నానో ఫ్యాక్టరీ వద్దేవద్దు
నంద్యాల: పాణ్యం మండలం కొండజూటూరు పరిసరాల్లో తలపెట్టిన శాంతిరాం నానో కెమికల్ ఫ్యాక్టరీ వద్దేవద్దని కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల సిద్ధారెడ్డి అన్నారు. గ్రామస్తుల ఆందోళనకు మద్దతుగా కిసాన్ సంఘ్, నంది రైతు సమాఖ్య, రైతు సంఘాల సమాఖ్య గురువారం సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా సిద్ధారెడ్డి మాట్లాడుతూ పండ్లను మాగబెట్టడానికి కెమికల్స్ వాడకాన్ని నిషేధించిన ప్రభుత్వం ఇలాంటి ఫ్యాక్టరీకి ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. కార్యక్రమంలో కిసాన్ సంఘ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, నంది రైతు సమాఖ్య అధ్యక్షుడు ఎర్రబోలు ఉమామహేశ్వరరెడ్డి, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, రాయలసీమ జలసాధన సమితి కన్వీనర్ ఏర్వ రామచంద్రారెడ్డి, హరినాథరెడ్డి పాల్గొన్నారు.
ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి..
కొండజూటూరు గ్రామ ప్రజల అభిప్రాయాలను గౌరవించి నానో ఫ్యాక్టరీ నిర్మాణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని సీపీఐ డివిజన్ కార్యదర్శి మస్తాన్‌వలి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నంద్యాల ప్రాంతంలో మూతపడ్డ స్పిన్నింగ్ మిల్లు, చక్కెర ఫ్యాక్టరీలను ప్రారంభించాలని కోరారు.