కేజీహెచ్ రాజేంద్రప్రసాద్ వార్డు వద్ద బాధిత కుటుంబాల సభ్యులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ శివారు స్వతంత్రనగర్ ఎస్టీ కాలనీలో సారాగా భావించి రసాయనాన్ని సేవించి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఘటనలో ఆదివారం ముగ్గురు మృతిచెందగా.. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న మరో 12 మందిలో సోమవారం మరో నలుగురు మృతి చెందారు. వీరిలో ఎ. చిన్నారావు (50), బి. అంకమ్మ (45), ఎ.రమణమ్మ (57), ఎ.రమణమ్మ (59) ఉన్నారు. కాగా, రసాయన మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. ప్రస్తుతం కేజీహెచ్‌లో 9 మంది చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి సైతం రోజురోజుకూ క్షీణిస్తుండడంతో నెఫ్రాలజీ వార్డుకు ఇద్దరిని, ఎమర్జెన్సీ మెడికల్ విభాగానికి ఇద్దరిని తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. వీరు సేవించిన రసాయనం శరీరంలో అన్ని భాగాలకు విస్తరించడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకునే ప్రమాదం ఉందని వైద్యులు గుర్తించారు. దీంతో వీరందరికీ ఐసీయూలో ఉంచి డయాలసిస్ చేస్తున్నారు. అవసరమైన వారికి వెంటిలేటర్‌పై వైద్యం అందిస్తున్నారు. వీరిలో ఆసనాల ఎర్రోడు (45) ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ బాధితులకు 24 గంటలూ ప్రత్యేక వైద్యం అందించడానికి డాక్టర్ జి.ప్రసాద్, డాక్టర్ ఎ.సత్యనారాయణ, డాక్టర్ జి.బుచ్చిరాజు, డాక్టర్ కె.ఇందిరాదేవితో కూడిన వైద్య నిపుణుల కమిటీని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున నియమించారు.
ఐఐసీటీకి రసాయనం..
ఎక్సైజ్ అధికారులు తమ ల్యాబ్‌లో నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో బాధితులు సేవించిన రసాయనం మిథనాల్ (మిథైల్ ఆల్కహాల్)గా తేల్చారు. ఇది ప్రాణాంతకమైనదేనని కేజీహెచ్ వైద్యులు తెలిపారు. మరోవైపు మిథనాల్ వంటి రసాయనం సేవించిన వారిలో కొందరికి భవిష్యత్తులో శాశ్వత అంధత్వం కూడా రావచ్చని వైద్యులు చెప్పారు. కాగా, మరింతగా లోతైన పరీక్షల కోసం, దీనిలో ఇంకేమి రసాయనాలు కలిశాయో తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి ఎక్సైజ్ అధికారులు సోమవారం రాత్రి పంపించారు. ఒకట్రెండు రోజుల్లో దీని నివేదిక రావచ్చని భావిస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా తమ దర్యాప్తులో భాగంగా ఈ రసాయనాన్ని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపుతున్నట్టు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ పి.హరికుమార్ ‘సాక్షి’తో చెప్పారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ హరికుమార్, జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్‌నాయుడు పరామర్శించారు.
కనికరం లేని కలెక్టర్..
రసాయనం తాగి మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం ఇప్పించాలంటూ బాధిత కుటుంబీకులు సోమవారం ఉదయం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేశారు. మృతుని కుటుంబానికి రూ.20 లక్షల పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కె.భాస్కర్‌ను కలిసేందుకు వెళ్లారు. అరగంటకు పైగా వారిని బయటే కూర్చోబెట్టారు. కలెక్టర్ 11 గంటలకు వారి వద్దకు వచ్చి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని తానేమీ చేయలేనని చేతులెత్తేశారు. కనీసం తమ గోడు వినకుండా, పరిహారంపై స్పందించకపోవడం దారుణమంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment