Dr Bharati Is An Inspiration To Many - Sakshi
Sakshi News home page

ఈమె డాక్టర్‌ భారతి ఎందరికో స్ఫూర్తి

Published Wed, Jul 19 2023 12:55 AM

Dr Bharati is an inspiration to many - Sakshi

సాకే భారతి రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చేతుల మీదుగా అనంతపురం ఎస్‌.కె.యూనివర్సిటీలో రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా తీసుకుంది. ఆమె పుట్టి పెరిగిన సామాజిక వర్గం (ఎరుకల)లో, ఆమె నివసిస్తున్న శింగనమల మండలం నాగుల గుడ్డం గ్రామంలో ఆమె సాధించింది ఎంత పెద్ద ఘనకార్యమో చాలామందికి తెలియదు.అసలు సాకే భారతి చదువుకుంటూ ఉంటేనే ‘చదువెందుకు’ అని చాలామంది స్త్రీలు ఆశ్చర్యపోయేవారు. ‘మేము ఏం చదివామని సుబ్రంగా కాపురాలు చేస్తున్నాం’ అని కూడా అనేవారు. కాని చదువు తెచ్చే వెలుతురు భారతికి బాగా తెలుసు.ఈ మెట్టు తర్వాత తనకు ప్రోఫెసర్‌గానో అసిస్టెంట్‌ప్రోఫెసర్‌గానో ఉద్యోగం వస్తే మారబోయే తన జీవితమూ తెలుసు. తనను చూసైనా తన వర్గంలో తనలాంటి సామాజిక వర్గాల్లో స్ఫూర్తి రావాలని ఆమె కోరిక.

ముగ్గురు ఆడపిల్లలు
తల్లిదండ్రులకు పుట్టిన ముగ్గురు ఆడపిల్లల్లో సాకే భారతి రెండో సంతానం. తండ్రికి చదువు లేదు. పైగా ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారని, అబ్బాయి పుట్టలేదని భార్యను ఇబ్బంది పెట్టేవాడు. తను కూడా చాలా అస్థిమితంగా ఉండేవాడు.ఇంట్లో వాతావరణం ఏమీ బాగుండేది కాదు. అప్పుడు భారతి తాత భారతితో అన్నమాట ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది– అమ్మా... నా కూతుర్ని మీ నాన్నకు ఇస్తే ఇలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆడపిల్లకు ఏం తక్కువ? బాగా చదువుకుంటే ఎన్నో గొప్ప పనులు చేయవచ్చు.నువ్వు బాగా చదువుకుని మీ నాన్న కళ్లు తెరిపియ్యాలి’ అన్నాడు. ఆ రోజు నుంచి భారతి గట్టిగా చదువుకోవాలనుకుంది. ఇవాళ్టికీ చదువుకుంటూనే ఉంది.

ఎన్నో కష్టాలు
భారతి మూడోక్లాసుకు వచ్చేసరికి చిన్న చెల్లెలు పుట్టింది. తల్లిదండ్రులు ఇద్దరూ కూలికి వెళ్లాలి. అక్క బడికెళ్లాలి. చెల్లెల్ని ఎవరు చూసుకోవాలి? రెండేళ్లు బడి మానేసి ఇంట్లో చెల్లెల్ని చూసుకుంటూ ఉండిపోయింది భారతి. ఆ తర్వాత పదోక్లాస్‌లో పెళ్లి చేశారు. అప్పుడు కూడా ఒక సంవత్సరం చదువు సాగలేదు.పెళ్లయ్యాక నివాసానికి ఇల్లు లేకపోవడంతో రేకుల షెడ్డు వేసుకుని అందులోనే ఉన్నారు. అక్కడే ఒకరోజు కాలేజీకి వెళుతూ ఒకరోజు కూలి పనికి వెళుతూ చదువుకుంది భారతి. ఇంటర్‌ (ఎం.పి.సి.)లో రోజు కూలి పాతిక రూపాయలు, డిగ్రీ (బిఎస్సీ)లో రోజు కూలి యాభై రూపాయలు వచ్చేది.  ఈ లోపు కూతురు పుట్టింది. పాటలంటే చాలా ఇష్టమున్న భారతి తన కూతురికి ‘గాయని’ అని పేరు పెట్టింది.

పెళ్లి, సంసారం వల్ల  చదువు మీద శ్రద్ధ ఉండటం లేదని భారతి బాధ పడుతుంటే భర్త ఏరికుల శివప్రసాద్‌ ఇంటర్‌ చదువు కొనసాగేలా ప్రోత్సహించాడు. పామిడిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్, అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్‌ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ, అనంతపురంలోనే ఎమ్మెస్సీ పూర్తి చేసింది. గ్రామం నుంచి కళాశాలకు పోవడానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో రోజూ ఎనిమిది కిలోమీటర్లు గార్లదిన్నెకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ నుంచి ఆర్టీసీ బస్సులో అనంతపురం వెళ్లి చదువుకుంది. డిగ్రీలో భారతి ఫస్ట్‌ క్లాస్‌ తెచ్చుకుంది. ఆ తర్వాత ఎమ్మెస్సీ పూర్తి చేసింది.

ఇల్లు లేదు.. ఉద్యోగం లేదు
భారతి నివసిస్తున్న ఇల్లు అసంపూర్ణ స్థితిలో ఉంది. గతంలో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్‌ అయితే డబ్బులేక నిర్మాణం సగంలోనే ఆపేయాల్సి వచ్చింది.ప్రోఫెసర్‌ కావాలన్నదే భారతి కోరిక. ప్రోఫెసర్‌ ఉద్యోగం వస్తే నేను నేర్చుకున్న జ్ఞానాన్ని మరి కొంతమంది విద్యార్థులకు పంచి చదువులో రాణించే విధంగా కృషి చేస్తాను’ అంది భారతి.  పీహెచ్‌డీ పట్టా వచ్చాక దానిని ఇంట్లో పెట్టి కూలి పనికి వెళుతోంది భారతి. టొమాటో చేనులో, బెండకాయ చేనులో పని చేస్తోంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు పని చేస్తే 150 రూపాయలు వస్తున్నాయి.
–  రుషింగప్పగారి మునెప్ప, శింగనమల, సాక్షి

చేతిలో పలుగూ పార నెత్తిన పచ్చగడ్డి నుదుటిన ఎప్పుడూ దొర్లే చెమట కాని గుండెల నిండా చదువు పూర్తి చేయాలన్నసంకల్పం.మహా మహా సౌకర్యాలు ఉండి కూడా పీహెచ్‌డీ కల నెరవేర్చుకోలేని వారు చకితమయ్యేలా ఏ సౌకర్యాలూ లేని వాళ్లు కొండంత స్ఫూర్తి పొందేలా వ్యవసాయ కూలీ భారతి మొన్న (సోమవారం)  పీహెచ్‌డీ పట్టా అందుకుంది. అనంతపురంలో ఈ అద్భుతం జరిగింది.

2016లో పీహెచ్‌డీ సీటు
2016లో సాకే భారతి ఎస్‌.కె. యూనివర్శిటీలోప్రోఫెసర్‌ ఎం.సి.ఎస్‌ శోభ దగ్గర ఆర్గానిక్‌ కెమెస్ట్రీలో పిహెచ్‌.డి ప్రవేశం ΄పొందింది. పిహెచ్‌.డిలో చేరడంతో ప్రభుత్వం నుంచి వచ్చే ఉపకార వేతనం భారతి చదువుకు సహాయపడింది. దీంతోపాటు కూలి పనులకు వెళ్తూ 2023 సంవత్సరానికి పట్టా పొందింది. స్లిప్పర్లతో, అతి సాదా బట్టలతో స్నాతకోత్సవంలో పట్టా అందుకోవడానికి భారతి స్టేజీ ఎక్కితే  ఆడిటోరియం అంతా చప్పట్లతో మార్మోగి పోయింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement