తప్పిన పెనుముప్పు | rtc bus chemical tanker | Sakshi
Sakshi News home page

తప్పిన పెనుముప్పు

Published Mon, Feb 13 2017 10:49 PM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM

తప్పిన పెనుముప్పు

తప్పిన పెనుముప్పు

ఆర్టీసీ బస్‌ను ఢీ కొట్టిన కెమికల్‌ ట్యాంకర్‌
18 మంది ప్రయాణికులకు గాయాలు
క్షతగాత్రులకు తుని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స
ఇద్దరి పరిస్థితి విషమం : కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు  
ట్యాంకర్‌ బోల్తా పడడంతో రోడ్డుపై ప్రవహించిన కెమికల్‌
కెమికల్‌ తెట్టుపై జారిపడిన వాహనచోదకులు 
గంటన్నర సేపు ట్రాఫిక్‌ నిలిపివేత
కెమికల్‌ మండకుండా నీరు, ఫోమ్‌ వెదజల్లిన ఫైర్‌ సిబ్బంది
అన్నవరం : అన్నవరం శివారులోని మండపం జంక్షన్‌ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 10 గంటలకు ఆర్టీసీ బస్‌ను టైల్స్‌ క్లీనింగ్‌ కెమికల్‌ ట్యాంకర్‌ ఢీ కొన్న ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆంబులెన్స్‌లో తుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్‌ను ఢీ కొట్టి ట్యాంకర్‌ బోల్తా పడ్డంతో కెమికల్‌ అంతా జాతీయ రహదారిపై ప్రవహించింది. దీంతో రోడ్డంతా ఆ కెమికల్‌ తెట్టుతో జిగురుగా అయిపోవడంతో వాటి మీద నుంచి మోటార్‌ సైకిల్‌ మీద ప్రయాణించిన ఇద్దరు జారిపోయి పడిపోయారు. దానికితోడు కెమికల్‌ మండే స్వభావం కలిగినది కావడంతో పోలీసులు సుమారు గంటన్నర సేపు జాతీయ రహదారిపై వాహనాలు నిలిపివేశారు. తుని నుం చి ఫైర్‌ ఇంజిన్‌ను రప్పించి సిబ్బంది సాయంతో నీటి ద్వారా, ఆ పై ఫోమ్‌ ద్వారా ఆ తెట్టును తొలగించి వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. అయి తే అప్పటికీ జిగురు తగ్గక వాహనాల ప్రయాణానికి ఇబ్బందిగా ఉండడంతో రహదారిపై ఇసుక చల్లి వాహనాలు నడిపారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే...
తుని నుంచి రాజమండ్రి వెడుతున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్‌ (ఏపీ 05 జెడ్‌ 0037) ఉదయం పది గంటల సమయంలో అన్నవరం గ్రామంలోకి వచ్చేందుకు జాతీయరహదారిని దాటుతుండగా, విశాఖపట్నం వైపు వెళుతున్న కెమికల్‌ ట్యాంకర్‌ బలంగా ఢీ కొట్టిం ది. దీంతో బస్‌ మధ్యభాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్‌ కూడా 20 మీటర్లు ముందుకు పోయి టెలిఫోన్‌ స్తంభం అడ్డుకోవడంతో ఆగిపోయింది. స్తంభం అడ్డుకోక పోతే బస్‌ రోడ్డు పక్కనే ఉన్న కాల్వలో పడి పోయేది.
నిర్లక్ష్యమే కారణమా..
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కెమికల్‌ ట్యాంకర్‌ వేగాన్ని తక్కువ అంచనా వేసిన ఆర్టీసీ బస్‌ డ్రైవర్, బస్‌ను వేగంగా రోడ్డు దాటించేయచ్చని నడపడంతో ఈ ప్రమా దం జరిగిందని చెబుతున్నారు. మరి కొంతమందైతే రోడ్డు క్రాసింగ్‌ అని కూడా చూడకుండా ట్యాంకర్‌ డ్రైవర్‌ చాలా వేగంగా డ్రైవ్‌ చేస్తూ వచ్చి ఢీ కొ ట్టాడని తెలిపారు.
తుని ఏరియా అస్పత్రిలో చికిత్స
ప్రమాదంలో గాయపడిన 16 మందికి తుని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు.  ఈ ప్రమాదంలో గాయపడిన చంటిబాబు, బద్దర్రావు పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే వారికి కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. అన్నవరం ఎస్‌ఐ పార్థసారధి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చేయి అడ్డు పెట్టినా ఆపలేదు 
అన్నవరం గ్రామంలోకి వచ్చేందుకు జాతీయ రహదారి దాటుతుండగా ట్యాంకర్‌ డ్రైవర్‌ అత్యంత వేగంగా దూసుకువచ్చి బస్‌ను ఢీ కొట్టాడని బస్‌ డ్రైవర్‌ ఏసు చెప్పాడు. అప్పటికీ  కెమికల్‌ ట్యాంకర్‌ను ఆగమని తాను చేతితో సైగ చేసినా ఆపకుండా వచ్చి ఢీ కొట్టాడని తెలిపాడు. బస్‌ ప్రమాదానికి గురైన సమయంలో బస్‌లో 20 మంది వరకూ ప్రయాణికులు, అన్నవరం డిగ్రీ కళాశాల, జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఉన్నారని తెలిపారు.
క్షతగాత్రులకు ఆర్టీసీ పరిహారం
తుని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఎనిమిది మందికి ఆర్టీసీ తరుపున పరిహారం అందజేసినట్లు తుని ఆర్టీసీ డిపో మేనేజర్‌ రామకృష్ణ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ స్వల్ప గాయాలైనవారికి రూ.500, తీవ్ర గాయాలైనవారికి రూ.వేయి అందజేశామన్నారు. నలుగురు ప్రయాణికులు మాత్రం పరిహారం తీస్కునేందుకు నిరాకరించారని తెలిపారు. నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలవడంతో వారు ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వెళ్లిపోయారని తెలిపారు. ఇద్దరికి మెరుగైన చికిత్స కోసం కాకినాడ ఆస్పత్రికి తరలించారని, అక్కడ వారికి కూడా పరిహారం అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కాగా, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతుందని, డ్రైవర్‌ నిర్లక్ష్యం మని తేలితే చర్యలు తీసుకుంటామన్నారు.
తునిలో చికిత్స పొందుతోన్న క్షతగాత్రులు
కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన 18 మందిలో 12 మందికి తుని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. వీరి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు వెళ్లిపోయారని వారు తెలిపారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement