కంప్లైంట్ ఈజీ..! | GHMC Prajavani Programme Success | Sakshi
Sakshi News home page

కంప్లైంట్ ఈజీ..!

Published Tue, Jul 30 2019 8:50 AM | Last Updated on Sat, Aug 3 2019 12:40 PM

GHMC Prajavani Programme Success - Sakshi

గ్రేటర్‌ జనాభా కోటి దాటింది. ఇంతమందికి పౌరసేవలందిస్తోన్న జీహెచ్‌ఎంసీ... సమస్యల పరిష్కారానికి, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వివిధ మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
సంప్రదాయ పద్ధతిలో వినతిపత్రాల నుంచి ఆధునిక తరహాలో స్మార్ట్‌ ఫోన్‌ యాప్స్‌ వరకు ఏ విధంగా ఫిర్యాదు చేసినా స్వీకరిస్తోంది. మార్పులకు అనుగుణంగా ప్రజలు తమకు అందుబాటులో ఉండే సాధనం ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్నికల్పిస్తోంది. సమస్యలపై ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసేందుకు జీహెచ్‌ఎంసీ అందుబాటులోకి తీసుకొచ్చిన ఆయా సదుపాయాలపై ‘సాక్షి’ రిపోర్టు.  

కాల్‌ \కాల్‌ సెంటర్‌ 040–21111111  
జీహెచ్‌ఎంసీ పరిధిలో సమస్యలకు సంబంధించి ప్రజలు ఈ నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చు. ఫిర్యాదును బట్టి కాల్‌ సెంటర్‌ సిబ్బంది విభాగం, ఏరియా వారీగా సంబంధిత అధికారికి పంపుతారు. వారు ఫిర్యాదును నమోదు చేసుకొని పరిష్కారానికి కృషి చేస్తారు.  

డయల్‌ 100  
ఇది కూడా జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌ తరహాలోనే పని చేస్తుంది. వరద ముంపు, అగ్నిప్రమాదాలు తదితర అత్యవసర సమయాల్లో నేరుగా 100కు డయల్‌ చేయొచ్చు.

యాప్స్‌/వెబ్‌సైట్స్‌  మై జీహెచ్‌ఎంసీ  
ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా ప్రజలు తమ సమస్య/ఫిర్యాదులను సంబంధిత ఫొటోలతో సహా అప్‌లోడ్‌ చేసి పంపించొచ్చు. తద్వారా లొకేషన్‌ను కూడా సులభంగా గుర్తించి అధికారులు వెంటనే చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది. దీని ద్వారా వివిధ విభాగాల సమస్యలపై ఎప్పుడూ అందుబాటులో ఉండే ఫోన్‌తోనే ఫిర్యాదు చేసే అవకాశం ఉండడంతో దీన్ని ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. ఈ నెల 23 వరకు 8,49,062 మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.  

స్వచ్ఛ విజిల్‌
ఇది కూడా ‘మై జీహెచ్‌ఎంసీ’ లాంటిదే. అయితే ప్రత్యేకంగా స్వచ్ఛత అంశాలు, పారిశుధ్యం సంబంధిత ఫిర్యాదులు మాత్రమే దీని ద్వారా చేయాల్సి ఉంటుంది. చెత్త పేరుకుపోవడం, పరిసరాలు అశుభ్రంగా ఉండడం లాంటి సమస్యలను ఫొటోలు తీసి లొకేషన్ల వివరాలతో పంపిస్తే చర్యలు తీసుకుంటారు.  
 
జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌: జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌ ద్వారా కూడా ప్రజలు ఫిర్యాదు చేయొచ్చు. ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ఫిర్యాదు నమోదు చేయొచ్చు.  

డైరెక్ట్‌ కంప్లయింట్‌ కమిషనర్‌ పేషీ  
ప్రజలు తమ ఫిర్యాదులను జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో నేరుగా కమిషనర్‌కు అందజేయొచ్చు. కమిషనర్‌ పేషీలో ఫిర్యాదు కాపీని అందజేసినా తీసుకొని నమోదు చేసుకుంటారు. సాయంత్రం విజిటర్స్‌ సమయంలో నేరుగా కమిషనర్‌ను కలిసి సమస్యను వివరించడంతో పాటు దాన్ని అందజేయొచ్చు.  

