
డాక్టర్లకు మినిస్టర్ వార్నింగ్
మీ అందరి చిట్టా మావద్దుంది
నర్సింగ్ హోంలే కావాలనుకుంటే వెళ్లిపోండి
సర్వజనాస్పత్రి వైద్యులను హెచ్చరించిన మంత్రి కామినేని
అనంతపురం మెడికల్ : ‘సర్వజనాస్పత్రికి ఏ డాక్టర్ ఎప్పుడొస్తున్నారు.. ఎవరు బయట ప్రైవేట్ నర్సింగ్ హోం లకే పరిమితమవుతున్నారనేది అంతా తెలుసు.. మీ అందరి చిట్టా మా వద్ద ఉంది.. నర్సింగ్ హోంలే కావాలనుకుంటే రాజీనామా చేసి వెళ్లిపోండి’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వైద్యులను హెచ్చరించారు. సోమవారం రాత్రి అనంతపురం జిల్లాలోని సర్వజనాస్పత్రిలో ‘ఆస్పత్రి నిద్ర’ చేసిన ఆయన మంగళవారం ఉదయం అన్ని విభాగాల హెచ్‌ఓడీలతో సూపరింటెండెంట్ చాంబర్‌లో సమావేశమయ్యారు. నిరుపేదలే ప్రభుత్వ ఆస్పత్రికి వస్తారు.. వ్యాపార దృక్పథం మానుకొని సేవలందించాలని సూచించారు. విధుల పట్ల అంకితభావం ఉన్న వాళ్లకు పట్టం కడతామని అన్నారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ వైద్యరంగంలో మార్పుల కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అందరూ చిత్తశుద్ధితో పని చేయాలన్నారు.
వైద్యుడిపై సస్పెన్షన్‌కు ఆదేశం : కదిరి ఏరియా ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ త్రిలోక్‌నాథ్‌పై సస్పెన్షన్‌కు మంత్రి ఆదేశించారు. ఆయన ప్రభుత్వాస్పత్రిలో పని చేస్తూ ప్రైవేట్ నర్సింగ్ హోంలో కూడా సర్జరీలు చేస్తున్నారని, ఈ క్రమంలో ఇటీవల ఒకరు మృతి చెందినట్లు స్థానిక ఎమ్మెల్యేతో పాటు కొందరు నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సస్పెన్షన్‌కు ఆదేశించారు.
జూన్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన
అనంతపురంలో రూ.150 కోట్లతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి జూన్‌లో శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఆస్పత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్ల అందిస్తుందన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, ఏరియా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, వైద్యాధికారులు, మెడాల్, పిరమిల్ సర్వీస్ ప్రొవైడర్ల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో గర్భిణులకు ఉచితంగా అల్ట్రాసౌండ్ పరీక్షలు అందిస్తామన్నారు. ఆస్పత్రికి వచ్చిన కేసును మరో ఆస్పత్రికి రెఫర్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్యులు కష్టపడి పని చేయాలని మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు.