పసికందును స్వాధీనం చేసుకున్న ఐసీడీఎస్, పోలీసు అధికారులు
బుక్కరాయసముద్రం: ప్రసవించిన గంటల వ్యవధిలోనే శిశువును మరొకరికి అప్పగించి వెళ్లిపోయిన తల్లి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. బుక్కరాయసముద్రం మండలం పి.కొత్తపల్లికి చెందిన ప్రతాప్, రాజేశ్వరి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ప్రస్తుతం రాజేశ్వరి గర్భిణి. రోడ్డుప్రమాదంలో చెయ్యి విరగడంతో ప్రతాప్ అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వారం రోజులపాటు చికిత్స చేయించుకున్నాడు. మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు.
ఇదే ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డను ప్రసవించిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ప్రతాప్ చేతిలో పెట్టి వెళ్లిపోయినట్లు సమాచారం. ప్రతాప్ ఆ శిశువును ఇంటికి తెచ్చుకున్నాడు. గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్త గోవిందమ్మ విషయం తెలుసుకుని ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సీడీపీఓ వనజా అక్కమ్మ, సూపర్ వైజర్ వాణిశ్రీ, చైల్డ్‌లైన్ ప్రతినిధులు సురేష్, ఆదినారాయణలు గురువారం పి.కొత్తపల్లికి చేరుకుని ప్రతాప్, రాజేశ్వరి దంపతుల వద్ద ఉన్న శిశువును స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం శిశువును వైద్య పరీక్షల నిమిత్తం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment