Ph.d degree
-
ఆటంకాలు అధిగమించి.. పీహెచ్డీ సాధించి..
గుంటూరు: తనకు చదువుల దాహం... సహకరించని ఆర్థిక పరిస్థితులు.. పెళ్లితో డిగ్రీ ఫస్టియర్‌లోనే చదువుకు బ్రేక్ పడింది. ఆటోడ్రైవర్ భర్త భరో సాతో చదువు ఆరంభించినా అదే సమస్యపై మళ్లీ అవాంతరం. అయినా నిరాశతో కుంగిపోలేదు. ఇద్దరి బిడ్డల ఆలనపాలనా చూస్తునే అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ, ఏదొక ఉద్యోగం చేస్తూ డిగ్రీ, పీజీనే కాదు.. ఏకంగా పీహెచ్డీ సాధించింది.అధ్యాపకురాలిగా పనిచేస్తూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మంగళవారం జరిగిన 40వ స్నాతకోత్సవంలో డాక్టరేట్‌ను స్వీకరించింది. ఆ మహిళ విజయప్రస్థానమిది... ఆ చదువుల తల్లి పేరు ఈపూరి షీల. తెనాలి రూరల్ మండల గ్రామం పెదరావూరు. చిన్నతనంలోనే తల్లి మరణించారు. గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదివింది. తెనాలిలో ఇంటర్ తర్వాత జేఎంజే మహిళా కాలేజీలో బీకాం మొదటి సంవత్సరం చదువుతుండగా, 2003లో ఆటోడ్రైవర్ రావూరి కరుణాకర్‌తో పెద్దలు వివాహం చేశారు. చదువుకుంటానని అడిగిన భార్య కోరికను మన్నించిన భర్త ప్రోత్సహించాడు. రెండేళ్లు చదివాక ఫైనలియర్లో మళ్లీ ఆర్థిక ఇబ్బందులు సహ కరించ లేదు. ఉపాధికోసం 2004లో అక్షరదీప్తి పథకంలో ప్రేరక్‌గా చేరారు. అయినా చదువు‘కొన’లేకపోయారు. 2008లో ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన కంప్యూటర్ శిక్షణలో చేరి, పీజీడీసీఏ చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే, డిగ్రీ అర్హత లేకపోవటంతో వెనుదిరగాల్సి వచ్చింది. అర్థం చేసుకున్న భర్త, పిల్లలతోపాటు భార్యనూ చదివించారు. ఫలితంగా 2009లో డిగ్రీ ఫైనలియర్ పూర్తిచేశారు షీల. తెనాలిలో గుప్తా కాలేజీలో కామర్స్‌లో పీజీ చేశారు. ఎయిడెడ్ కాలేజీలో లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేస్తే, పీహెచ్డీ తప్పనిసరిగా చెప్పటంతో పీజీ చేసిన కాలేజీలోనే అధ్యాపకురాలిగా పనిచేయసాగారు. 2014లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏఎన్‌యూఆర్‌సీటీ నోటిఫికేషన్ వచ్చింది. భర్త కరుణాకర్ ప్రోత్సాహంతో దరఖాస్తు చేసింది. యూనివర్సిటీలో డాక్టర్ ఎన్.రత్నకిషోర్ గైడ్‌గా ఫుల్‌టైం రీసెర్చ్ స్కాలర్‌గా చేరారు. కొన్నిరోజుల తర్వాత మళ్లీ ఆర్థిక సమస్యలతో ఆగిపోవాల్సి వచ్చింది. అదృష్టవశాత్తూ 2016లో రాజీవ్‌గాంధీ నేషనల్ ఫెలోషిప్‌కు ఎంపికవటం కలిసొచ్చింది. రోజూ యూనివర్సిటీకి వెళుతూ అక్కడి లైబ్రరీలో చదువుకుంటూ 2016 సెప్టెంబరులో ఏపీసెట్ అర్హత సాధించారు. దూరవిద్యలో మాస్టర్ డిగ్రీ ఎంహెచ్ఆర్ఎంను 2017లో పూర్తిశారు. అదే ఏడాది ఎంఫిల్ నుంచి పీహెచ్‌డీకి కన్వర్షన్ జరిగిందని షీల చెప్పారు. గతేడాది ఆఖరులో ‘సర్వీస్ క్వాలిటీ ఇన్ హెల్త్‌కేర్ సెక్టార్’ అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. ఆ థీసిస్‌కు గత జులై 4న పీహెచ్డీ లభించింది. యూనివర్సిటీ 40వ స్నాతకోత్సవంలో మంగళవారం డాక్టరేట్‌ను అందుకోనున్నారు. ప్రస్తుతం షీల స్థానిక వీఎస్సార్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో కామర్స్ అధ్యాపకురాలిగా చేస్తున్నారు. ఆగిపోయిన చదువు ఇక్కడిదాకా వస్తుందనీ, డాక్టరేటు సాధిస్తానని కలలో కూడా ఊహించలేదని అన్నారు. భవిష్యత్‌లో మరింత ఉన్నతస్థాయికి వెళ్లాలన్నదే తన ఆశయంగా వివరించారు. సందర్భంగా... ‘గమ్యం సాధించాలనుకునే వ్యక్తి అలుపెరగడు. విజయం సాధించాలనుకునే వ్యక్తి నిరాశ చెందడు’. అలాగే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం / ప్రతి నీడకు ఒక వెలుగు / ప్రతి బాధకు ఓ ఓదార్పు ఉంటుంది / కాకపోతే విశ్వాసం కోల్పోకుండా మనవంతు ప్రయత్నం చేయాలి’ అని పెద్దల మాట. ఈ మాటలు చక్కగా అన్వయమవుతాయి పెదరావూరుకు చెందిన ఈపూరి షీల విషయంలో. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మొక్కవోని దీక్షతో చదువును కొనసాగించింది. తట్టుకోలేని కష్టాలు తారసపడ్డా వాటిని ధైర్యంగా ఎదుర్కొని అనుకున్న పీహెచ్‌డీని సాధించింది. ‘పాండిత్యం ఉన్నవాడు శిఖరాన్ని చేరతాడు/వ్యక్తిత్వం ఉన్నవాడు శిఖరం మీద చిరస్థాయిగా నిలుస్తాడు’ అని చెప్పినట్లుగా ఆమె ప్రస్థానం అభినందనీయం. ఆమె చేరిన శిఖరం గురించి అందిస్తున్న కథనం. -
ఈమె డాక్టర్ భారతి ఎందరికో స్ఫూర్తి
సాకే భారతి రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అనంతపురం ఎస్.కె.యూనివర్సిటీలో రసాయన శాస్త్రంలో పీహెచ్డీ పట్టా తీసుకుంది. ఆమె పుట్టి పెరిగిన సామాజిక వర్గం (ఎరుకల)లో, ఆమె నివసిస్తున్న శింగనమల మండలం నాగుల గుడ్డం గ్రామంలో ఆమె సాధించింది ఎంత పెద్ద ఘనకార్యమో చాలామందికి తెలియదు.అసలు సాకే భారతి చదువుకుంటూ ఉంటేనే ‘చదువెందుకు’ అని చాలామంది స్త్రీలు ఆశ్చర్యపోయేవారు. ‘మేము ఏం చదివామని సుబ్రంగా కాపురాలు చేస్తున్నాం’ అని కూడా అనేవారు. కాని చదువు తెచ్చే వెలుతురు భారతికి బాగా తెలుసు.ఈ మెట్టు తర్వాత తనకు ప్రోఫెసర్గానో అసిస్టెంట్ప్రోఫెసర్గానో ఉద్యోగం వస్తే మారబోయే తన జీవితమూ తెలుసు. తనను చూసైనా తన వర్గంలో తనలాంటి సామాజిక వర్గాల్లో స్ఫూర్తి రావాలని ఆమె కోరిక. ముగ్గురు ఆడపిల్లలు తల్లిదండ్రులకు పుట్టిన ముగ్గురు ఆడపిల్లల్లో సాకే భారతి రెండో సంతానం. తండ్రికి చదువు లేదు. పైగా ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారని, అబ్బాయి పుట్టలేదని భార్యను ఇబ్బంది పెట్టేవాడు. తను కూడా చాలా అస్థిమితంగా ఉండేవాడు.ఇంట్లో వాతావరణం ఏమీ బాగుండేది కాదు. అప్పుడు భారతి తాత భారతితో అన్నమాట ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది– అమ్మా... నా కూతుర్ని మీ నాన్నకు ఇస్తే ఇలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆడపిల్లకు ఏం తక్కువ? బాగా చదువుకుంటే ఎన్నో గొప్ప పనులు చేయవచ్చు.నువ్వు బాగా చదువుకుని మీ నాన్న కళ్లు తెరిపియ్యాలి’ అన్నాడు. ఆ రోజు నుంచి భారతి గట్టిగా చదువుకోవాలనుకుంది. ఇవాళ్టికీ చదువుకుంటూనే ఉంది. ఎన్నో కష్టాలు భారతి మూడోక్లాసుకు వచ్చేసరికి చిన్న చెల్లెలు పుట్టింది. తల్లిదండ్రులు ఇద్దరూ కూలికి వెళ్లాలి. అక్క బడికెళ్లాలి. చెల్లెల్ని ఎవరు చూసుకోవాలి? రెండేళ్లు బడి మానేసి ఇంట్లో చెల్లెల్ని చూసుకుంటూ ఉండిపోయింది భారతి. ఆ తర్వాత పదోక్లాస్లో పెళ్లి చేశారు. అప్పుడు కూడా ఒక సంవత్సరం చదువు సాగలేదు.పెళ్లయ్యాక నివాసానికి ఇల్లు లేకపోవడంతో రేకుల షెడ్డు వేసుకుని అందులోనే ఉన్నారు. అక్కడే ఒకరోజు కాలేజీకి వెళుతూ ఒకరోజు కూలి పనికి వెళుతూ చదువుకుంది భారతి. ఇంటర్ (ఎం.పి.సి.)లో రోజు కూలి పాతిక రూపాయలు, డిగ్రీ (బిఎస్సీ)లో రోజు కూలి యాభై రూపాయలు వచ్చేది. ఈ లోపు కూతురు పుట్టింది. పాటలంటే చాలా ఇష్టమున్న భారతి తన కూతురికి ‘గాయని’ అని పేరు పెట్టింది. పెళ్లి, సంసారం వల్ల చదువు మీద శ్రద్ధ ఉండటం లేదని భారతి బాధ పడుతుంటే భర్త ఏరికుల శివప్రసాద్ ఇంటర్ చదువు కొనసాగేలా ప్రోత్సహించాడు. పామిడిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, అనంతపురం ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ, అనంతపురంలోనే ఎమ్మెస్సీ పూర్తి చేసింది. గ్రామం నుంచి కళాశాలకు పోవడానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో రోజూ ఎనిమిది కిలోమీటర్లు గార్లదిన్నెకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ నుంచి ఆర్టీసీ బస్సులో అనంతపురం వెళ్లి చదువుకుంది. డిగ్రీలో భారతి ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఇల్లు లేదు.. ఉద్యోగం లేదు భారతి నివసిస్తున్న ఇల్లు అసంపూర్ణ స్థితిలో ఉంది. గతంలో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయితే డబ్బులేక నిర్మాణం సగంలోనే ఆపేయాల్సి వచ్చింది.ప్రోఫెసర్ కావాలన్నదే భారతి కోరిక. ప్రోఫెసర్ ఉద్యోగం వస్తే నేను నేర్చుకున్న జ్ఞానాన్ని మరి కొంతమంది విద్యార్థులకు పంచి చదువులో రాణించే విధంగా కృషి చేస్తాను’ అంది భారతి. పీహెచ్డీ పట్టా వచ్చాక దానిని ఇంట్లో పెట్టి కూలి పనికి వెళుతోంది భారతి. టొమాటో చేనులో, బెండకాయ చేనులో పని చేస్తోంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు పని చేస్తే 150 రూపాయలు వస్తున్నాయి. – రుషింగప్పగారి మునెప్ప, శింగనమల, సాక్షి చేతిలో పలుగూ పార నెత్తిన పచ్చగడ్డి నుదుటిన ఎప్పుడూ దొర్లే చెమట కాని గుండెల నిండా చదువు పూర్తి చేయాలన్నసంకల్పం.మహా మహా సౌకర్యాలు ఉండి కూడా పీహెచ్డీ కల నెరవేర్చుకోలేని వారు చకితమయ్యేలా ఏ సౌకర్యాలూ లేని వాళ్లు కొండంత స్ఫూర్తి పొందేలా వ్యవసాయ కూలీ భారతి మొన్న (సోమవారం) పీహెచ్డీ పట్టా అందుకుంది. అనంతపురంలో ఈ అద్భుతం జరిగింది. 