సాక్షి, న్యూఢిల్లీ : చైనాతోపాటు ప్రపంచ దేశాల ప్రజలను ప్రాణాంతకమైన ‘కోవిడ్–19’ వైరస్ భయాందోళనలకు గురిచేస్తుంటే, దానిపై రాజకీయ నాయకుల నుంచి సోషల్ మీడియా యూజర్ల వరకు తెలిసీ తెలియక ఛలోక్తులు విసురుతున్నారు. వైరస్ సోకకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయమై కొంతమంది తాము గుడ్డిగా నమ్ముతున్న సూచనలు చేస్తుంటే, మరి కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఛలోక్తులు విసురుతున్నారు. అందరి సూచనలు అన్నీ నిజం కాకపోయినా కొందరి సూచినల్లో కొన్నైనా అర్ధ సత్యాలు లేకపోలేదు. ఏది ఏమైనా వారి సూచనలు, వ్యాఖ్యలు, ఛలోక్తులు భయాందోళనల మధ్య ప్రజలకు కాస్త ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. (హృదయాలను కదిలిస్తున్న ఫొటో)
యోగా ద్వారా కరోనా వైరస్‌ను నయం చేయవచ్చని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెలవిచ్చారు. క్యాన్సర్‌ను నయం చేసే గుణాలు కలిగిన గోమూత్రం, ఆవు పేడతో కరోనా వైరస్‌ను నయం చేయవచ్చని అస్సాంకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ సూచించారు. ఆమెకు నెత్తిలో ఓ పేడ తట్ట, చేతిలో గో మూత్రం బకెట్ ఇచ్చి కరోనా బాధితుల నిర్బంధ చికిత్సా శిబిరాలకు పంపించాలంటూ నెటిజన్లు హాస్యోక్తులు కూడా విసిరారు. (కరోనా జయించాలంటే ఇవి తినాలి)
గంజాయి దమ్ము బిగించి కొడితే కరోనా వైరస్ పత్తా లేకుండా పోతుందని ఓ హిందూత్వ సిద్ధాంతకర్త వివేక్ అగ్నిహోత్రి సెలవిచ్చారు. గంజాయిపై ప్రభుత్వ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. పురాణకాలంలో యోగులు, మునులు గంజాయిని సేవించడం ద్వారా అన్ని వైరస్‌లను జయించారంటూ ఆయనకు ఆయన మిత్రులు వంతపాడారు. (కరోనా వ్యాప్తికి విరుగుడు కనిపెట్టిన ప్రధాని)
కరోనా బారిన పడకుండా తప్పించుకోవడం కోసం ఆత్మీయ పలకరింపు కోసం పరస్పరం కరచాలనం చేయడానికి బదులుగా ‘నమస్తే’ ఎంతో ఉత్తమమైనదంటూ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సూచించడమే కాకుండా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజామిన్ నెతన్యాహు కూడా సిఫార్సు చేశారు. ఆ మాటకొస్తే ‘వేయి రోగాల పుట్టరా ఈ అరచేయి, ఇక చాలు చాలు కరచాలనాలు చాలు, దండమెట్టేవాడేరా ధన్యజీవి’ అంటూ తెలుగు గేయ రచయిత చైతన్య ప్రసాద్ రాసిని పాట కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. (కోవిడ్.. కంగారు వద్దు)
‘హ్యాపీ బర్త్ డే టు యు’ అంటూ రెండుసార్లు పాడితే ఎంత సమయం పడుతుందో అంత సమయం పాటు సబ్బు, ఆల్కహాల్ లేదా శానిటైజర్స్‌తో చేతులు కడుక్కోవాలంటూ సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థనే సూచించింది. చేతులు ఉత్సాహంగా కడుక్కునేందుకు ఈ పాటలు వినండంటూ ‘హూ హా...జస్ట్ ఏ లిటిల్ బిట్, టేకాన్ మీ ఆహా, జాన్ కేజ్, ఎనీ డ్రీమ్ విల్ డూ’ అంగ్ల పాటలను నెటిజెన్లు సూచిస్తున్నారు. ‘ఆల్కహాల్ కిల్స్ కరోనా వైరస్’ చమత్కరిస్తున్నవాళ్లూ లేకపోలేదు. మరికొందరు కరచాలనాలకు బదులు కాళ్లతో ఇలా స్పర్శించుకోవడం ఉత్తమోత్తమ మార్గమంటూ వీడియోలు తీసి షేర్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment