అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలే శ్రీరామరక్షలా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ అన్నారు. ఐదేళ్లలోపు పిల్లలు పోలియో వ్యాధి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యాక్సిన్ వేయించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పల్స్‌పోలియోపై అవగాహన కల్పించేందుకు నగరంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి టవర్‌క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకూ కొనసాగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 19 నుంచి 21 వరకూ జరిగే పల్స్‌పోలియోను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. 19న బూత్‌స్థాయిలో, 20,21 తేదీల్లో ఇంటింటికీ తిరిగి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు, ప్రార్థన స్థలాలు, పార్కులు, జన సంచారం ఉన్న అన్ని ప్రదేశాల్లో పోలియో చుక్కలు వేసేలా చూస్తున్నామన్నారు.
జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు సుమారు 4.37 లక్షల మంది ఉన్నారని, వీరికి 3849 కేంద్రాల్లో పోలియో చుక్కలు వేస్తామని వెల్లడించారు. జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ సంచార జాతులు, వలస కుటుంబాలు, మురికివాడలు, శివారు ప్రాంతాల్లోని చిన్నారులకు కూడా పోలియో వ్యాక్సిన్ అందేలా చూడాలని సిబ్బం దిని ఆదేశించారు. పల్స్ పోలియోను విజయవంతం చేస్తామని అందరితోప్రతిజ్ఞ చేయించా రు. కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ రామసుబ్బారావు, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ వెంకటరమణ, డీఐఓ డేవిడ్ దామోదరం, నారాయణస్వామి, నగర పాలక సంస్థ కమిషనర్ రంగయ్య, డాక్టర్ అక్బర్ సాహెబ్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు పెరుమాళ్ పాల్గొన్నారు.