సత్వరమే పరిష్కరించాలి | Collector Swetha Mahanthi In Prajavani Programme | Sakshi
Sakshi News home page

సత్వరమే పరిష్కరించాలి

Published Tue, Apr 24 2018 11:17 AM | Last Updated on Thu, Mar 21 2019 8:29 PM

Collector Swetha Mahanthi In Prajavani Programme - Sakshi

ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ శ్వేతామహంతి

వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ శ్వేతామహంతి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు 120 ఫిర్యాదులు అందినట్లు గ్రీవెన్స్‌ సెల్‌ అధికారరులు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులలో ఎక్కువగా భూములు, పింఛన్లు, నీటి సమస్యలు పరిష్కరించాలని, గ్రామాల్లో బెల్టుషాపులను తొలగించాలని, మిషన్‌ కాకతీయ పనుల్లో నాణ్యతను పరిశీలించాలని ఫిర్యాదులు వచ్చాయి. వాటిని సంబంధిత శాఖలకు సిఫారస్‌ చేస్తూ.. ఫిర్యాదుదారులకు రశీదులు ఇచ్చి పంపించారు. కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్‌తోపాటు ఇన్‌చార్జ్‌ జేసీ చంద్రయ్య ఫిర్యాదులు స్వీకరించారు. అలాగే, జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయంలో ఒకేఒక్క జూనియర్‌ అసిస్టెంట్‌ ఉన్నారు. తగినంత మంది సిబ్బంది లేక ప్రభుత్వం కార్మికుల కోసం ప్రవేశపెట్టిన చాలారకాల దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. కార్మికులకు అందాల్సిన చెల్లింపులలో తీవ్ర జాప్యం నెలకొంటుందని భవన నిర్మాణ సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు.

ఊర్లోలేరని.. భూమి స్వాధీనం
భర్త చనిపోవడంతో పిల్లల పోషనకు పట్నం పోతే.. మా భూమిని పక్కన ఉన్న రైతులు వారి భూమిలో కలుపుకున్నారు. మా తండ్రికి ఇందిరమ్మ పాలనలో అసైన్డ్‌ చేసిన 1.30 ఎకరాల భూమిని పెళ్లి సమయంలో నాకు రాసిచ్చారు. ముందు నుంచి తామే.. భూమిని సాగు చేసుకుని పంటలు పండించుకున్నాం. ఎవ్వరూ లేరని భూమిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు కలెక్టర్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదు.– చెన్నమ్మ, గోపాల్‌పేట

మంచినీటి సమస్య పరిష్కరించాలి
నాలుగేళ్లుగా వేసవి వ      చ్చిందంటే.. గ్రామంలో తీవ్ర మంచినీటి సమస్య ఉత్పన్నమతుంది. గ్రామానికి చుట్టూ నీరున్నా.. తాగడానికి గుక్కెడు నీటికోసం అవస్థపడాల్సి వస్తోంది. ఈ నెల 19న సమస్యను డీపీఓ దృష్టికి తీసుకువెళ్తే.. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. కలెక్టర్‌ స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలి. – గ్రామస్తులు, ఆరేపల్లి, ఆత్మకూరు మండలం

నా కుమారుడి ఆచూకీ గుర్తించాలి
మా కుమారుడు మహేష్‌ను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌లో చేర్పించాం. అక్కడే హాస్టల్‌లో ఉంచి చదివించాం. గతనెలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిసిన రోజు మహేష్‌ ఇంటికి రాకపోవడంతో కళాశాల యాజమాన్యాన్ని సంప్రదిస్తే మాకు తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లో కేసు రిజిస్టర్‌ చేసి నెలరోజులు పూర్తయినా నేటికీ ఆచూకి తెలియలేదు.
– తల్లితండ్రులు, సాసనూలు, ఇటిక్యాల మండలం

అనధికారిక మద్యం విక్రయాలపై..
మా గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా కిరాణం షాపులలో మద్యం విక్రయిస్తున్నారు. నిత్యం సాయంత్రం అయ్యిందంటే.. గ్రామశివారులలో మద్యం సీసాలతో గుంపులు కనిపిస్తాయి. రోజురోజుకు మద్యం సేవించేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. అనధికారికంగా గ్రామంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను తొలగించాలి.– రాముడు, అశోక్, కంభాళాపురం

ఖాళీ బిందెలతోతండావాసుల నిరసన
గతనెల రోజులుగా మా తండాలో మంచినీటి సమస్య నెలకొందని, అధికారులకు, పాలకులు చెప్పినా.. పట్టించుకోవటం లేదంటూ.. సోమవారం శ్రీనివాసపురం తండాకు చెందిన గిరిజన మహిళలు, పిల్లలు ఖాళీ బిందెలతో కలెక్టరేట్‌కు వచ్చారు. సుమారు గంటపాటు అక్కడే నిరసన తెలిపారు. అధికారులు, పాలకులకు ఈ విషయమై పలుమార్లు విన్నవించినా పటించుకో వడంలేదని ఆరోపించారు. సమస్యను కలెక్టర్‌కు వివరించారు. ఆమె సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో గిరిజన మహిళలు శాంతించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement