తెలుగు వెలుగు బస్సు
గ్రామీణులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఆర్టీసీ తెలు గు వెలుగు పేరుతో బస్సులు నడుపుతోంది. పదేళ్ల క్రితం వరకు ఇవి బాగా నడిచేవి. పాలకుల నిర్లక్ష్యంగా వ్యవహరించడం..ప్రయివేటు వాహనాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవ డం, వాటిపై నియంత్రణ లేకపోవడంతో ఆర్టీసీ బస్సులకు నష్టాలు రావడం మొదలుపెట్టాయి. ప్రయివేటు వాహనాలను అడ్డుకోవాల్సిన అధికారులు దాన్ని పక్కనబెట్టి నష్టాల పేరుతో ఆర్టీసీ బస్సులను నిలిపేయడం ప్రారంభించారు. ఈ కారణంగా సంస్థకు నష్టాలు తగ్గకపోగా ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు.
మదనపల్లె అర్బన్: ఆధ్యాత్మికంగా పేరుగాంచిన మన జిల్లాలో యాత్రికుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ, నగర ప్రాంతాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రయాణికులూ రోజూ వేలల్లో ఉంటారు. వీరికి తెలుగు వెలుగు బస్సులు ఎంతో సౌకర్యంగా ఉన్నాయి. నష్టాల పేరుతో వాటిని ప్రతియేటా తగ్గించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాలోని 14 డిపోల పరిధిలో ఆరేళ్ల క్రితం 714 పల్లె వెలుగు బస్సులు ఉండేవి. ప్రస్తుతం వాటిని 598కి తగ్గించేశారు. అత్యధికంగా పీలేరు డిపోలో గత ఏడాది 76 సర్వీసులుండగా ఈ ఏడాది మూడు బస్సులు పెంచారు. మిగిలిన అన్ని డిపోల్లో తగ్గించారు. తెలుగు వెలుగు బస్సులకు కి.మీకు రూ.27 ఖర్చు అవుతుండగా చాలా ప్రాంతాల్లో రూ.పది నుంచి 15 మధ్య వస్తోందని అధికారులు చెబుతున్నారు. గ్రామాలకు ఆర్టీసీ సర్వీసు నడపటం ద్వారా కిమీకు రూ.15 నష్టపోవాల్సి వస్తోందని అంటున్నారు. ఆర్టీసీ అధికారుల వాదన ఇలా ఉండగా ప్రయివేటు వాహనాల వల్ల రోజుకు రూ.43.61 లక్షలు, నెలకు దాదాపు రూ.13 కోట్లు నష్టం వస్తోందని అంచనా. గ్రామాలకు సర్వీసులు తక్కువగా ఉండటం వల్లే ప్రయివేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని గ్రామీణులు చెబుతున్నారు. రద్దీకి తగ్గట్లు బస్సులు నడిపితే ప్రయివేటు వాహనాల హవా తగ్గించవచ్చునని అంటున్నారు.
భారీగా తగ్గిన బస్సులు..
మదనపల్లె ఒకటో డిపో నుంచి రెండు నెలల కాలంలో 12 తెలుగు వెలుగు సర్వీసులను నిలిపేశారు. మదనపల్లె నుంచి బురకాయలకోట మీదుగా బి.కొత్తకోటకు 30 ఏళ్లుగా నడుపుతున్న గోళ్లపల్లి సర్వీసులో ఒక ట్రిప్పును నిలిపేశారు. సదుం–చింతామణి సర్వీసును ఏడాది కిందట రద్దు చేశారు. ప్రస్తుతం మదనపల్లె ఒకటో డిపోలో 79, రెండో డిపోలో 68, పీలేరులో 79, పలమనేరులో 54, చిత్తూరు ఒకటో డిపోలో 32, రెండో డిపోలో 43, కుప్పంలో 57, పుత్తూరులో 54, సత్యవేడులో 35, శ్రీకాళహస్తిలో 43, తిరుపతిలో 43, మంగళంలో 11 తెలుగు వెలుగు బస్సులు నడుస్తున్నాయి.
సిటీ బస్సుల నష్టాలకూ ఇదే కారణం..
తిరుపతిలో సిటీ బస్సులు కూడా నష్టాలే మిగులుస్తున్నాయి. సర్వీసుల మధ్య కాలవ్యవధి ఎక్కువగా ఉండటం, ప్రైవేటు వాహనాలు తిరుగుతుండటమే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఆర్టీసీ అధికారులు ఉన్నతాధికారులకు నెలనెలా నివేదికలు అందిస్తున్నా అవి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రయివేటు వాహనాలను అడ్డుకోవడమేగాక, సర్వీసులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వైఎస్సార్ జిల్లాలో విజయవంతం..
ఆర్టీసీ పరిరక్షణ పేరుతో వైఎస్సార్ జిల్లాలో అవలంబిస్తున్న విధానం లాభాలు తెచ్చిపెడుతోంది. డిపోల వారీగా నష్టాలు వస్తున్న రూట్లను గుర్తిస్తున్నారు. ప్రైవేటు వాహనాలు అధికంగా తిరుగుతున్న రూట్లను గుర్తించి ఒక డిపో మేనేజరు, ఇద్దరు ట్రాఫిక్ పర్యవేక్షకులు, సెక్యూరిటీ గార్డు, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు చేపడుతున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని ప్రైవేటు వాహనాలకు జరిమానా విధిస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోనివ్వడం లేదు. ఆ రూట్లలో రద్దీకి అనుగుణంగా బస్సులను తిప్పుతుండటంతో లాభాలు తెచ్చి పెడుతున్నాయి. మన జిల్లాలో రోజుకు ఒక బృందం మాత్రమే తిరుగుతుండటంతో కార్యక్రమం ఫలప్రదం కావట్లేదు. ఈ బృందం తిరుగుతున్న రూట్లలో రోజుకు రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment