బాలింతల అవస్థలెన్నో...
గైనిక్‌ విభాగంలోని పోస్టునేటల్‌ వార్డులో బాలింతలు ప్రత్యక్షనరకం చూస్తున్నారు. ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు ఉంటున్నారు. పోస్టునేటల్‌ వార్డులో ఫ్యాన్లు తిరగక ఏళ్లు గడుస్తోంది. దీంతో బాలింతులు ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు. 

కడుపుకోత మిగిల్చారు
ప్రైవేట్‌గా చికిత్స చేయించుకోవాలంటే రూ.వేలు ఖర్చు అవుతుంది. ఆస్పత్రిలో బాగా చూస్తారనే ఆశతోనే నా భార్యను తీసుకువచ్చా. ఇక్కడేమో వైద్యులు, సిబ్బంది సరిగా పట్టించుకోలేదు. గత నెల 28న కడుపులో బిడ్డ బాగా ఉందని చెప్పారు. నిన్న(ఈ నెల 2న) ఉదయం 6 గంటలకు వచ్చాం. కాసేపటికల్లా బిడ్డ ఇస్తారని ఎంతో సంతోషించా. బిడ్డ చనిపోయిందని చెప్పారు. ఇంతకన్నా ఘోరం ఎక్కడుంటుందయ్యా(ఏడ్చుకుంటూ).  – వీరనారాయణచారి, ప్రమీల భర్త, మేడిమాకులపల్లి, పెదవడుగూరు  

ఇంత నిర్లక్ష్యమా?  
మేము పేదోళ్లమయ్యా... అందుకే ప్రైవేటు ఆస్పత్రులకు పోలేక ఇక్కడ ప్రసవం చేయించేందుకు తీసుకువచ్చాం. ప్రాణం లేని బిడ్డను అట్టపెట్టెలో ఉంచి ఇచ్చారే. ఇంతకన్నా నిర్లక్ష్యమెక్కడుంటుంది. వైద్యులపై నమ్మకం లేకుండా పోతోంది.  – నిర్మల, ప్రమీల వదిన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement