
అమెరికాను మించిపోయారు..!
ప్రపంచ దేశాల్లో జనాభా విషయంలో ముందున్న చైనా.. ఇప్పుడు ఇంటర్నెట్ వాడకంలోనూ రికార్డు సృష్టిస్తోంది. నెట్వర్క్ వాడకందార్లు ప్రతి సంవత్సరం రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నట్లు తాజా నివేదికలు చెప్తున్నాయి. ప్రపంచంలోనే అన్ని దేశాలకన్నా ఇంటర్నెట్ వాడకంలో చైనా ప్రజలే ముందున్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. దీన్నిబట్టి చైనా నెటిజన్ల సంఖ్య అమెరికా జనాభాతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువని తెలుస్తోంది.
దేశ జనాభాలో 90 శాతం మంది నెటిజన్లు ఉన్నారని చైనా అధికారికంగా వెల్లడించింది. దేశంలో ఇంటర్నెట్ వాడకందార్ల సంఖ్య గత సంవత్సరం సుమారు 70 కోట్లకు చేరింది. 2015 నాటికి చైనాలో నెటిజన్ల సంఖ్య 68.8 కోట్లు ఉన్నట్లు చైనా ఇంటర్నెట్ నెట్ వర్క్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (సీఎన్ఎన్ఐసీ ) తెలిపింది. ఈ లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో సగం మంది ప్రజలు నెట్ వాడుతున్నట్లు అర్థమౌతోంది. వీరిలో 90 శాతం మంది మొబైల్ ఫోన్లలోనే ఇంటర్నెట్ వాడుతున్నట్లు సీఎన్ఎన్ఐసీ లెక్కలు చెప్తున్నాయి. ఇకపోతే మూడింట ఒక వంతు డెస్క్ టాప్ కంప్యూటర్ల నూ, సుమారు నలభై శాతం మంది ల్యాప్ టాప్ల్లో నెట్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.
అన్లైన్ వాడేవారి సంఖ్య పెరగడంవల్ల చైనాలో ఇటీవలి సంవత్సరాలలో టెక్ సంస్థలు బ్రహ్మాండమైన వృద్ధిని చవి చూస్తున్నట్లు నిపుణులు సైతం చెప్తున్నారు. జనాభా సంఖ్యతోపాటు, గ్రేట్ వాల్తో ప్రత్యేక గుర్తింపు కలిగిన చైనా ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యలోనూ ప్రపంచంలోనే ముందు స్థానంలో నిలుస్తోంది.