ఫోన్‌ ఇన్‌
ఫోన్‌ ఇన్‌ లాంటి కార్యక్రమాల ద్వారా కమిషనర్‌  ప్రత్యేక సందర్భాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులను
స్వీకరిస్తున్నారు.  

ప్రజావాణి  
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో కమిషనర్, అడిషనల్‌ కమిషనర్లు, ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొంటారు. ప్రజల ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను నమోదు చేసుకొని పరిష్కారానికి కృషి చేస్తారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోన్‌/సర్కిల్‌ కార్యాలయాల్లోనూ ప్రజావాణి నిర్వహిస్తారు. అక్కడి అన్ని విభాగాల అధికారులు పాల్గొంటారు.  

ఇతరత్రా... గ్రీవెన్స్‌ బాక్స్‌  
ప్రజలు తమ ఫిర్యాదులను వేసేందుకు తాజాగా జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లో గ్రీవెన్స్‌ బాక్సులు ఏర్పాటు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ విభాగం వీటిని ఏర్పాటు చేస్తోంది. 

పత్రికల క్లిప్పింగ్స్‌   
ప్రజల నుంచి నేరుగా వచ్చే ఫిర్యాదులే కాకుండా దినపత్రికల్లో ఆయా సమస్యలపై ప్రచురితమయ్యే వార్తా కథనాలు, ఫొటో ఫీచర్లను కూడా పరిగణనలోకి తీసుకొని సంబంధిత విభాగానికి పంపిస్తారు. సంబంధిత అధికారి పరిష్కార చర్యలు తీసుకుంటారు.

పారిశుధ్యంపై విజిలెన్స్‌  
ఇది జీహెచ్‌ఎంసీలోని అంతర్గత వేదిక. నగరంలో ఎక్కడెక్కడ పారిశుధ్యం అధ్వానంగా ఉందో? విజిలెన్స్‌ విభాగం గుర్తించి సంబంధిత అధికారులకు తెలియజేస్తుంది. సత్వర పరిష్కారానికి సమస్యలు నమోదు చేస్తుంది.

సోషల్‌ మీడియా\ఫేస్‌బుక్‌  
జీహెచ్‌ఎంసీ ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా కూడా ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చు. సిబ్బంది ఫిర్యాదును పరిశీలించి సంబంధిత అధికారికి పంపిస్తారు. సదరు అధికారి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.  

ట్విట్టర్‌  
జీహెచ్‌ఎంసీ ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఐటీ ప్రొఫెషనల్స్‌ ఎక్కువ మంది ఫిర్యాదు చేస్తున్నారు. దీన్ని ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వంలోని ముఖ్యులు కూడా చూస్తుండడంతో... ఇటు జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేయడంతో పాటు వారికి కూడా పంపిస్తున్నారు. దీంతో మిగతా అన్ని మార్గాల ద్వారా వచ్చే ఫిర్యాదుల కంటే జీహెచ్‌ఎంసీ అధికారులు దీనికే అధిక ప్రాముఖ్యం ఇస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తామేం పనులు చేశామనేది ఏరోజుకారోజు అధికారులు దీని ద్వారా ఉన్నతాధికారులకు పోస్ట్‌ చేస్తున్నారు. సమస్యను పరిష్కరించిన తర్వాత అధికారులు ఫిర్యాదు ఐడీతో సహా తిరిగి రీట్వీట్‌ చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ట్విట్టర్‌ ఖాతాను అనుసరిస్తున్నవారు లక్ష మందికి మించిపోయారు. దేశంలోనే ఏ మునిసిపల్‌ కార్పొరేషన్‌కూ ఇంతమంది ఫాలోవర్లు లేరు.  

ఫిర్యాదులు ఎక్కువగా మై జీహెచ్‌ఎంసీ యాప్‌ ద్వారా వస్తున్నాయి. ఆ తర్వాతి స్థానంలో కాల్‌ సెంటర్‌ ఉంది.  

అయితే వివిధ వేదికల ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నప్పటికీ... సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌ అందుతోంది. కొందరు అధికారులు సత్వరమే స్పందించడం లేదని తెలుస్తోంది. నిధులుఅవసరమయ్యే వాటి విషయంలో ఆలస్యమవుతోందని అధికారులు పేర్కొంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement