
ప్రతీకాత్మక చిత్రం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, పొదలకూరు: భార్య, ఆమెతో సహజీవనం చేస్తున్న ప్రియుడిపై ఓ వ్యక్తి శనివారం రాత్రి కత్తితో దాడిచేశాడు. బాధితులు నెల్లూరులోని సర్వజన ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరడంతో పొదలకూరు పోలీసులకు ఆదివారం సమాచారం అందింది. ఎస్సై అల్లూరు జగత్‌సింగ్ కథనం మేరకు వివరాలు.. మండలంలోని మర్రిపల్లిలో జి.కృష్ణవేణి నాలుగు నెలలుగా భర్త రమేష్ నుంచి వేరుపడి పైడినాయుడు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది.
రమేష్ మండలంలోని మొగళ్లూరు నిమ్మతోటలో కాపలాదారుడిగా ఉంటున్నాడు. కృష్ణవేణి మరొకరితో సహజీవనం సాగించడాన్ని జీర్ణించుకోలేకపోయిన రమేష్ శనివారం రాత్రి సమయంలో కత్తి తీసుకుని వెళ్లి భార్య, ఆమె ప్రియుడిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో పైడినాయుడు మెడపై, కృష్ణవేణి చేతిపై తీవ్రగాయాలయ్యాయి. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఎస్సై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.