కట్ పేస్ట్ పీహెచ్‌డీలెందుకు?
► మహాత్మాగాంధీ వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్
► పరిశోధనల్లో నాణ్యత పెరిగినప్పుడే సమాజానికి ప్రయోజనం
► కళాశాలలు వ్యాపార దృక్పథంతో పనిచేయడం మంచిది కాదు
► విద్యార్థి దశలో సముపార్జించిన జ్ఞానాన్ని సమాజానికి పంచాలి
సాక్షి, నల్లగొండ : విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పరిశోధనలపై రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్.నరసింహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘యూనివర్సిటీల్లో ఒక్కొక్కరు 25–30 పీహెచ్‌డీలు చేస్తున్నారు. ఒక్కో గైడ్ వందలాది మందితో పీహెచ్‌డీలు చేయిస్తున్నారు. ఇవన్నీ కట్ అండ్ పేస్ట్ పీహెచ్‌డీలే. గూగుల్, టాగుల్, ఇతర ఫన్నీ వెబ్‌సైట్లలో చూసి రాసుకుంటున్నారు. ఈ కట్ అండ్ పేస్ట్ పీహెచ్‌డీలతో సమాజానికి ఏం ఉపయోగం? విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధనల్లో నాణ్యత పెరిగినప్పుడే సమాజానికి ప్రయోజనం ఉంటుంది. పరిశోధనలు, ఆవిష్కరణలు సుస్థిర భారతదేశ నిర్మాణానికి దోహదపడాలి.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
శుక్రవారం నల్లగొండలో జరిగిన మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి చాన్సలర్ హోదాలో గవర్నర్ హాజరై గోల్డ్ మెడలిస్టులు, టాపర్స్‌కు మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ధనార్జన కోసమే విద్య అనే భావన నుంచి యువత బయటకు రావాలని, తాము సముపార్జించిన జ్ఞానాన్ని సమాజానికి పంచడం ద్వారా సమాజంలో విలువలు పెంచేందుకు ఉపయోగపడాలని పిలుపునిచ్చారు. కళాశాలలు ఎన్ని ఉన్నాయి, విద్యార్థులెంత మంది చదువుకుంటున్నారనేది ప్రధానం కాదని, విద్యలో ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయన్నదే ముఖ్యమని, ఈ అంశంపై విశ్వవిద్యాలయాలు ఎక్కువ దృష్టిసారించాలని ఆయన కోరారు. ‘కళాశాలలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నామనేది యాజమాన్యాలు ఆలోచించుకోవాలని, వ్యాపార దృక్పథంతో పనిచేయడాన్ని కళాశాలల యాజమాన్యాలు మానుకోవాలని హితవు పలికారు. కళాశాలలు ఇదే రీతిలో పనిచేస్తే ప్రభుత్వం నుంచి అందే ప్రోత్సాహకాలు రావని, వచ్చే ఏడాది నుంచి ఉగాది కానుకలేమీ ఉండవని అన్నారు.
సమాజంలోని ›ప్రతి వ్యక్తి తనకు ఆహార, వైద్య, ఇంధన, గృహ, సాధారణ భద్రతల గురించి ఆలోచిస్తాడని, అవన్నీ అందించే విద్యను, విద్యార్థులను సమాజానికి అందించే కృషి విశ్వవిద్యాలయాల్లో జరగాలని అభిప్రాయపడ్డారు. విలువలతో కూడిన విద్యను అందించడంలో అధ్యాపకుల కృషి కీలకమైనదని పేర్కొన్నారు. ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి భారతీయుడిగా గర్వించాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఏది చేయాలన్నా విదేశీయులు చెపితేనే చేస్తున్నామని, యోగా, ప్రాణాయామం లాంటి కార్యక్రమాల్లో కూడా మనం విదేశాలను అనుసరిస్తున్నామని, ఇది మంచి పద్ధతి కాదన్నారు.
మన వేదాలు, ఉపనిషత్తుల్లో లేనిది ఏమీ లేదని, సమాజానికి అవసరమైన అన్ని బోధనలూ వాటిలోనే ఉన్నాయన్నారు. దేశ సాంస్కృతిక చరిత్ర గురించి కూడా భావితరాలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని ఆయన గుర్తు చేశారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఢిల్లీ జేఎన్‌యూ వైస్‌చాన్సలర్ మామిడాల జగదీశ్‌కుమార్ మాట్లాడుతూ పరిశోధనలు, ఆవిష్కరణల వల్లే సమాజానికి ప్రయోజనం ఉంటుందని, విశ్వవిద్యాలయాల్లో జరిగే కృషి కూడా ఆ దిశలో ఉండాలని కోరారు. దేశంలో 800 వర్సిటీలుంటే అందులో 60శాతం విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు ఆశించినంతగా లేవని, మొత్తం 40వేల కళాశాలల్లో 90శాతం కళాశాలల్లోనూ ఆదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ సంపదను సృష్టించడంలో, గ్రామీణ విద్యార్థులను ఇముడ్చుకోవడంలో వర్సిటీలు విఫలమవుతున్నాయన్నారు.
విశ్వవిద్యాలయాలు తమ పనితీరును కనీసం సమీక్షించుకోవడం లేదని, సామాజిక విలువలను పెంపొందించే విద్యను అందించాలన్న దృక్ఫథం కొరవడిందని అన్నారు. విశ్వవిద్యాలయాలకు నిధులివ్వడం లేదని, గ్లోబల్ యూనివర్శిటీలతో పోలిస్తే మన విశ్వవిద్యాలయాల్లోని పరిశోధనాలయాల్లో కనీస సౌకర్యాలు ఉండడం లేదని, అయినా ఉన్న దాంట్లోనే మంచి ఫలితాలు రాబట్టే కృషి విశ్వవిద్యాలయాల్లో జరగాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ వైస్ చాన్సలర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా, ఎమ్మెల్యేలు భాస్కరరావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉమేశ్‌కుమార్, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, గవర్నర్ పర్యటన సందర్భంగా వర్సిటీలో సౌకర్యాల కొరతపై కొందరు విద్యార్థులు యూనివర్సిటీ మెయిన్‌గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అంతకుముందే పోలీసులు ఎనిమిది మంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఉదయం కొంత ఉద్రిక్తత నెలకొని గవర్నర్ పర్యటన ప్రశాంతంగా ముగియడంతో అటు పోలీసులు, ఇటు యూనివర్సిటీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.