సాధారణ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం శరవేగంగా చేస్తోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల జాబితాను సిద్ధం చేశారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం : సాధారణ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం శరవేగంగా చేస్తోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల జాబితాను సిద్ధం చేశారు. లోక్‌సభ, శాసనసభ స్థానాల ఓటర్ల జాబితా, పోలింగ్ బూత్‌లు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని గుర్తించారు. ఎన్నికల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని అంచనా వేశారు. ఈ నివేదికను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ పంపారు. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలకు జూన్ ఒకటిలోగా ఎన్నికలు నిర్వహించి, కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు చేయాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో మరో మూడు వారాల్లోగా ఎన్నికల షెడ్యూలును విడుదల చేయనున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటరు జాబితాను జనవరి 31న కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ విడుదల చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకూ ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు నిర్విరామంగా చేస్తారు. నోటిఫికేషన్ వెలువడే రోజున తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు. అదే జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం హైదరాబాద్‌లో కేంద్ర ఎన్నికల సంఘం డెరైక్టర్ జనరల్ పీకే దాస్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ నేతృత్వంలో జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు.
అధికారవర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు.. జిల్లాలో అనంతపురం, హిందూపురం లోక్‌సభ స్థానాలు, 14 శాసనసభ స్థానాల పరిధిలో 3,310 పోలింగ్ బూత్‌లను గుర్తించారు. పోలింగ్ నిర్వహణకు 7,282 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు అవసరమని తేల్చారు.
ఎన్నికల నిర్వహణకు 14,240 మంది సిబ్బంది అవసరం అవుతారని అంచనా వేశారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు రూ.45 కోట్లతో అంచనాలను రూపొందించారు. ఆ మేరకు నివేదికను కేంద్ర ఎన్నికల సంఘం డెరైక్టర్ జనరల్ పీకే దాస్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ నివేదించినట్లు సమాచారం. ఈ సమావేశంలోనే లోక్‌సభ, శాసనసభ స్థానాల రిటర్నింగ్ అధికారుల జాబితాను కూడా ఎన్నికల సంఘానికి కలెక్టర్ అందజేశారు. ఈ జాబితాపై ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేశాక రిటర్నింగ్ అధికారులను అధికారికంగా ప్రకటిస్తారు.