2016లో పీహెచ్డీ సీటు 2016లో సాకే భారతి ఎస్.కె. యూనివర్శిటీలోప్రోఫెసర్ ఎం.సి.ఎస్ శోభ దగ్గర ఆర్గానిక్ కెమెస్ట్రీలో పిహెచ్.డి ప్రవేశం ΄పొందింది. పిహెచ్.డిలో చేరడంతో ప్రభుత్వం నుంచి వచ్చే ఉపకార వేతనం భారతి చదువుకు సహాయపడింది. దీంతోపాటు కూలి పనులకు వెళ్తూ 2023 సంవత్సరానికి పట్టా పొందింది. స్లిప్పర్లతో, అతి సాదా బట్టలతో స్నాతకోత్సవంలో పట్టా అందుకోవడానికి భారతి స్టేజీ ఎక్కితే ఆడిటోరియం అంతా చప్పట్లతో మార్మోగి పోయింది. -
కట్ పేస్ట్ పీహెచ్డీలెందుకు?
► మహాత్మాగాంధీ వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ ► పరిశోధనల్లో నాణ్యత పెరిగినప్పుడే సమాజానికి ప్రయోజనం ► కళాశాలలు వ్యాపార దృక్పథంతో పనిచేయడం మంచిది కాదు ► విద్యార్థి దశలో సముపార్జించిన జ్ఞానాన్ని సమాజానికి పంచాలి సాక్షి, నల్లగొండ : విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పరిశోధనలపై రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘యూనివర్సిటీల్లో ఒక్కొక్కరు 25–30 పీహెచ్‌డీలు చేస్తున్నారు. ఒక్కో గైడ్ వందలాది మందితో పీహెచ్‌డీలు చేయిస్తున్నారు. ఇవన్నీ కట్ అండ్ పేస్ట్ పీహెచ్డీలే. గూగుల్, టాగుల్, ఇతర ఫన్నీ వెబ్సైట్లలో చూసి రాసుకుంటున్నారు. ఈ కట్ అండ్ పేస్ట్ పీహెచ్‌డీలతో సమాజానికి ఏం ఉపయోగం? విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధనల్లో నాణ్యత పెరిగినప్పుడే సమాజానికి ప్రయోజనం ఉంటుంది. పరిశోధనలు, ఆవిష్కరణలు సుస్థిర భారతదేశ నిర్మాణానికి దోహదపడాలి.’ అని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం నల్లగొండలో జరిగిన మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి చాన్సలర్ హోదాలో గవర్నర్ హాజరై గోల్డ్ మెడలిస్టులు, టాపర్స్‌కు మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ధనార్జన కోసమే విద్య అనే భావన నుంచి యువత బయటకు రావాలని, తాము సముపార్జించిన జ్ఞానాన్ని సమాజానికి పంచడం ద్వారా సమాజంలో విలువలు పెంచేందుకు ఉపయోగపడాలని పిలుపునిచ్చారు. కళాశాలలు ఎన్ని ఉన్నాయి, విద్యార్థులెంత మంది చదువుకుంటున్నారనేది ప్రధానం కాదని, విద్యలో ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయన్నదే ముఖ్యమని, ఈ అంశంపై విశ్వవిద్యాలయాలు ఎక్కువ దృష్టిసారించాలని ఆయన కోరారు. ‘కళాశాలలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నామనేది యాజమాన్యాలు ఆలోచించుకోవాలని, వ్యాపార దృక్పథంతో పనిచేయడాన్ని కళాశాలల యాజమాన్యాలు మానుకోవాలని హితవు పలికారు. కళాశాలలు ఇదే రీతిలో పనిచేస్తే ప్రభుత్వం నుంచి అందే ప్రోత్సాహకాలు రావని, వచ్చే ఏడాది నుంచి ఉగాది కానుకలేమీ ఉండవని అన్నారు. సమాజంలోని ›ప్రతి వ్యక్తి తనకు ఆహార, వైద్య, ఇంధన, గృహ, సాధారణ భద్రతల గురించి ఆలోచిస్తాడని, అవన్నీ అందించే విద్యను, విద్యార్థులను సమాజానికి అందించే కృషి విశ్వవిద్యాలయాల్లో జరగాలని అభిప్రాయపడ్డారు. విలువలతో కూడిన విద్యను అందించడంలో అధ్యాపకుల కృషి కీలకమైనదని పేర్కొన్నారు. ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి భారతీయుడిగా గర్వించాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఏది చేయాలన్నా విదేశీయులు చెపితేనే చేస్తున్నామని, యోగా, ప్రాణాయామం లాంటి కార్యక్రమాల్లో కూడా మనం విదేశాలను అనుసరిస్తున్నామని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. మన వేదాలు, ఉపనిషత్తుల్లో లేనిది ఏమీ లేదని, సమాజానికి అవసరమైన అన్ని బోధనలూ వాటిలోనే ఉన్నాయన్నారు. దేశ సాంస్కృతిక చరిత్ర గురించి కూడా భావితరాలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని ఆయన గుర్తు చేశారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఢిల్లీ జేఎన్‌యూ వైస్‌చాన్సలర్ మామిడాల జగదీశ్‌కుమార్ మాట్లాడుతూ పరిశోధనలు, ఆవిష్కరణల వల్లే సమాజానికి ప్రయోజనం ఉంటుందని, విశ్వవిద్యాలయాల్లో జరిగే కృషి కూడా ఆ దిశలో ఉండాలని కోరారు. దేశంలో 800 వర్సిటీలుంటే అందులో 60శాతం విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు ఆశించినంతగా లేవని, మొత్తం 40వేల కళాశాలల్లో 90శాతం కళాశాలల్లోనూ ఆదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ సంపదను సృష్టించడంలో, గ్రామీణ విద్యార్థులను ఇముడ్చుకోవడంలో వర్సిటీలు విఫలమవుతున్నాయన్నారు. విశ్వవిద్యాలయాలు తమ పనితీరును కనీసం సమీక్షించుకోవడం లేదని, సామాజిక విలువలను పెంపొందించే విద్యను అందించాలన్న దృక్ఫథం కొరవడిందని అన్నారు. విశ్వవిద్యాలయాలకు నిధులివ్వడం లేదని, గ్లోబల్ యూనివర్శిటీలతో పోలిస్తే మన విశ్వవిద్యాలయాల్లోని పరిశోధనాలయాల్లో కనీస సౌకర్యాలు ఉండడం లేదని, అయినా ఉన్న దాంట్లోనే మంచి ఫలితాలు రాబట్టే కృషి విశ్వవిద్యాలయాల్లో జరగాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ వైస్ చాన్సలర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా, ఎమ్మెల్యేలు భాస్కరరావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉమేశ్‌కుమార్, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, గవర్నర్ పర్యటన సందర్భంగా వర్సిటీలో సౌకర్యాల కొరతపై కొందరు విద్యార్థులు యూనివర్సిటీ మెయిన్‌గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అంతకుముందే పోలీసులు ఎనిమిది మంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఉదయం కొంత ఉద్రిక్తత నెలకొని గవర్నర్ పర్యటన ప్రశాంతంగా ముగియడంతో అటు పోలీసులు, ఇటు యూనివర్సిటీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.