సాక్షి ప్రతినిధి, అనంతపురం : నీటిపారుదల సలహా మండలి(ఐఏబీ)ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందా? ఐఏబీని సంప్రదించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నీటి కేటాయింపులు చేయడం జలయుద్ధాలకు దారితీస్తుందా? రాజకీయ ఆధిపత్యం కోసం ఆరాటపడుతోన్న ప్రజాప్రతినిధులు ప్రజాభ్యుదయాన్ని విస్మరిస్తున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి అధికారవర్గాలు.
పభుత్వం ఐఏబీని డమ్మీని చేస్తోందంటూ కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ శనివారం నిర్వేదం వ్యక్తం చేయడం అందుకు బలం చేకూర్చుతోంది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్) నుంచి పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు నీటి విడుదలను మరికొన్ని రోజులు పొడిగించాలని కోరిన వైఎస్సార్ జిల్లా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డితో జిల్లా కలెక్టర్ ఆ విధంగా వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే.. 2013 జూన్ 24న టీబీ బోర్డు సమావేశంలో హెచ్చెల్సీ(తుంగభద్ర ఎగువ కాలువ)కి 22.995 టీఎంసీలు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.
ఇందులో తాగునీటికి 5.715 టీఎంసీలు, నీటి ప్రవాహ, ఆవిరి రూపంలో 7.535 టీఎంసీల జలాలు వృథా అవుతాయని లెక్కకట్టిన హెచ్చెల్సీ అధికారులు 9.745 టీఎంసీలతో 90 వేల ఎకరాలకు నీళ్లందించాలని ప్రతిపాదించారు. ఆ మేరకు ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. అక్టోబరు 18న మరోసారి సమావేశమైన టీబీ బోర్డు.. డ్యామ్‌లో నీటి లభ్యత 150 టీఎంసీల నుంచి 133 టీఎంసీలకు తగ్గిందని సాకు చూపి, తొలుత కేటాయించిన నీటిలోనే 0.99 టీఎంసీలు కోత వేశారు. నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారింది. హెచ్చెల్సీ అధికారులు తీవ్ర ఒత్తిళ్లకు గురయ్యారు.
పెన్న అహోబిలం రిజర్వాయర్(పీఏబీఆర్) కోటా విడుదలైతే గానీ జిల్లా ప్రజల దాహార్తి తీర్చలేమని కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి నివేదికలు పంపారు. టీబీ డ్యామ్‌లో కేసీ కెనాల్ కోటా పది టీఎంసీలను రివర్సబుల్ డైవర్షన్ పద్ధతిలో పీఏబీఆర్‌కు కేటాయిస్తూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈ కోటా కింద ఈ ఏడాది 6.7 టీఎంసీలను విడుదల చేయడానికి బోర్డు అంగీకరించింది. కానీ.. ఆ నీటిని కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ అంశంపై కలెక్టర్ పదే పదే లేఖలు రాయడంతో ఎట్టకేలకే ప్రభుత్వం స్పందించింది. తొలుత రెండు టీఎంసీలు.. రెండు రోజుల క్రితం మరో రెండు టీఎంసీలు విడుదల చేయడానికి అంగీకరించింది. ఈ కోటా ఈ నెల 11తో పూర్తికానుంది. అందుబాటులో ఉన్న నీటిని అంచనా వేసుకున్న కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్.. ఆయకట్టుకు నీళ్లందిస్తూ తాగునీటికీ ప్రాధాన్యమిస్తూ వచ్చారు. తాడిపత్రి బ్రాంచ్ కెనాల్, పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఆయకట్టుకు మరో పది రోజులు నీళ్లందిస్తే పంటలు పూర్తవుతాయి.
నాలుగు నెలలకే తాగునీళ్లు..
ప్రస్తుతం పీఏబీఆర్‌లో రెండు టీఎంసీలు, సీబీఆర్‌లో 1.28 టీఎంసీలు, మిడ్ పెన్నార్‌లో 1.06 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లోని ప్రజల దాహార్తి తీర్చడానికి కనీసం 5.715 టీఎంసీల జలాలు అవసరం. కానీ.. ఆ మేరకు జలాలు అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. తాగునీటి కోసం ప్రతి రోజూ సగటున 400 క్యూసెక్కుల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. అంటే.. నెలకు 1.2 టీఎంసీల జలాలు తాగునీటికి అవసరం. ఈ లెక్కన ప్రస్తుతం అందుబాటులో ఉన్న జలాలు నాలుగు నెలలకు కూడా సరిపోవు. హంద్రీ-నీవా ద్వారా ఎత్తిపోసిన జలాల్లో జీడిపల్లి రిజర్వాయర్‌లో 1.6 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. జీడిపల్లి, పీఏబీఆర్, ఎంపీఆర్, సీబీఆర్‌ల్లో 5.94 టీఎంసీలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ జలాలు తాగునీటి కోసం సరిపోతాయి. కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ ఐఏబీ చైర్మన్ హోదాలో ఇదే అభిప్రాయాన్ని ప్రభుత్వానికి నివేదించారు. కానీ.. ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోలేదు.
ప్రజాప్రతినిధుల్లో చిత్తశుద్ధి ఏదీ?
నీటి లెక్కలు పట్టని ప్రజాప్రతినిధులు ఆధిపత్యం కోసం ఆరాటపడ్డారు. ఆ క్రమంలోనే ఐఏబీ చైర్మన్ అభిప్రాయంతో నిమిత్తం లేకుండా చాగల్లు రిజర్వాయర్‌కు 1.5 టీఎంసీలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మిడ్ పెన్నార్ డ్యామ్ నుంచి నది ద్వారా చాగల్లుకు నీళ్లందించాల్సి ఉంటుంది. కానీ.. ఆ మేరకు జలాలు అందుబాటులో లేవని అధికారులు స్పష్టీకరిస్తున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ ప్రాంత ప్రజల మన్ననలు పొందేందుకు ప్రజాప్రతినిధులు పోరాడుతోన్న క్రమంలో.. జిల్లాకు అదనపు కేటాయింపులు సాధించుకోవడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా కేటాయింపులు చేసినా.. నీటిని సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. పీఏబీఆర్‌కు కేటాయించిన నాలుగు టీఎంసీల్లో కుడి కాలువ ద్వారా 49 చెరువులకు నీళ్లందించాల్సి ఉంది. 49 చెరువులకు పూర్తిస్తాయిలో నీళ్లందించాలంటే 2.50 టీఎంసీలు అవసరమని హెచ్చెల్సీ అధికారులు తేల్చిచెబుతున్నారు. అదే జరిగితే తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి. నీటి లభ్యత లేదనే సాకు చూపి 49 చెరువులకు నీటిని విడుదల చేయకపోతే వాటి ఆయకట్టు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు. పోనీ.. హంద్రీ-నీవా ద్వారా జిల్లాకు అదనంగా కేటాయించిన నాలుగు టీఎంసీల జలాలనైనా రప్పించడంపై ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపుతారా అంటే అదీ లేదు. కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులు హంద్రీ-నీవాకు నీటిని ఎత్తిపోయనివ్వకూండా రోజూ అడ్డుకుంటున్నారు. కానీ.. ఇది ఇక్కడి ప్రజాప్రతినిధులకు పట్టడం లేదు.
నీటి లెక్కలు.. ఎన్నో చిక్కులు
Published Sun, Jan 5 2014 2:49 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement