ప్రపంచం మెచ్చిన సైంటిస్ట్‌.. రూ.66 కోట్లు గెలుచుకుంది! | Intresting Things To Know About Quantum Researcher Urbasi Sinha | Sakshi
Sakshi News home page

Urbasi Sinha: ప్రపంచం మెచ్చిన సైంటిస్ట్‌.. రూ.66 కోట్లు గెలుచుకుంది!

Published Sat, Nov 25 2023 11:07 AM | Last Updated on Sun, Nov 26 2023 7:45 AM

Intresting Things To Know About Quantum Researcher Urbasi Sinha - Sakshi

‘క్వాంటమ్‌’ అనే మాటకు ప్రతిధ్వనిగా ‘అంతులేని వేగం’ ‘అపారమైన శక్తి’ అనే శబ్దాలు వినిపిస్తాయి. దేశ పురోగతిని మార్చే శక్తి క్వాంటమ్‌ సాంకేతికతకు ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశంతో సహా ప్రపంచంలోని ఎన్నో దేశాలు క్వాంటమ్‌ సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. శాస్త్రవేత్తల విషయానికి వస్తే..ప్రొఫెఫెసర్‌ ఊర్వశీ సిన్హా క్వాంటమ్‌ కంప్యూటింగ్, క్వాంటమ్‌ కమ్యూనికేషన్, క్వాంటమ్‌ ఫండమెంటల్స్‌ అండ్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ ప్రాసెసింగ్‌లాంటి కట్టింగ్‌–ఎడ్జ్‌ టెక్నాలజీలో అందె వేసిన చేయిగా పేరు తెచ్చుకుంది.

బెంగళూరులోని రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఆర్‌ఆర్‌ఐ)లోని క్వాంటమ్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ అండ్‌ కంప్యూటింగ్‌ ల్యాబ్‌లో ఊర్వశీ సిన్హా  పనిచేస్తుంది. ఈమె పరిశోధనలకు గాను తాజాగా కెనడా ఎక్స్‌లెన్స్‌ రిసెర్చ్‌ చైర్‌ (సీయిఆర్‌సీ) ప్రోగ్రామ్‌కి ఎంపికైన తొలి ఇండియన్‌గా తన ప్రత్యేకత చాటుకుంది. పరిశోధకులను ప్రోత్సహించడానికి  2008లో సీయిఆర్‌సీ ఏర్పాటైంది. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా 8 సంవత్సరాలకు గాను సిన్హా 8 మిలియన్‌ డాలర్‌లు అంటే సుమారుగా 66 కోట్ల 69 లక్షల రూపాయలను గెలుచుకుంది.

సంప్రదాయ కంప్యూటర్‌ సంవత్సరాల్లో చేసే పనిని క్వాంటమ్‌ కంప్యూటర్‌ నిమిషాల వ్యవధిలో పూర్తి చేస్తుంది. సూపర్‌ కంప్యూటర్‌ కంటే క్వాంటమ్‌ కంప్యూటర్‌ ఎన్నోరెట్లు వేగంగా పనిచేస్తుంది. గూగుల్, ఐబీఎం... మొదలైన సాంకేతిక దిగ్గజాలు ప్రత్యేకంగా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సిస్టమ్‌లను ఏర్పాటు చేసుకున్నాయి. ‘క్వాంటమ్‌ టెక్నాలజీ’ అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌. మన దేశం విషయానికి వస్తే క్వాంటమ్‌ టెక్నాలజీ అనగానే గుర్తు వచ్చే పేరు ఊర్వశీ సిన్హా. లండన్‌లో పుట్టి పెరిగింది సిన్హా. యూనివర్శిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌లో చదువుకుంది. సూపర్‌కండక్టింగ్‌ డివైజ్‌లపై పరిశోధనలు చేసింది. పోస్ట్‌ డాక్టోరల్‌ రిసెర్చ్‌ కోసం కెనడాలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌(ఐక్యూసీ)కు వెళ్లింది. క్వాంటమ్‌ ఆప్టిక్స్‌లో పరిశోధనలకు ఇంటర్నేషనల్‌ కమీషన్‌ ఫర్‌ ఆప్టిక్స్‌(ఐసీవో) నుంచి అవార్డ్‌ అందుకుంది.

చిన్నప్పుడు కాల్పనిక కథల కంటే శాస్త్రీయ విషయాలు, గణితంపై ఎక్కువగా ఆసక్తి ప్రదర్శించేది. ఒకవిధంగా చెప్పాలంటే సైంటిస్ట్‌ కావాలని చిన్నప్పుడే డిసైడై పోయింది. తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించేవారు.క్వాంటమ్‌ ఫిజిక్స్‌పై సిన్హాకు ప్రత్యేక ఆసక్తి. బ్యాచులర్స్, మాస్టర్స్‌ డిగ్రీ చేస్తున్నప్పుడు ఫండమెంటల్‌ సబ్జెక్ట్‌గా క్వాంటమ్‌ ఫిజిక్స్‌ను బోధించేవారు. అలా మొదలైన ఆసక్తి అంతకంతకూ పెరుగుతూ పోయింది. ‘నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది’ అనుకునేది సిన్హా.‘క్వాంటమ్‌ ఫిజిక్స్‌పై ఆసక్తి అధికమవుతున్న కాలంలో బంగారంలాంటి అవకాశం వచ్చింది. పోస్ట్‌ డాక్టోరల్‌ రిసెర్చ్‌లో భాగంగా క్వాంటమ్‌ ఆప్టిక్స్‌కు చేరువ కావడం నా కెరీర్‌కు ఎంతో మేలు చేసింది. నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఆసక్తిని, ఉత్సాహాన్ని పెంచింది. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు’ అంటుంది సిన్హా..

బెంగళూరులోని రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని ‘క్వాంటమ్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ అండ్‌ కంప్యూటింగ్‌ ల్యాబ్‌’ క్వాంటమ్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ ప్రాసెసింగ్‌ కోసం మన దేశంలో ఏర్పాటు చేసిన తొలి ల్యాబ్‌. ఈ ల్యాబ్‌లో క్వాంటమ్‌ కంప్యూటింగ్, క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌కు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేసింది సిన్హా.‘మన దేశంలో శాస్త్రీయరంగం పురోగతిని నా కాలేజీ రోజుల నుంచి చూస్తున్నాను. ఉన్నత స్థాయి పరిశోధనలకు ఇప్పుడు తగినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయి. విదేశీ కంపెనీల నుంచి రకరకాల పరికరాలు ఆలస్యంగా అందుతున్నాయనే ఫిర్యాదు ఇప్పుడు వినిపించడం లేదు. స్థూలంగా చెప్పాలంటే శాస్త్రీయ పరిశోధనకు ఇప్పుడు నిధులు అనేవి ప్రధాన సమస్య కాదు. మన సమాజం శాస్త్రీయ సమాజంగా ఎదగాలంటే సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి కనిపించాలి. అందుకు మౌలిక సూత్రాలపై అవగాహన పెంచుకోవాలి’ అంటుంది సిన్హా.బాల్యం నుంచి శాస్త్రీయపథంలో పయనిస్తున్న ఊర్వశీ సిన్హా  34 మంది ప్రముఖ గ్లోబల్‌ సైంటిస్ట్‌లలో ఒకరిగా నిలిచింది.

గొప్ప అవకాశం
సైన్స్‌ అనే దానికి సరిహద్దులు లేవు. అది ప్రపంచ భాష. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒకరికొకరు సహకరించుకుంటూ వెళ్లడం ద్వారానే సైన్స్‌ను ముందుకు తీసుకువెళ్లగలం. సైన్స్‌ పురోగతికి నా వంతు కృషి చేస్తాను... అనే మాటలను సీయిఆర్‌సీ ఇచ్చిన అవకాశం ద్వారా ఆచరణరూపం కల్పించే అవకాశం దొరికింది. ఇండియా, కెనడాలలో సమాంతరంగా క్వాంటమ్‌ ఎకోసిస్టమ్‌ అభివృద్ధిపై కృషి చేయడానికి ఇదొక గొప్ప అవకాశం.
– ఊర్వశీ సిన్హా, సైంటిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement