కత్తితో భార్యపై దాడి
Published Sat, Dec 17 2016 9:03 PM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM
కర్లపాలెం: మద్యానికి బానిసైన భర్త అనుమానంతో భార్యపై కత్తితో దాడిచేసి గాయపరిచిన సంఘటన శుక్రవారం సాయంత్రం పేరలి గ్రామంలో చోటు చేసుకుంది. కర్లపాలెం ఎస్‌ఐ వెంకటరావు తెలిపిన వివరాల ప్రకారం... పేరలి గ్రామానికి చెందిన ఏసుదయానందరావు లారీ డ్రైవర్‌గా పనిచేస్తాడు. ఇతనికి అదే గ్రామానికి చెందిన జోగి రజనితో పదేళ్ళక్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అక్రమ సంబంధానికి, మద్యానికి బానిసైన ఏసుదయానందం భార్యను అనుమానించి తరచూ గొడవపడుతుండేవాడు. భర్త హింసలు భరించలేని రజని గత కొంతకాలంగా భర్తకు దూరంగా వేరే ఇంట్లో నివసిస్తోంది. ఈనేపథ్యంలో రజని శుక్రవారం తన బావ కుమారుడు మహేంద్రతో కలసి తన పొలంలో వరికోత కోస్తుండగా ఏసుదయానందరావు ఆవేశంగా పొలం వద్దకు వచ్చి నాకు తెలియకుండా కోత కోస్తావా అంటూ ఆమెపై కత్తితో దాడి చేశాడు. పక్కనే ఉన్న మహేంద్ర అడ్డుకున్నాడు. ఈ ఘటనలో రజనికి తీవ్రగాయాలవటంతో బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవలందించేందుకు గుంటూరు తరలించినట్లు ఎస్‌ఐ వివరించారు. నిందితుడు ఏసుదయానందరావును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.
Advertisement
Advertisement