కలెక్టరమ్మా.. దయ చూపండి
-
ప్రజావాణికి 378 దరఖాస్తులు
ముకరంపుర: ‘క్షేత్రస్థాయిలో అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయాం.. మా సమస్యలు పట్టించుకున్న వారే కరువయ్యారు.. మీరైనా దయ చూపండి.. మాకు న్యాయం చేయండి’ అంటూ బాధితులు కలెక్టర్ నీతూప్రసాద్‌ను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి బాధితుల తాకిడి కనిపించింది. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 378 మంది అర్జీలు సమర్పించారు. ప్రధానంగా భూసంబంధిత సమస్యలు, ఉపాధి కల్పించాలని, రేషన్‌కార్డులు, పింఛన్లు తదితర సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. కలెక్టర్ నీతూప్రసాద్, జేసీ శ్రీదేవసేన, డీఆర్‌వో వీరబ్రహ్మయ్య తదితరులు అర్జీలు స్వీకరించారు.
– కరీంనగర్ మండలం బొమ్మకల్ శివారులో 724 సర్వే నంబర్‌లోని 1.15 గుంటల భూమిని 17 మంది పట్టాదారుల నుంచి ఖరీదు చేసి ఆస్తి మార్పిడి చేసుకుని గ్రామ పంచాయతీ అనుమతితో ఇళ్లు కూడా నిర్మించుకున్నామని, ఆ భూమిని ఇద్దరు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని బూదిరెడ్డి వెంకటయ్య కలెక్టర్‌కు ఫిర్యాదుచేశాడు. వారికి తహసీల్దార్, ఆర్‌ఐలు సహకరించి సదరు వ్యక్తులకు ఆస్తిమార్పిడి చేసి వ్యవసాయ భూమిగా పట్టాదారు పాస్‌బుక్కులు జారీ చేశారని తెలిపారు. విచారించి న్యాయం చేయాలని కోరారు.
–సుల్తానాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్టులో కొన్నేళ్లుగా ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్‌గా సరుకులు సరఫరా చేస్తున్న తనపై అసత్యపు ఆరోపణలతో ఎలాంటి నోటీసులివ్వకుండా తొలగించారని బత్తిని నారాయణగౌడ్ కలెక్టర్‌కు విన్నవించారు. ఈ విషయమై ఆర్‌జేడీకి ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించినా పట్టించుకోవడంలేదని తెలిపారు. ఈఎండీ రూ.50వేలు రావాల్సి ఉందని, తప్పును రుజువు చేయకుండా సుల్తానాబాద్ సీడీపీవో దాటవేస్తున్నారని, విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు.
–జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల కార్యాలయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో పెట్టాలని బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ మిర్యాల్‌కర్ నరేందర్ కలెక్టర్‌ను కోరారు. మోడీ అనేక ప్రజాసంక్షేమ పథకాలతో దేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటుతున్నారని తెలిపారు.
–జిల్లా కేంద్రంలో అదనంగా కళాశాలల స్థాయి బీసీ బాలుర, బాలికల వసతి గృహాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ బీసీ వెల్ఫేర్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కేశిపెద్ది శ్రీధర్‌రాజు ఆధ్వర్యంలో కలెక్టర్ నీతూప్రసాద్‌కు వినతి పత్రం సమర్పించారు. జిల్లా కేంద్రంలో మూసివేసిన నాలుగు బీసీ వసతి గృహాలను ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరారు.