పరిశ్రమలతో పొంచి ఉన్న ప్రమాదం
- ఏయూలోని జాతీయ సదస్సులో మంత్రి ‘గంటా’ ఆందోళన
- త్వరలో సేఫ్టీ అడిట్ చేయించనున్నట్టు వెల్లడి
- పోర్టు కాలుష్యాన్ని నియంత్రించాలని సూచన
ఏయూ క్యాంపస్ : నగరం చుట్టూ ఉన్న ఎన్‌టీపీసీ, స్టీల్‌ప్లాంట్, ఫార్మా, కెమికల్ పరిశ్రమలతో ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర విద్య, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వీటిపై త్వరలో సేఫ్టీ అడిట్ చేయిస్తామని వెల్లడించారు. పోర్టు కాలుష్యాన్ని సైతం నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
విశాఖ నగరం బాంబ్‌పై కూర్చున్నట్టుగా దర్శనమిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో సోమవారం ‘పర్యావరణంపై ఉద్గారాలు, మలిన పదార్థాల ప్రభావం’ అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. పరిశ్రమల స్థాపన ద్వారా సాధించే ప్రగతికంటే ప్రజారోగ్యమే ప్రధానమన్నారు. చిన్నపాటి మానవ తప్పిదాలు ప్రాణాలను హరిస్తున్నాయని, దీనిని ఇటీవల ప్రమాదాలే స్పష్టం చేశాయన్నారు. విశాఖను గ్రీన్ సిటీగా మలిచే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలనాన్నరు.
పచ్చదనం పెంచితేనే నిర్మాణ అనుమతులు ఇవ్వాలనే ప్రతిపాదన ఉందన్నారు. ఏయూ వీసీ జి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ గ్రీన్‌హౌస్ గ్యాస్‌లు, విద్యుత్ అయస్కాంత తరంగాల ప్రభావం మానవుని ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతున్నాయన్నారు. సదస్సు చైర్మన్ ఆచార్య పి.ఎస్.అవధాని మాట్లాడుతూ సదస్సుకు 102 పరిశోధన పత్రాలను విభిన్న అంశాలపై సమర్పించనున్నట్టు తెలిపారు.
సమస్యను గుర్తించడం, విశ్లేషించడం, పరిష్కారాలను చూపడం సదస్సు ఉద్దేశంగా పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్ డెరైక్టర్(ప్రాజెక్ట్స్) పి.సి.మహాపాత్రో మాట్లాడుతూ తమ పరిశ్రమలో 90 శాతం వ్యర్థాలను పునర్వినియోగం చేస్తున్నట్టు తెలిపారు. పరిశ్రమలో 43 శాతం పైగా హరితవనంగా చేశామన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమ ప్రత్యేక సంచికను మంత్రి విడుదల చేశారు. ఆదికవి నన్నయ వర్సిటీ వీసీ పి.జార్జి విక్టర్, జేఎన్‌టీయూ కాకినాడ వీసీ జి.తులసీరామ్ దాస్, ఏయూ రెక్టార్ ఇ.ఎ.నారాయణ, రిజిస్ట్రార్ కె.రామ్మోహనరావు, ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రమూర్తి, ఆదికవి నన్నయ వర్సిటీ రిజిస్ట్రార్ కె.రఘుబాబులతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.