ప్రజావాణి వినతులకు పరిష్కారమేది?
ఫిర్యాదుదారుల ఆవేదన
కాకినాడ సిటీ : సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కలెక్టరేట్ ప్రజావాణిలో అందిస్తున్న వినతులకు న్యాయం జరగక పదేపదే తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అర్జీదారులు ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా దివ్యాంగులు ఇక్కట్ల పాలౌతున్నారు. పిఛన్లు, ట్రై సైకిళ్ళు మంజూరు కోరుతూ ఇచ్చిన అర్జీలకు పరిష్కారం లభించడం లేదని వాపోతున్నారు. తమ అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని పలువురు విజ్ఞప్తిచేస్తున్నారు.
ప్రజావాణికి 220 వినతులు
కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి సుమారు 220 అర్జీలు అందాయి. కలెక్టర్ అరుణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి అర్జీదారుల నుంచి వినతులు తీసుకుని సంబంధిత శాఖల జిల్లా అధికారులకు పరిష్కార ఆదేశాలు జారీ చేశారు. వ్యక్తిగత సమస్యలు, పింఛన్లు, ఉపాధి, సంక్షేమ పథకాలు, రుణాలు, భూ సర్వే చేయాలని, ఇళ్ల మంజూరు తదితర అంశాలపై అర్జీలు అందాయి.