ఐఐటీలో ర్యాంకు సాధించి, సీటు పొందడం అంటే చిన్న విషయం కాదు. కానీ ముంబైలోని ఓ బస్సు డ్రైవర్ రాం శంకర్ యాదవ్ కవల పిల్లలు ఇద్దరూ ఒకేసారి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ర్యాంకులు కొట్టి ఆ తండ్రికి రెట్టింపు ఆనందాన్నిచ్చారు. రాం యాదవ్, శ్యాం యాదవ్ అనే ఈ ఇద్దరు కవల పిల్లలకు ఐఐటీలలో సీట్లు సాధించేంత ర్యాంకులు వచ్చాయి. రాం యాదవ్కు ఓబీసీ విభాగంలో 267వ ర్యాంకు రాగా, శ్యాం యాదవ్కు అదే విభాగంలో 1816వ ర్యాంకు వచ్చింది. తమ తల్లిదండ్రులకు తాము ఈ పరీక్షలో ఉత్తీర్ణులు అయినట్లు తెలుసు గానీ, వారికి దీని ప్రాధాన్యం అంతగా తెలియదని, తమ కవల సోదరులిద్దరికీ మాత్రం లక్ష్యాలు సాధించడంలో ఇది మొదటి అడుగని రాం యాదవ్ చెప్పాడు. తామిద్దరం కూడా పరిశోధన రంగంలోకే వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపాడు.
భివాండీ మురికివాడలో పుట్టి పెరిగిన ఈ డ్రైవర్ కుటుంబం.. తమ పిల్లలు కుటుంబ పోషణకు సరిపడ సంపాదిస్తే చాలని రాం శంకర్ యాదవ్ భావించాడు. ప్రస్తుతానికి వారి కుటుంబ ఆదాయం 8 వేల రూపాయలు. అయినా ఎలాగోలా వారిని ఇన్నేళ్ల పాటు చదివించాడు. ఎలాంటి కోచింగ్ లేకుండానే పదోతరగతి, ఇంటర్ పరీక్షలు పాసైన కవల సోదరులు.. జేఈఈకి మాత్రం ఫిట్జీలో కోచింగ్ తీసుకున్నారు. యాప్టిట్యూట్ టెస్టులో మంచి ప్రతిభ కనిపించడంతో ఈ కోచింగ్ కూడా ఉచితంగానే అందింది.
ర్యాంకులు వచ్చాయని ఆ కుటుంబం సంబరపడుతున్నా.. ఇప్పుడు వాళ్లిద్దరికీ ఫీజులు కట్టడానికి డబ్బు ఎక్కడినుంచి తేవాలన్నది ఆ కుటుంబానికి పెద్ద సమస్యగా మారింది. ఐఐటీ అంటేనే భారీమొత్తంలో ఫీజులుంటాయి. పైపెచ్చు, ఒకేసారి ఇద్దరికీ కట్టాలి. నెలకు 8వేల రూపాయల జీతం మాత్రమే సంపాదించే ఆ బస్సు డ్రైవర్.. ఈ భారాన్ని ఎలా మోయాలో తెలియక సతమతం అవుతున్నాడు.
బస్సు డ్రైవర్ కవలలు.. ఐఐటీ కొట్టారు!!
Published Fri, Jun 20 2014 1:26 PM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM
Advertisement